.
‘‘నిజానికి పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రజలలో మద్దతు లేదు… 1996 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది… అప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు…
చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు… జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు… ఎన్టీఆర్‌ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకు నాటి ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి… దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుది…
Ads
ఈ నేపథ్యంలో కడప పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు… ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్రను ఆదేశించారు… ఉమేష్ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు… మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారు… దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది…
చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకొని పులివెందులలో కాస్త చూసీ చూడనట్టు వెళ్లవలసిందిగా అధికారులను ఆదేశించారు… ఫలితంగా కేవలం ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి గట్టెక్కి పరువు దక్కించుకున్నారు… దీన్నిబట్టి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించగలిగితే పులివెందులలో వైఎస్ కుటుంబానికి చెప్పుకొనేంత సీన్ లేదని అర్థమవుతుంది…
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాలను చూడాల్సి ఉంది…’’ ఇదంతా మొన్నటి జెడ్పటీసీ ఎన్నికల సరళి, ఫలితాలకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మార్క్ విఫల సమర్థన…
సరే, ఆయన చెప్పుకొచ్చిన కారణాల గురించి కాదు గానీ… నిజంగా పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ ఆదరణ లేదా..? బెదిరింపులు, దబాయింపులు, దాష్టీకాల ద్వారానే గెలుస్తూ వస్తోందా..?
.
తను చెబుతున్న ఆ ఎన్నికల సంగతికే వద్దాం… ఆ ఎన్నికల్లో 42 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు రాగా, తెదేపా కూటమి 19 సీట్లు, MIM ఒక సీటు గెలిచాయి… వైయస్సార్ తో పాటు కాంగ్రెస్ నుండి మరో 21 మంది గెలిచారు … వాళ్ళు గెలవగా లేనిది వైయస్సార్ గెలవలేడా… !?
నిజానికి టీడీపీ పుట్టిన తర్వాత 1984 లోకసభ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ కడప నుండి గెలిచింది … ఆ టైంలో వైయస్సార్ అసెంబ్లీలో ఉన్నాడు… ఆ తర్వాత ఇప్పటివరకు టీడీపీ అక్కడ గెలవలేదు …
వైయస్సార్ 1989 , 1991 , 1996 , 1998 ఎన్నికల్లో గెలిచాడు లోకసభకు … వివేకానంద రెడ్డి 1999 , 2004 ఎన్నికల్లో గెలిచాడు… 2009 , 2011ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి… తరువాత 2014 , 2019 , 2024 ఎన్నికల్లో వరుసగా అవినాష్ రెడ్డి గెలిచాడు…
రాష్ట్రం అంతా కూటమి ప్రభంజనం కనిపించిన 2024 ఎన్నికల్లో కూడా అవినాష్ రెడ్డి గెలిచాడు… కూటమి అభ్యర్థి మాత్రం గెలవలేదు …
నిజమే… చంద్రబాబు ఉమేష్ చంద్రను చూసీచూడనట్లు పొమ్మన్నాడనే మాటను కన్ఫర్మ్ చేయటానికి ఉమేష్ చంద్ర లేడు… నో, నో అని ఖండించడానికి వైయస్సారూ లేడు… చంద్రబాబు మాత్రమే కన్ఫర్మ్ చేయాలి … కఠినంగా వ్యవహరించమని తనే ముందుగా ఉమేష్ చంద్రకు చెప్పి, తరువాత ఏ కారణాలతో చూసీచూడనట్టు వెళ్లాలని చెప్పాడు..? ఆ మధ్యలో ఏం జరిగింది చంద్రబాబూ..!!
Share this Article