నిజానికి ఒక సినిమాకు మల్టిపుల్ సంగీత దర్శకులు పనిచేయడం బాలీవుడ్‌లో సాధారణమే… పెద్ద విశేషం ఏమీ కాదు… కాకపోతే పుష్ప-2 సంగీత దర్శకత్వ వివాదం కొత్తతరహా…
ఇది ఇండస్ట్రీలో అనారోగ్యకరమైన వాతావరణానికి దారితీస్తుందేమో కూడా..! విషయం ఏమిటంటే..? పుష్ప-1 సినిమా ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలుసు… పాన్ ఇండియా రేంజులో కూడా హిట్… డౌట్ లేదు… బన్నీని ఎక్కడికో తీసుకుపోయింది ఆ సినిమా…
దర్శకుడు సుకుమార్ రేంజ్ కూడా మరిన్ని మెట్లు ఎక్కింది… సినిమా హిట్టులో చాలావరకు క్రెడిట్ ఆ పాటలది కూడా..! అంతా బాగానే ఉంది, పాటలు సూపర్ హిట్టే కానీ ఆ సినిమా బీజీఎం అనుకున్నంత ఎఫెక్టివ్‌గా రాలేదనే అసంతృప్తి వ్యక్తమైంది…ట్రోలింగ్ కూడా సాగింది… ఎందుకు..?
Ads
దేవిశ్రీప్రసాద్‌కు బీజీఎం కూర్పుకు సరిపడా టైమ్ ఇవ్వలేదు… అదీ ఇండస్ట్రీలో వినిపించే కారణం… డీఎస్పీ టాలెంటెడ్, పాపులర్, సక్సెస్‌ఫుల్ కంపోజర్… కానీ బీజీఎం విషయంలో నిరాశపరిచాడు… సరిగ్గా ఇదే కారణంతో పుష్ప సీక్వెల్ పాటల్ని మాత్రమే డీఎస్పీకి అప్పగించి, బీజీఎం వేరే వాళ్లకు అప్పగించారట… (నిజానికి డీఎస్పీ సుకుమార్ నడుమ మంచి బాండింగ్ ఉంది…)
థమన్, డీఎస్పీ తదితర స్టార్ సంగీత దర్శకులు ఈ ధోరణిని, అంటే పాటలు ఒకరు, బీజీఎం ఒకరు అనే ధోరణిని ఇష్టపడరు… మరీ థమన్ అయితే పెళ్లి ఒకరితో, శోభనం ఇంకొకరితో అన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశాడు గతంలో… అన్నింటికీ మించి…
సినిమా నిర్మాణం మొదట్లోనే ఈమేరకు వేర్వేరు సంగీత దర్శకులతో అగ్రిమెంట్లు అని ముందే చెప్పి ఉంటే… దేవిశ్రీప్రసాద్ తనకు ఇష్టం ఉంటే ఈ ప్రాజెక్టులో ఉండేవాడు, లేదంటే తనే వెళ్లిపోయేవాడు… తీరా ఇప్పుడు తనను బీజీఎం బాధ్యతల నుంచి తప్పించడం అంటే, ఒకరకంగా తనను అవమానించినట్టే…
అదీ సరైన ధోరణి కాదనే అభిప్రాయం ఇండస్ట్రీలోనే వ్యక్తమవుతోంది… తను ఏమీ అనామక సంగీత దర్శకుడు కాదు, మెరిట్ ఉన్నవాడు… తనకు సరిపడా టైమ్ ఇవ్వాలి కూడా… పుష్ప బీజీఎం సమయంలో సుకుమార్ బిజీగా ఉండి, రికార్డింగ్ దగ్గర ఉండి చూసుకోలేదట… అదీ ఓ కారణమే అంటారు…
మరి ఇప్పుడూ అంతే కదా… ఎడతెగని షూట్ నడుస్తూనే ఉంది… ఒరిజినల్ ఫీడ్ సంతృప్తికరంగా రాలేదనే అసంతృప్తి మేకర్లలోనే ఉంది… మరోవైపు రిలీజుకు సన్నాహాలు సాగుతున్నాయి… ఇప్పటికే లేటైంది… సుకుమార్‌కూ బన్నీకి కూడా చెడిందనే వార్తలు కూడా వచ్చాయి… (తరువాత ఇద్దరూ వాటిని తోసిపుచ్చారు)…
ఈ సమయంలో నిజంగానే డీఎస్పీకి బీజీఎం కూర్పుకు సరిపడా టైమ్ దొరకడం లేదు, తనకేం కావాలో దగ్గరుంచి రికార్డింగ్ చేయించుకునే టైమ్ సుకుమార్‌కూ లేదు… థమన్‌ను, జీవీ ప్రకాష్‌ను అడిగితే ఈ కంట్రవర్సీలోకి రావడానికి ఇష్టపడలేదు…
దీంతో కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్‌ను అడిగితే… ఈమధ్య తమిళ, తెలుగు సినిమాల్లోకి దూకుడుగా వస్తున్న ఆయన వోకే చెప్పాడుట… ఆల్రెడీ బీజీఎం వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడట… తనకు మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి కూడా సహకరిస్తున్నట్టు వార్త… ఇంత జరుగుతున్నా సరే… డీఎస్పీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు… ఏదో ఐటమ్ సాంగ్ బాకీ ఉందట, అది చేసేసి, ఇక సర్దుకుంటాడు…
తను సైలెంటుగా ఉన్నా సరే, ఈ మార్పును జీర్ణించుకోలేడు… తనకు కూడా ఇగో ఉంటుంది కదా… బహుశా ఇకపై సుకుమార్ సినిమాలకు వర్క్ చేయకపోవచ్చు… పదే పదే రీషూట్లు, జాప్యం, దర్శక హీరోల దూరం వార్తలు, ఇప్పుడీ మ్యూజిక్ కంట్రవర్సీ… పుష్ప-2 ఎటెటో పోతోంది..!!
Share this Article