ఇచ్చె ఇచ్చె రాజు…
ఏమిచ్చినాడన..
ముష్టెత్తుకోనిచ్చినాడు!
——————–
అపజయం అనాథ. విజయం సనాథ- విజయం బహునాథ. విన్నర్ టేక్స్ ఆల్. గెలుపును ఓన్ చేసుకోవడానికి లెక్కలేనంతమంది పోటీలు పడతారు. అపజయాన్ని ఓన్ చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే అందరూ ఉన్నా అపజయం అనాథగా ఉండిపోతుంది. గెలిచినవాడు అన్నిటినీ ఊడ్చుకుని పోతాడు. పనికిరాని పరిగెలు కూడా పరాజితుడికి మిగలవు. అనాదిగా ఇది ఆట ధర్మం. అడవిలో ఆటవిక క్రీడ అయినా, జనారణ్యంలో ప్రజాస్వామ్య క్రీడ అయినా ఇదే ధర్మం వర్తిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అన్న మౌలికమయిన పునాది మీద నిర్మాణమయిన ఆధునిక పాలనా వ్యవస్థ. “ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు” అని ఒక ఒక ఆలోచనాపరుడు ఎప్పుడో సిద్ధాంతీకరించాడు.
——————–
ఒక దేశం ఒక సంక్షోభంతో అల్లకల్లోలమవుతోంది. తినడానికి తిండి లేదు. ఉండడానికి ఇల్లు లేదు. కరువులు, కాటకాలు. దుర్భిక్షం. తాగడానికి నీళ్లు కూడా లేవు. రోగాలు, రొప్పులు, నొప్పులు. ఆసుపత్రుల్లో పరుపులు కూడా కరువు. మందులు కరువు. చస్తే శ్మశానంలో చోటు కరువు. ఏడవడానికి కన్నీళ్లు కరువు. అయినా ఆ రాజు పన్నుల వసూలు ఆపడు. ఆదర్శాల ఉపన్యాసాలు ఆపడు. ఇంతటి సంక్షోభంలో కూడా తన సామంత రాజ్యాలు తన రాజ్యం కంటే పన్నులు ఎక్కువ కట్టాలని హుకుం జారీ చేశాడు. మందుల ధరలు కూడా తన రాజ్యంలో కంటే తన సామంత రాజ్యంలో ఎక్కువ. సంక్షోభాన్ని సామంత రాజ్యాలు మోసి- సంతోషాన్ని తన రాజ్యానికి ఇవ్వాలని ఆయన అనుకుంటాడు. ఆ రాజు ఆ దేశం కోసం పరితపించిపోతున్నాడని అనుకుంటున్నట్లుగా కొందరికి అనిపిస్తుంది. అయితే ఆయనకు ఒక బలహీనత ఉంది. అన్నీ తానే చేసినట్లు, అందరికీ అన్నీ తానే ఇచ్చినట్లు సాయంత్రమయ్యే సరికి కొలువులో కవులు పొగుడుతూ భజనపాటలు పాడాలి. ఏమీ ఇవ్వకున్నా ఎన్నో ఇచ్చినట్లు రాజును పొగుడుతూ పాడలేక పాడలేక చివరికి ఒక కవికి ఒళ్లు మండి ఇలా పాడాడట-
Ads
“ఇచ్చె ఇచ్చె రాజు ఏమిచ్చినాఁడన ఇంటిలోపల నుండ నిచ్చినాఁడు పొరుగూళ్ల వెంబడి పోయి ముష్టెత్తుక యింటికి మళ్లి రానిచ్చినాఁడు చలివణంకుకు ప్రక్క శయనంబు లేకుంటె చేతులు ముడుచుకో నిచ్చినాఁడు గాసాని కొకవేళ కలిగి యుండకపోతె
నింటింట పస్తుండ నిచ్చినాఁడు. వీధులందున తిరుగబోనిచ్చినాఁడు భిక్షుకుండని బ్రతుక పోనిచ్చినాఁడు చేసికున్నంత భోంచేయ నిచ్చినాఁడు- ఇట్టి పనులెల్ల రక్షించు నీశ్వరుండు”
పద్యం అర్థం:-
—————
రాజు అదిచ్చాడు, ఇదిచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. మన ఇంట్లో మనల్ను ఉండనిచ్చాడు. పక్క ఊళ్లకు వెళ్లి, అడుక్కుతిని, మళ్లీ మన ఊళ్లోకి రానిచ్చాడు. ఎముకలు కొరికే చలిలో పడుకోవడానికి పరుపు, కప్పుకోవడానికి దుప్పటి లేకపోతే- మన చేతులు దిండుగా పెట్టుకుని పడుకోనిచ్చాడు. తినడానికి ఏమీ లేకపోతే ప్రతి ఇంట్లో పస్తులుండనిచ్చాడు. వీధుల్లో బలాదూర్ గా తిరగనిచ్చాడు. రాజ్యంలో అందరూ భిక్షగాళ్లయి చిప్ప పట్టుకోనిచ్చాడు. ఎవరి శక్తికి తగినట్లు, వారింట్లో వారే భోంచేసుకోనిచ్చాడు. ఇన్ని రకాల లోకోపకార పనులను రక్షించే మా రాజు సాక్షాత్తు ఈశ్వరుడే!
——————–
ఇది ఇప్పటి కథ కాదులెండి. ఎప్పుడో రాజులు ఇష్టారాజ్యంగా పాలన చేసిన వందల, వేల ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం. ఇలా ఎందుకు జరుగుతుంది? జరిగితే మనం ఊరుకుంటామా- ఏమిటి? ప్రజలను పాఠక ప్రభువులుగా, పాఠక దేవుళ్లుగా భావించే మీడియా ఊరుకుంటుందా? చీరి చింతకు కట్టేయదూ!
ఇదేమన్నా రాచరికమా? హమ్మా!!
Share this Article