పుతిన్ తక్కువోడు కాదుగా… చాలా ముందస్తు ప్రణాళికలు ఉంటయ్… ఎంత అంటే… పర్ సపోజ్, ఉక్రెయిన్ మీద దండయాత్ర పుసుక్కున నాలుగైదు రోజుల్లో ముగిసిపోయి, ఎటు చూసినా శిథిలాలు, విధ్వంసపు ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటయ్ కదా… ప్రజలంతా గుండెలు పగిలి శోకాలు పెడుతుంటారు కదా… బతుకు జీవుడా అనుకుంటూ లక్షల మంది వలస వెళ్లిపోయినా సరే, ఇంకొందరు ఎటూ పారిపోలేక దేశంలో చిక్కుబడిపోతారు కదా… మరి అప్పటికప్పుడు వాళ్లను పాలించి, ఉద్దరించడానికి ఎవరిని నియమించాలి..?
ఇదంతా పుతిన్ ముందే ఆలోచించి పెట్టాడు… ఎహె, అలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంత ముందుగానే ఎందుకు పేరు ఖరారు చేసిపెడతాడు, ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకునేందుకు బయల్దేరిన 64 కిలోమీటర్ల యుద్ద కాన్వాయ్ కూడా అసలు కదలడం లేదంటున్నారు, ప్రతి పట్టణంలోనూ ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతోంది అంటున్నారు, మరి అప్పుడే ఈ కొత్త అధ్యక్ష నియామకం ఏంటీ అంటారా..? అబ్బే, పుతిన్ అలా అనుకోలేదు, అనుకోడు… ఏదైనా పర్‌ఫెక్ట్ ప్లానింగ్…
ఉక్రెయిన్ రాజధాని స్వాధీనం కాగానే, అధ్యక్ష భవనంలో తన ప్రతినిధిని పెట్టేస్తాడుట… ఆయన ఎవరో తెలుసా..? విక్టర్ యనుకోవిచ్…! ఈయన 2014లో రష్యాకు పారిపోయాడు… ఆయన్ని ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని చేస్తారట… చాలా మీడియా సంస్థలు రాసేస్తున్నయ్… ఉక్రెయిన్‌కా ప్రావ్దా అనే ఆన్‌లైన్ న్యూస్‌పేపర్ విశ్వసనీయ సమాచారం అంటూ ఈ వార్తను మొదట స్టార్ట్ చేసింది… మిగతావాళ్లు వెంటనే అందుకున్నారు… నువ్వు రెడీగా ఉండవోయ్ అని పుతిన్ ఆయనకు ఆల్‌రెడీ చెప్పేశాడట…
Ads
ఇంతకీ ఈ యనుకోవిచ్ ఎవరో తెలుసా..? 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు… కానీ 2013లో యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఈయనకు వ్యతిరేకంగా మైదాన్ రెవల్యూషన్ లేపారు… అనేక హింసాత్మక సంఘటనలు జరిగినయ్… దీంతో 2014లో ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయింది… తప్పనిసరై ప్రాణాలు అరచేత్తో పట్టుకుని రష్యా పారిపోయాడు ఈ అధ్యక్షుల వారు… అప్పటి నుంచి అజ్ఞాతంలోనే బతుకుతున్నాడు…
ఉక్రెయిన్ పూర్తి స్వాధీనం ఎప్పుడు అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం… క్రమేపీ ఈ యుద్ధం ఎటు దారితీస్తుందనేది కూడా చెప్పలేం… కానీ ఒకవేళ కొద్ది రోజుల్లో గనుక ముగిసిపోతే ఈ మరబొమ్మను పుతిన్ అక్కడ ప్రతిష్టిస్తాడన్నమాట… అఫ్‌కోర్స్, రిమోట్ పుతిన్ చేతుల్లోనే కదా ఉండేది… ఉక్రెయిన్ మీద ‘‘మస్తు అవగాహన’’ ఉన్నవాళ్లు ఇంకెవరు దొరుకుతారు తనకు కూడా..! యూరప్, రష్యా కొత్త భౌగోళిక చిత్రపటాల్ని గీస్తున్న పుతిన్‌కు చెప్పినట్టు ఆడేవాళ్లు కూడా ఇప్పుడు అవసరమే కదా..!!
Share this Article