మధ్యప్రదేశ్ లో ఒక మహిళను అనాగరికంగా శిక్షించారని, హింసించారని, అవమానించారని ఒక వార్త. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండగా అత్తింటివారు ఆమెపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. ఒక యువకుడిని ఆమె భుజంపై ఎక్కించి శిక్షగా మూడు కిలోమీటర్లు నడిపించారు. అలా మోయలేని బరువు మోస్తూ నడుస్తున్నప్పుడు కూడా ఒళ్లు వాచేలా కొట్టారు. చివరికి ఆ కోడలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమెను హింసించిన అత్తింటివారిలో కొందరిని అరెస్టు చేశారు. కేసు సహజంగా విచారణలో విచారిస్తూ…తూ…ఊ…ఉంది. భుజం మీద అవమాన భారాన్ని మోస్తూ ఆమె మూడు కిలో కిలోమీటర్లు నడిచిన శిక్షా యాత్ర వీడియో దేశమంతా వైరల్ అయి తిరుగుతోంది.
——————–
“లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
Ads
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా….
విస్సన్న చెప్పిన వేదం కుడా
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల…
మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి
ఢిల్లీ సభలో పీఠం వేసి
లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు”
గుండమ్మ కథలో పింగళివారి ఈ గీతం ఆరు దశాబ్దాలుగా మారు మోగుతూనే ఉంది. కానీ- మహిళల మీద జరిగే దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. హింస పెరుగుతూనే ఉంది. కన్నీళ్లు కట్టలు తెంచుకుంటూనే ఉన్నాయి.
——————–
ఈ ఉదంతంలో మధ్యప్రదేశ్ కోడలు ఒక ప్రతీక. అత్తల దృష్టిలో దేశంలో ఏ సగటు కోడలయినా అనుమానించదగ్గ మనిషి. అవమానించదగ్గ మనిషి. హింసించదగ్గ మనిషి. బరువు మోయాల్సిన మనిషి. చాకిరి చేయాల్సిన పని మనిషి. వంట చేయాల్సిన వంట మనిషి. కోడలు చేసే ప్రతి పనిలో అత్తకు అనాగరికత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. కోడలు అడుగు పెట్టగానే ఇంట్లో ఆచారం మంట కలుస్తున్నట్లు అత్తకు వేడి తగులుతుంది. నోట్లో మాట లేని, ఎందుకూ కొరగాని కొడుకును కోడలు కొంగున ముడి వేసుకుని హైజాక్ చేసినట్లు అర్థమవుతుంది.
వైస్ వర్స కోడలి కంటికి కూడా అత్త అక్షరాలా ఇలాగే కనిపిస్తుంది. మూడు తరాల కింద మూట కట్టి పెట్టిన ఆచారాల్లో అత్త మూలుగుతున్నట్లు కనపడుతుంది. భగత్ సింగ్ కు పాఠాలు చెప్పగల తన భర్తను పిరికివాడిగా పెంచినట్లు పెంపకంలో దోషం కనపడుతుంది. ముఖేష్ అంబానీకి అప్పు ఇవ్వగల శక్తి ఉన్న తన భర్తను కన్న తల్లే బికారిని చేసినట్లు అవగాహన కలుగుతుంది. వారెన్ బఫెట్ ను బఫేకు పిలవగలిగినంత స్థిర చరాస్థులను అత్తమామలు అనవసరంగా తగలబెట్టి తమకు చిప్ప చేతికి ఇచ్చినట్లు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. లోకంలో తన అత్త అంత చాదస్తం, మూర్ఖత్వం, మొరటు, వెగటు ఇక ఎవ్వరిలో కనిపించదు.
——————–
ఈ సుహృద్భావ పరస్పర సంఘర్షణాత్మక వైరుధ్య సంసార మహా సంగ్రామంలో పెళ్లయిన కొడుకు టీ వీలో- “తల్లా? పెళ్లామా?” బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసుకుంటూ మౌనంగా కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఓపిక ఉన్నన్ని రోజులు గొడవపడి- ఒక శుభ ముహూర్తాన అత్తా కోడళ్లు వేరు వేరు చూరు కింద ఉండాల్సిన సంకల్పిత ప్రతీకార విభజన అనివార్యమవుతుంది. ఇదొక ముగింపు లేని, అంతులేని, కొత్తది కాని అత్త కథ. కోడలి కథ. ఇంటింటి వ్యథ…………. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article