జీవనదిలా సాగే ఓ ప్రాంత మాండలికాన్ని పట్టుకోవాలంటే ఆ ప్రాంత సంస్కృతి ఏమిటో తెలియాలి… అర్థం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి, అనుభవించాలి, అక్షరీకరించాలి… అప్పుడు అది ఆ మట్టి పరిమళాల్ని మోసుకొస్తుంది… ఒక చిత్తూరు యాస, ఒక రాయలసీమ గోస, ఒక ఉత్తర కోస్తా ధ్యాస, ఒక తెలంగాణ భాషలో పాట రాయాలంటే ఆ పదాల విరుపు పట్టుకోవాలి…
ఎలా రాయకూడదంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటలా ఉండకూడదు… అది సంకరభాష… నిజాం కాలంనాటి తెలంగాణ భాష అంటూ చంద్రబోస్ ఏదో ఓ కృతక సమర్థనకు దిగి మరింత అభాసుపాలయ్యాడు… తెలంగాణతనం జీర్ణించుకున్నవాడు రాసే పాట కాదు అది… అది ఆస్కార్ కాదు కదా, ఇంకెక్కడికి వెళ్లినా సరే, అది తెలంగాణ మాండలికం కోణంలో మృతగీతమే… ఇది ఆలోచిస్తుంటే అనుకోకుండా యూట్యూబులో ఓ పాట తగిలింది…
ఇదీ ఓ కృతకమే కాబోలు అనుకున్నా సరే, జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం అని చూసి ఓపెన్ చేస్తే… ఒరిజినల్ తెలంగాణ పదాలెన్నో వినిపిస్తూ వీనుల విందు చేశాయి… సినిమా పేరు బలగం… పాట రాసింది కాసర్ల శ్యామ్… (శ్యామ్ పాటలు ఈమధ్య బాగా హిట్టవుతున్నయ్… మొన్నామధ్య రిలీజైన నాని దసరా సినిమాలోనూ శ్యామ్ రాసిన ఓ పాట బాగుంది…) పాడింది మిరియాల రామ్, మంగ్లి… ఎందుకో ఈ పాటకు మంగ్లి టోన్ సూట్ కాలేదనిపించింది… మిరియాల రాం వోకే… ఫిమేల్ గొంతుకు కొత్తవాళ్లను ట్రై చేస్తే బాగుండేది… సంగీత దర్శకుడు భీమ్స్…
Ads
ఎందుకు ఈ పాట గురించి చెప్పాలీ అనిపించింది అంటే… ఆస్కార్ వాడికి చంద్రబోస్ రాసిన తెలంగాణ భాష ఏమర్థమైంది..? ఆస్కార్ దాకా ఎలా వెళ్లింది అది..? ఆ సంకరానికి గోల్డెన్ గ్లోబ్ ఎలా వచ్చింది..? ఏమోలే… ఈ బలగం పాటకు వస్తే ఓ పల్లె జీవనం గురించి రాసిన పాట… ఇందులో కూడా నాన్ తెలంగాణ పదాలు కొన్ని పడ్డయ్… ఉదాహరణకు… నీ పాసుగాల… అమ్మతీరు, కన్నకూతురు, ఎదుగుతున్న పంటపైరు, చెరువుల్ల తుళ్లేటి జెల్ల శాపోలె, మావిపూత…
కానీ ఏ తెలంగాణ రచయిత ఇప్పటిదాకా వాడని కొన్ని అచ్చ తెలంగాణ పదాలు వాడినట్టు కనిపిస్తోంది… బాగుంది… కేవలం పదాలే కాదు, కంటెంటులో కాస్త సాహిత్యస్పృహ ఉంది… ఉదాహరణకు… రాలుతున్న పూల చప్పట్లు, రంగుల సింగిడి పల్లె, గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోని జంటగా మోగుతూ ఉంటయిరా, బాయి గిరక నా పల్లె ఎట్సెట్రా…
అలాగే తెల్లాతెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతున్నదిరా, సదిరి సెప్పలేని మొగని తిప్పలు, వచ్చిపోయెటోళ్ల మందలించుకునే సంగతి గమ్మతి వంటి పదాలు, వాక్యాలు ట్యూన్‌లో అందంగా అమిరాయి… పాట బాధ్యులకు అభినందనలు… చంద్రబోస్, సుద్దాల ఎట్సెట్రా సోకాల్డ్ తెలంగాణ కవులు, మరీ ప్రత్యేకించి అడ్డగోలు పదాలకు అలవాటైన అనంత శ్రీరాం ఈ పాటను వినాలని నా అభిలాష… అసలైన సకినాల మిరం రుచి నాలుకకు తగుల్తుంది…!!
Share this Article