నిజానికి ఓ సినిమాకు అవసరమైనన్ని ముందస్తు హైప్ పాయింట్లకన్నా చాలా ఎక్కువ… రాధేశ్యామ్… బాహుబలి, సాహో తాలూకు ఇమేజీ నుంచి బయటపడటానికి ప్రభాస్ ఓ పిరియాడిక్, డిఫరెంట్ లవ్ స్టోరీ ఎంచుకోవడం… 300 కోట్లు ఖర్చు చేయడం… విజువల్స్ మీద భారీగా ఖర్చుపెట్టడం… పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా ఉండటం… ట్రెయిలర్స్ బ్రహ్మాండంగా హిట్ కావడం… ప్రభాస్ లుక్కే కొత్తగా ఉండటం… అలనాటి దిల్ కా దడ్కన్ భాగ్యశ్రీ తల్లిగా నటిస్తుండటం… విధి, ప్రేమ నడుమ పోరాటం అనే ఓ కొత్త కాన్సెప్టును చిత్రించడం… ఇలా చాలా చాలా అంశాలు…
నిజంగా ప్రభాస్‌ను మెచ్చుకోవాలి… ఓ రొటీన్, కమర్షియల్ ఫార్ములా, ఇమేజీ చెత్త చట్రం నుంచి భిన్నమైన ప్రయత్నానికి మనస్పూర్తిగా ఒప్పుకోవడాన్ని…! ప్రభాస్ వంటి పాన్ ఇండియా కమర్షియల్ స్టార్‌కు నిజంగా అది రిస్క్ ప్లస్ సాహసమే… ఎంతసేపూ ఓ చెత్తా కామెడీ బ్యాచ్‌ను వెంటేసుకోవడం, హీరోయిన్‌ను వెంటాడి వేధించడం, నాలుగు పిచ్చి పాటలు పాడేయడం, దొరికినవాడినల్లా నరికేసి కాలర్ ఎగరేయడం… ఈ చెత్త ఏమీ లేదు సినిమాలో… అయితే..?
ప్రభాస్ అంటే ఏమిటి..? ఓ మాస్ కేరక్టర్… తన లుక్కు, తన స్టయిల్, తన ఫైట్స్… తెర చిరిగిపోవాలంతే… అదీ సగటు ఫ్యాన్ కోణం… (అఫ్ కోర్స్, కృష్ణంరాజులాగే తను కూడా స్టెప్పుల్లో వీక్)… దానికి పూర్తి భిన్నంగా పోతున్నాడూ అంటే… ఫుల్లు జాగ్రత్తలు ఉండాలి… ప్రత్యేకించి కథ కన్విన్సింగు ఉండాలి… ప్రేక్షకుడు ఆ వాదనతో ఏకీభవించాలి… సంగీతం బాగుండాలి… పాటలు మాటిమాటికీ హంట్ చేసేలా ఉండాలి… కథలో థ్రిల్లింగ్ ఎమోషన్స్, ట్విస్ట్స్ ప్రేక్షకుడిని మిగతా అంశాల నుంచి మరిపించాలి…
Ads
అవేమీ లేవు ఈ సినిమాలో… అదే పెద్ద మైనస్… అసలు అనుభవమున్న, చేయి తిరిగిన దర్శకుడిని ఎంచుకోకపోవడం ఓ పొరపాటు… పాటలు బాగాలేవు… బీజీఎం బాగుంది… కానీ సినిమాకు అది సరిపోదు… ఆ భాగ్యశ్రీ ఈరోజుకూ చెక్కుచెదరని అందంతో ఉంది, కానీ హీరోతో పెద్ద అనుబంధం కనిపించదు… హీరోయిన్ పూజా హెగ్డే అందమైందే… కానీ ఎందుకో ప్రభాస్‌కూ ఆమెకూ కెమిస్ట్రీ కుదిరినట్టు అనిపించదు… పైగా పూజ అందగత్తే, వెరీ పాపులర్ హీరోయిన్, కానీ నటనలో ఈరోజుకూ వీకే…
అందమైన భావకవిత్వం అందరికీ నచ్చాలని ఏమీ లేదు… ఈ లవ్ స్టోరీ కూడా అంతే… సీన్ల చిత్రీకరణ హాలీవుడ్ స్థాయిలో బ్రహ్మాండంగా ఉన్నయ్… విజువల్స్, గ్రాఫిక్స్ అదరగొట్టారు… కానీ బేసిక్‌గా ఏం చెప్పాలనుకున్నారు సినిమాలో… ఇదే పెద్ద ప్రశ్న… అసలు ఇంత ఖర్చుతో ఇటలీ సెట్లు అవసరమా..? పాన్ ఇండియా దాటేసి, పాన్ వరల్డ్ రేంజుకు తీసుకెళ్లాలనుకుంటే ఈ పనికిమాలిన వ్యయం అవసరమా..? కథను ఇటలీ చుట్టూ తిప్పాలా..?
