.
తూర్పు దిక్కున తొలి ప్రజాస్వామిక వెలుగు – ‘పీవీజీ రాజు’… Srinivas Ganjivarapu
రాజరికపు వైభవాన్ని వదిలేసిన ఆదర్శ ప్రజాస్వామిక జమిందారు!
పీవీజీ రాజు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక స్మరణ…
విజయనగరం సంస్థానానికి 1591 నుంచి 1949 వరకు 350 ఏళ్ల చరిత్ర ఉంది. 1713లో విజయరామ రాజు నిర్మించిన విజయనగరం కోట ఈ వంశ ప్రాభవానికి సాక్ష్యంగా నిలుస్తుంది. 1794లో పద్మనాభం యుద్ధం తర్వాత విజయనగరం మద్రాసు ప్రెసిడెన్సీ కింద జమీందారీ ఎస్టేట్‌గా మారినప్పటికీ, పూసపాటి పాలకులు విద్య, సాహిత్య, కళల పోషణలో ఎంతో ముందున్నారు. విజయరామ గజపతి రాజు-III ‘మహారాజా కళాశాల’ను స్థాపించడం, ఆనంద గజపతి రాజు గురజాడ వంటి మహాకవులను ఆదరించడం ఉత్తరాంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి బలమైన బాటలు వేసింది.
తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా…
పీవీజీ రాజు 1924 మేలో అలక్ నారాయణ గజపతి రాజు, విద్యావతి దేవి దంపతులకు జన్మించారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ చేత ‘ప్రిన్స్ చార్మింగ్’ అని పిలువబడిన ఆయన తండ్రి అలక్ నారాయణ, జస్టిస్ పార్టీ తరఫున గెలిచి ప్రగతిశీల దృక్పథంతో ఉండేవారు. బాల్యంలో బ్రిటిష్ అధికారులు తండ్రి నుంచి తనను వేరు చేయడానికి ప్రయత్నించడం పీవీజీ రాజు మనసుపై గాఢమైన ముద్ర వేసింది. అధికారం పేరిట జరిగే దౌర్జన్యాన్ని జీవితాంతం వ్యతిరేకించడానికి ఆనాటి అనుభవమే బలమైన ప్రేరణగా నిలిచింది.
Ads
కొలంబియా అనుభవాలు.. ఉన్నత విద్యా దృక్పథం…
విశాఖపట్నంలో పాఠశాల విద్య, బెంగళూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పీవీజీ రాజు, టెన్నిస్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. సంపన్న రాజకుమారుడైనప్పటికీ, అమెరికన్ సమాజాన్ని సామాన్యుడిగా చూసే జిజ్ఞాసతో రెస్టారెంట్‌లో వెయిటర్‌గా, క్యాంటీన్‌లోనూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేశారు. అదే విశ్వవిద్యాలయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉపన్యాసానికి హాజరుకావడం ఆయనలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తిని పెంచింది. కొలంబియాలోనే ప్రొఫెసర్ డీడీ కోశాంబి మేనకోడలైన కుసుమ మడ్గావకర్‌తో పరిచయం ఏర్పడి, 1949లో వివాహం చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు.
పరిహారం లేని త్యాగం.. సోషలిస్టు పోరాటాలు…
1945 ఆగస్టు 24న విజయనగరం సంస్థానానికి చివరి పట్టాభిషిక్త మహారాజుగా నిలిచిన ఆయన, 1946లోనే ఎలాంటి నష్టపరిహారం ఆశించకుండా జమీందారీని వదులుకున్నారు. దేశంలో ఎస్టేట్ల రద్దుకు పరిహారం లేకుండా మద్దతు పలికిన తొలి పాలకుడిగా గుర్తింపు పొందారు. 1949లో విజయనగరం సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైంది. రాజభరణాల రద్దు సమయంలో తనకు వారసత్వంగా వచ్చిన విలువైన ఆభరణాలను ప్రధాని నెహ్రూకు అందజేశారు.
జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో సోషలిస్టు పార్టీలో చేరిన పీవీజీ రాజు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. రైతులు, నిర్వాసితుల హక్కుల కోసం సత్యాగ్రహాల్లో పాల్గొని, కర్నూలు జిల్లా కరివెనలో ఇనాం సత్యాగ్రహం, నాగార్జునసాగర్ నిర్వాసితుల నిరసన, బీహార్ రైతు ఉద్యమంలో జైలు జీవితం గడిపారు. 1952 నుంచి 1980 మధ్య తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఆరోగ్య శాఖ మంత్రిగా, విద్యా శాఖ మంత్రిగా సేవలందించి, ప్రైవేటు కళాశాలలకు గ్రాంట్-ఇన్-ఏయిడ్, యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేశారు.
రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి.. నేటి రాజకీయాలకు ఒక కనువిప్పు…
సింహాసనంపై పుట్టి, రాజభోగాలను అనుభవించాల్సిన పీవీజీ రాజు.. పుట్టుకతో చేకూరిన ఆధిపత్యాన్ని, రాచరికపు దర్పాలను త్యజించి ప్రజాస్వామిక పౌరసత్వమే గొప్పదని చాటిచెప్పారు. అధికారమంటే అనుభవించే భోగభాగ్యం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని ఆయన తన చేతల ద్వారా నిరూపించారు. నష్టపరిహారం కూడా ఆశించకుండా జమీందారీలను వదులుకున్న ఆనాడు ఆయన చూపిన త్యాగనిరతి ఒక చారిత్రక సత్యం.
- కానీ, విచిత్రమేమిటంటే.. సరిగ్గా దీనికి పూర్తి విరుద్ధమైన నయా సామంతుల సంస్కృతి నేటి రాజకీయాల్లో ప్రబలుతోంది. రాజరికపు పోకడలను రూపుమాపాలని రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య ప్రక్రియలోకి వచ్చి చేరిన నేటి తరం నాయకులు కొందరు, ఆ వ్యవస్థను గెలిచాక మళ్లీ ‘రాజకీయ మహారాజులు’గా, నిరంకుశ సామ్రాధ్యాధిపతులుగా ప్రవర్తించడం విచారకరం.
మృత్యువును జయించిన మనోబలం…
1964 మే 11న పంజాబ్‌లో భాక్రా-నంగల్ డ్యామ్‌ను సందర్శించడానికి వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో వాహనం బోల్తా పడి తీవ్రగాయాలయ్యాయి. చండీగఢ్ ఆసుపత్రిలో 79 రోజుల పాటు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. జర్మనీ, ఇంగ్లాండ్‌లలో ప్రత్యేక చికిత్స పొంది కోలుకున్నారు. క్రమం తప్పకుండా చేసిన శీర్షాసనం వల్ల మెదడుకు తీవ్ర నష్టం తప్పిందని వైద్యులు తెలిపారు. శారీరకంగా కోలుకోవడానికి సమయం పట్టినప్పటికీ, 1984 వరకు మరో 20 ఏళ్ల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా క్రియాశీల ప్రజా జీవితాన్ని కొనసాగించడం ఆయన అసాధారణ మనోబలానికి నిదర్శనం.
మాన్సాస్ ట్రస్ట్.. విద్యాదాతృత్వ శిఖరం
విద్యే సమాజాన్ని మారుస్తుందని నమ్మిన పీవీజీ రాజు, తన ఆస్తులన్నింటినీ ప్రజా సంక్షేమానికి ధారపోశారు. 1958 నవంబర్ 12న తండ్రి స్మృత్యర్థం ‘మాన్సాస్’ ట్రస్టును స్థాపించి, నాటి విలువైన సుమారు ₹50 కోట్ల ఆస్తులు, 13,000 ఎకరాలకు పైగా భూములను దత్తం చేశారు. విజయనగరం కోటలోని ‘మోతీ మహల్’ను మహిళా కళాశాలకు అంకితం చేశారు. నేడు మాన్సాస్ పరిధిలో అనేక విద్యాసంస్థలు, 105కి పైగా దేవాలయాలు కొనసాగుతున్నాయి.
తన పినతండ్రి సర్ విజ్జీకి చెందిన కొరుకొండ ప్యాలెస్‌ను సొంత నిధులతో కొనుగోలు చేసి, కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు విరాళంగా ఇవ్వడంతో 1962లో కొరుకొండ సైనిక్ స్కూల్ ఏర్పాటయింది. విశాఖపట్నంలోని విజయనగరం ప్యాలెస్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇవ్వడమే కాకుండా, ప్రొ-ఛాన్సలర్‌గా సేవలు అందించారు.
వానప్రస్థంలో ‘రాజర్షి’.. శాశ్వతమైన ఆశయాలు
1983లో రాజకీయాల నుంచి విరమించిన పీవీజీ రాజు, సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో వానప్రస్థ జీవితం గడిపారు. స్వామి జ్ఞానానంద వద్ద పూర్ణ యోగం అభ్యసించి, దేవస్థానం గోశాల పరిసరాల్లో సాధారణ జీవితాన్ని గడిపారు. 1995 నవంబర్ 14న 71 ఏళ్ల వయసులో పరమపదించారు.
మొదటి భార్య కుసుమ మడ్గావకర్ సంతానం (ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు, సునీతా దేవి), ఆ తర్వాత మాధురీ దేవి సంతానం కుటుంబ వారసత్వాన్ని పొందారు. పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు, రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు నిర్వహించారు.. వారి నేపథ్యం గురించి ఇంకోసారి చర్చిద్దాం. మూడో తరంలో మనుమరాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు విజయనగరం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు.
రాచరికాన్ని త్యజించి, తన సర్వస్వాన్ని సామాజిక, విద్యాభివృద్ధికి ధారపోసిన పీవీజీ రాజు జీవితం భావితరాలకు.. ముఖ్యంగా నేటి ప్రజాస్వామిక వ్యవస్థలోనూ జమీందారీతనం చెలాయిస్తున్న రాజకీయ కుటుంబ వ్యవస్థలకు కనువిప్పు.. ఆదర్శనీయం!
Share this Article