Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…

October 31, 2025 by M S R

.

  • మూకీ సినిమా శకం ముగిశాక… టాకీలు అడుగెట్టాక… డైలాగులు మాత్రమే లేని సినిమా ప్రయోగం పుష్పక విమానం… కమలహాసన్, అమల, సింగీతం శ్రీనివాసరావు కాంబో… సింగితం భిన్న ప్రయోగాలకు పేరు… తను సంగీత దర్శకుడు కూడా… ఈ ప్రయోగం ఇదే మొదలు, ఇదే చివరి అనుకుంటున్నాం కదా… కానీ కాదట…

.

  • ఐతే… సేమ్, అలాంటిదే మరో సినిమా వచ్చింది… 2002 లో… మిస్టర్ లోన్లీ, మిస్ లవ్లీ అనేది సినిమా పేరు… అందులో నోబెల్ అవార్డు విజేత అమర్త్యసేన్ బిడ్డ నందిని సేన్, లాహిరి లాహిరి లాహిరి హీరో ఆదిత్య ఓం ప్రధాన పాత్రలు… ఆదిత్య ఓం దర్శకుడు కూడా… (- పీవీఎస్ వర్మ)

nandini(Nadini Sen)

Ads


సరే, ఇక పుష్పక విమానం సినిమా సంగతికొద్దాం… దీంట్లో ఇతరత్రా చెప్పుకోదగిన విశేషాలు బోలెడున్నయ్…

… Subramanyam Dogiparthi….. మూకీ సినిమా యుగం ముగిసాక టాకీ సినిమా తరం మొదలయ్యాక మన దేశంలో వచ్చిన డైలాగులు లేని మొట్టమొదటి తెలుగు సినిమా ఈ పుష్పక విమానం !

మొదటిది 1982 లో వచ్చిన అమెరికన్ మూవీ Koyaanisqiatsi …. పుష్పక విమానం కధ ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం , నిర్మాణంలో భాగస్వామ్యం అంతా సింగీతం వారే . One of the finest directors of the times .

సినిమాలో కొన్ని సన్నివేశాల్ని , నటుల్ని ప్రేక్షకులు మరచిపోలేరు . K V రెడ్డి గారి శిష్యరికం ఆ సన్నివేశాల సృష్టిలో తెలిసిపోతుంది . నిరుద్యోగి హీరో ఇచ్చే డబ్బుల్ని బట్టి టీ పోసే కుర్రాడు , ఆ టీలో కాకిలాగా అవీ ఇవీ వేసి గ్లాసుని నిండుగా చేసి గర్వంగా టీని సేవించటం , కమల్ హాసన్- బిచ్చగాడు పి యల్ నారాయణ ధన ప్రదర్శన , ఏంటిక్స్ షాపులో హీరోహీరోయిన్ల సైగలు , హోటలుకి పుష్పక్ అనే పేరు , హోటల్ బాల్కనీల నుండి ప్రేమాయణం , తన గదిలో బంధించబడిన కోటీశ్వరుని మలాన్ని గిఫ్ట్ పేకేట్టుగా చేసి బయట వదిలేయటం వంటి సీన్లను నలభై ఏళ్ళు కావస్తున్నా మరచిపోలేదు .

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి అమల తండ్రి మేజిక్ షో . ఎంత గొప్పగా దూర్చారో సింగీతం వారు . ఆ మెజీషియన్ పాత్రను వేసిన నటుడి పేరు కె యస్ రమేష్ . అతను నటుడు , నిర్మాత , దర్శకుడు మాత్రమే కాకుండా మెజీషియన్ కూడా . గొప్పగా ఎంపిక చేసుకున్నారు .

మరో గొప్ప అంశం పాత్రల రాక , వాటి నిష్క్రమణ … నాటకాలలో ఎలా అయితే ఒక్కో పాత్ర ఎంటరయి , ముగింపుకి ఎలా ఒక్కోటి ఒక్కోటి నిష్క్రమిస్తాయో అలాగే నిష్క్రమిస్తాయి ఇందులో కూడా నిశితంగా పరిశీలిస్తే .
సినిమా చూస్తున్నంత సేపు డైలాగులు లేవు అని అనిపించదు .

