పుష్ప… మొన్నటి పదమూడో తారీఖు, ఆదివారం, మంచి ప్రైమ్‌టైమ్‌లో మాటీవీ ప్రసారం చేసింది… ఏ ఇల్లు చూసినా ఆ సినిమాయే… టీవీ ముందు నుంచి కదల్లేదు ఎవరూ… అసలే సూపర్ హిట్ సినిమా.., పాటలు దేశమంతటా హిట్… ఇంకేముంది..? ఇంటిల్లిపాదీ టీవీల ముందు కొలువు దీరారు… ఈసారి రేటింగ్స్‌లో బన్నీ కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే అనుకున్నారు అందరూ…
పైగా అది మాటీవీ… రేటింగ్స్ ‘‘సాధించడంలో’’ దిట్ట… నిజంగానే రీచ్ ఎక్కువో, ఇంకేం చేస్తుందో తెలియదు గానీ మాటీవీ రేటింగ్స్ అదిరిపోతుంటయ్… దేశంలోకెల్లా నంబర్ వన్ చానెల్ అయిపోయింది అంటే మాటలా మరి..? కానీ ప్చ్… పుష్ప కొత్త రికార్డు క్రియేట్ చేయలేకపోయాడు… 22.5 టీఆర్పీల దగ్గరే ఆగిపోయాడు…
నిజానికి గత కొన్నినెలలుగా టీఆర్పీలను పరిశీలిస్తే ఇదే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాదే రికార్డు… అది ఏకంగా 29.4 టీఆర్పీలు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రచారం చేసుకుంది… కానీ దాని అసలు రేటింగ్స్ 27… ఐనా సరే, అది తెలుగు టీవీ చానెళ్ల సినిమా రేటింగ్స్‌లో రికార్డే… అంతకుముందు మహేశ్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు 23.4 దాకా సాధించింది… అయితే ఇక్కడ ఓ చిన్న సంగతి చెప్పుకోవాలి…
Ads
అల వైకుంఠపురంలో సినిమా ప్రసారం చేసింది జెమిని టీవీలో… దాని రీచ్ తక్కువ… పెద్దగా ప్రేక్షకులు దాని జోలికి పోరు, తెలుగు వినోద చానెళ్లలో నాలుగో ప్లేసు దానిది… కానీ బన్నీ సినిమా ఆ అడ్డంకులన్నీ దాటేసి రికార్డు క్రియేట్ చేసింది… దాంతో పోలిస్తే నిజానికి పుష్ప కొత్త రికార్డు క్రియేట్ చేయాల్సింది… కానీ నాలుగైదడుగుల దూరంలో నిలిచిపోయాడు… ఐతేనేం, అదీ తన సినిమాయే కదా… సో, ఈ కోణంలో మాటీవీ జెమినిటీవీని బీట్ చేయలేకపోయిందన్నమాట…
అల వైకుంఠపురంలో సినిమాకు మరో రికార్డు ఉంది… గత నవంబరులో రెండోసారి ప్రసారం చేసినప్పుడు 12 దాకా టీఆర్పీలు వచ్చినయ్… తక్కువేమీ కాదు… అయితే పుష్ప సాధించిన 22.5 టీఆర్పీలు మరీ అసాధారణమేమీ కాదు… గతంలో ఫిదా, మహానటి వంటి సినిమాలు 20 దాకా సాధించినవే… అంతెందుకు, ఉప్పెన సినిమాకు 18 దాకా వచ్చినయ్… అయితే టీవీ ప్రసారానికి ముందే ఓటీటీల్లో ప్రసారం చేయడం ఈమధ్య బాగా ఎక్కువైంది… అదీ వ్యాపారమే కదా… దాంతో టీవీల్లో చూడాల్సిన ప్రేక్షకులు ఓటీటీల్లో చూస్తున్నారు చాలామంది… అది కూడా టీఆర్పీల తగ్గుదలకు ఓ కారణం… ఓటీటీల్లో వ్యూస్ సంఖ్యను కూడా పబ్లిక్ డొమెయిన్‌లో పెడితే… అప్పుడు తెలుస్తుంది ఏ సినిమా సత్తా ఏమిటో…!!
Share this Article