అసలు ప్రధాన పాత్రల కేరక్టరైజేషన్ మీద దర్శకుడికి శ్రద్ధ ఏది..? ఇక కథకు వద్దాం… డెస్టినీ అంటే డెస్టినీయే… విధిరాత తప్పదు అని పదే పదే బలంగా చెబుతుంది కథ… అదే సమయంలో దానికి ఎదురీది పోరాడినా కొందరు గెలుస్తారు అంటుంది… కోటిశాతం కాంట్రడిక్షన్ ఇది… విధిరాతను తప్పించుకోవచ్చు అనే పాయింటే ప్రేక్షకుడికి జీర్ణం కాదు… అది పక్కా యాంటీ-సెంటిమెంట్… జ్యోతిష్యం చాలారకాలుగా ఉంటుంది… కానీ హస్తసాముద్రికానికి అంత గొప్ప పేరేమీ ఉండదు…
ఉందిపో, ఆల్‌రెడీ రాయబడిన రాతకు భిన్నంగా జరగదు… ఒకవైపు అదే చెబుతూ, మళ్లీ ప్రయత్నిస్తే ఫలితం దక్కకపోదు అనే కాన్సెప్టే అబ్సర్డ్… జ్యోతిష్యం మనం రాసుకునేది ఏమిటోయ్ దర్శకుడా..?! మూఢనమ్మకాన్ని ప్రమోట్ చేయడంగా ఈ కథను చూడాల్సిన పని లేదు, ఆఫ్టరాల్ ఇదొక కథ… క్రియేషన్… అయితే దాన్ని కమర్షియల్ మూసలోకి మార్చి, ప్రేక్షకుడిని కట్టిపడేసేలా కథ చెప్పాలంటే ఓ రేంజులో కష్టపడాలి… కథనం రక్తికట్టాలి… అదే జరగలేదు… అఖండ దీనికి ఓ భిన్నమైన ఉదాహరణ… బోయపాటి మార్క్ ఓ బీభత్స, హింసాత్మక, రుధిర, లాజికేతర చిత్రం అది… కానీ ధర్మం, మతం కోణంలో మంచి డైలాగులు, చర్చ, బాలకృష్ణ ఇమేజీ గట్రా అన్ని లోపాల్ని కప్పేసి, సినిమాను హిట్ చేసింది…
బ్రహ్మాండమైన విజువల్స్ ఎన్ని ఉన్నా కథ కన్విన్సింగుగా లేకపోతే వేస్ట్… అసలు ప్రభాస్, పూజ తప్ప ఇంకేదైనా కేరక్టర్ బలంగా నిలబడిందా సినిమాలో..? లేదు…! ప్చ్… సినిమా ఔట్‌పుట్‌ను ఒకసారి ప్రివ్యూ చూసుకోలేకపోయారా ప్రభాస్, నిర్మాత ఎట్సెట్రా… హేమిటో… నిరర్థక భావకవిత్వం ఈ సినిమా… ప్రత్యేకించి ఆ పాటలు రాసినవారెవరో గానీ ప్రభాస్ మీద పెద్ద దెబ్బే వేశాడు… కథ రాసినవాడు సరేసరి… ఈ ఫెయిల్యూర్‌కు దర్శకుడే ప్రధాన బాధ్యుడు… ముమ్మాటికీ…!! ఒకటి మాత్రం మెచ్చుకోవాలి… కావాలని సోకాల్డ్ మాస్ అంశాల్ని కథలో ఇరికించి, వెర్రి వేషాలు వేయలేదు…!!
Share this Article