అలాంటి అద్భుతమైన బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించారు యల్ వైద్యనాధన్ . ఆయనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు . ఈనాటి ఢాం ఢాం సంగీత దర్శకులకు ఈ సినిమాని కట్టేసి చూపాలి .

అలాగే సినిమా ఎక్కడా బోరించదు . అంతటి బిర్రయిన స్క్రీన్ ప్లేకి అంతే గొప్ప ఎడిటింగుని అందించారు డి వాసు . ఆయనకు కూడా బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చింది .

  • మన వాళ్ళు ఇప్పుడు Pan India సినిమాలని ఓ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు . 1987 లోనే ఇది గొప్ప Pan India సినిమా . పలు ప్రాంతాల్లో విడుదల కావటమే కాకుండా పలు భాషల నటీనటులు నటించారు . అమల , బాలీవుడ్ నటులు సమీర్ ఖక్కర్ , టినూ ఆనంద్ , బ్లాక్ బస్టర్ హిందీ ఆరాధన సెకండ్ హీరోయిన్ ఫరీదా జలాల్ , తమిళ నటుడు ప్రతాప్ పోతన్ , కన్నడ నటి రమ్య , తెలుగు నటుడు పి యల్ నారాయణ , ఇలా ఎంతో మంది .

హిందీ బెల్టులో పుష్పక్ టైటిలుతో , తమిళనాడులో పెసం పదం టైటిలుతో , కేరళ కర్నాటకలలో పుష్పక విమానం టైటిలుతో విడుదల అయింది . అన్ని ప్రాంతాల్లో ఇప్పటి లాగా ప్రి రిలీజ్ శబ్ద కాలుష్యం , ప్రభుత్వాలతో తగాదాలు , టికెట్ రేట్ల పంచాయతీ వంటి న్యూసెన్స్ లేకుండా మామూలు టికెట్లతో ఢంకా బజాయించింది .

kamal

మెజీషియన్ కె యస్ రమేష్ నటన అద్భుతం . రకరకాల విన్యాసాలతో భార్యామణిని ఆట పట్టించటం బాగా సరదాగా ఉంటుంది . అమల ముద్దుముద్దుగా నిశ్శబ్ధంగా అందమైన , నాజూకయిన నటనను ప్రదర్శించింది . టినూ ఆనంద్ . అతని నటన ఇందులో , ఆదిత్య 369 లో మనందరం చూసిందే .

కమల్ హాసన్ తర్వాత , బహుశా ధీటుగా , నటించిన నటుడు పి యల్ నారాయణ . హీరోకి తన వద్ద దాచుకున్న డబ్బుని కాస్త కాస్త చూపటం ప్రేక్షకులు మరచిపోరు . అనాధ శవంగా చూసినప్పుడు , మునిసిపాలిటీ వాళ్ళు ఎత్తినప్పుడు చాలా సానుభూతి కలుగుతుంది .

దాచుకున్న డబ్బంతా గాలికి , జనానికి పోతుంది . ఓ జీవిత సారాన్ని చూపుతాడు దర్శకుడు . అంతుంది ఇంతుంది అని విర్రవీగే ప్రతి మానవుడు అన్నీ గాలికి వదిలేసి శ్మశానం బండి ఎక్కాల్సిందే అనే శ్మశాన వైరాగ్యాన్ని ప్రవచించారు సింగీతం వారు .

మరో పాత్ర ఆ పుష్పక్ హోటల్ అధినేత ఓ చిన్న టీ స్టాల్ స్థాయి నుండి అంత పెద్ద స్టార్ హోటలుకు ఓనర్ ఎలా అయ్యారో రెండు సార్లు చూపుతారు . అతని ఫోటోలే హీరోకి చివర్లో స్ఫూర్తిని కలిగిస్తాయి . కుఛ్ దినోంకా సుల్తాన్ లాగా అనుభవించిన హీరోకి జ్ఞానోదయం కలిగి ఫైవ్ స్టార్ అవతారానికి ముగింపు పలికి తన బతుక్కి మరలి పోతాడు . ఏమీ కాజేయకుండా అన్నీ వదిలేసి పోయిన హీరోని చూసి కోటీశ్వరుడికి కూడా బుధ్ధి వచ్చి భార్యతో కలిసి పోతాడు .

అలా పాత్రలన్నీ నిష్క్రమిస్తాయి . చాలా నాటకీయంగా చూపారు సింగీతం వారు . అమల కూడా వెళ్ళిపోవటం , తాను ఇచ్చిన కాగితం గాలికి పోవటం , వెరశి హీరో మీద కూడా వసంత కోకిల సినిమాలో లాగా కూస్తంత జాలి కలుగుతుంది . అద్భుతమైన పాత్రల సృష్టి .

మొత్తం షూటింగ్ బెంగుళూరులోని ఐటిసి వారి Windsor Manor హోటల్ లోనే జరిగింది . ఈ హోటలుకు నేను 1985/86 ప్రాంతంలో వెళ్ళాను . ఈ హోటలుకి పక్కనే ఓ వీధి సెట్టింగ్ కూడా వేసారట . ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని అభినందించాల్సిందే . సినిమాటోగ్రాఫర్ బి సి గౌరీశంకర్ .

ఈ సినిమాలో ప్రేక్షకులకు భలే మెప్పించే పాత్ర ఆ ఇళ్ళల్లో ఊడ్చే స్వీపర్ పాత్ర . ఆ స్వీపర్ సింగారం , వయ్యారం , వాటిని కరకర తిందామా అన్నట్లు చూసే ముసలోడు , వగైరా . నిజ జీవితంలో చాలామంది తగులుతుంటారు అలా .

12వ IFFI , షాంగై అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించబడింది . ఉత్తమ చిత్రంగా , కమల్ హాసనుకి ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగీతం వారికి ఉత్తమ దర్శక అవార్డు కూడా వచ్చింది . కీర్తి , ధనం , గుర్తింపు , అన్నీ పుష్కలంగా వచ్చిన ఈ సినిమాకు సింగీతం వారి సహ నిర్మాత పేరు నాగరాజు . ఆయన మరి ఏ సినిమాను తీయలేదట .

ఇంత గొప్ప cult classic ని చూడకపోతే ఎలా !? యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . సినిమా రంగంలోకి కొత్తగా వచ్చిన వారు , వద్దామని అనుకునే వారు ఈ సినిమాను తప్పక చూడాలి , అధ్యయనం చేయాలి . నేర్చుకొనదగు ఎవ్వరు నేర్పిన . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…
  • కొన్ని ఉద్వేగపు కన్నీళ్లకు పేర్లుండవ్… అవి అనుభవైక వేద్యమే…
  • మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!
  • లంచస్వామ్యం…! లంచం చుట్టూ, లంచం కోసం, లంచం చేత…!!
  • మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
  • ది గ్రేట్ సైబర్ రాబరీ..! కుంభస్థలాన్నే కొట్టారు హ్యాక్ దొంగలు..!!
  • చైనా సైబర్ మాఫియా..! ఆ చెరలో వందలాది భారతీయులు గిలగిల..!
  • సింగిల్ మదర్‌హుడ్..! పెళ్లి, విడాకులు, ఐవీఎఫ్ సంతానం… రేవతి స్టోరీ…!!
  • ఆమె అమెరికా అమ్మాయి… పాటేమో వేణువుపై… అతనేమో వీణ సవరింపు…
  • జెమీమా రోడ్రిగ్స్..! ఓ తిలక్ వర్మ… ఓ రోహిత్ శర్మ… ఓ విరాట్ కోహ్లీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions