ఈ కథ సిగరెట్ పీకలు, కాలిన చర్మంతో మొదలవుతుంది… సరే, నా మాటల్లోనే చెబుతాను… ‘‘ఓ శుక్రవారం రాత్రి నేను నా రేడీయో స్టూడియోలో కూర్చున్నాను… ఆరోజు నాది లైవ్ షో… అంటే కాలర్స్ నుంచి ఫోన్ కాల్స్ తీసుకుని మాట్లాడటం, సమస్యలుంటే ఏవో పరిష్కారాలు చెప్పడం, అనుభవాలు షేర్ చేసుకోవడం వంటివి సాగుతాయి ఆ షోలో… ఓ కాల్ వచ్చింది… లేడీ వాయిస్… మెత్తగా, గుసగుసలాడుతున్నట్టుగా, మెల్లిగా వస్తోంది వాయిస్… ఎవరైనా వింటారేమోనని చెవుల్లో చెప్పే ముచ్చటలాగా…
నా ఇయర్ ఫోన్స్ వాయిస్ పెంచాను, రేడియోలో ప్రత్యక్ష ప్రసారం కదా, ఆ ఔట్‌పుట్ వాయిస్ వాల్యూమ్స్ కూడా పెంచాల్సి వచ్చింది… ‘జిమ్మీ, ప్లీజ్ హెల్ప్ మి, నువ్వే కాపాడాలి…’ ఈసారి స్పష్టంగా వినిపించింది… ఏదో ఆపదలో ఉన్నట్టుగా అనిపించింది… ఒక్కసారిగా నా ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి… నేను ఓ కాలర్‌కు సాయం చేసేది ఏముంటుంది..? చేయగలనా..? ఏం చేయమంటావమ్మా అనడిగాను, ఆమె చెప్పసాగింది…
ఓ శాడిస్టు కథ… ఆమె భర్త రోజూ ఆమెను తిడతాడు నీచంగా… కొడతాడు… అంతేకాదు, సిగరెట్లు తాగి యాష్ ట్రేలో నిప్పు ఆరేదాకా నలిపేస్తాం కదా అలా ఆమె చర్మం మీద సిగరెట్ బట్స్ ఆర్పేస్తుంటాడు… ఎంత క్రూరం… ఎంత నొప్పి..? ఎంతగా విలవిలలాడిపోతోందో… ధైర్యం చేసి నాకు కాల్ చేసింది… అందరూ తన సమస్య వింటున్నారన్నాను, విననివ్వండి అంటూ సన్నగా వెక్కిళ్లు… మొదట ఆమె భర్తపై వచ్చిన కోపం కాస్తా ఆమె స్థితి పట్ల జాలిగా మారింది… నేనేం చేయగలనో అర్థం కావడం లేదు, ఏమైనా చేయగలిగే సామర్థ్యం, అవకాశం ఉన్నాయా నాకు..?
Ads
హఠాత్తుగా ఆమె స్వరం మారింది… నా భర్త వస్తున్నాడు, కాల్ కట్ చేస్తున్నాను అని పెట్టేసింది… కాసేపు నిశ్శబ్దం… రేడియో ప్రసారంలోనే కాదు, నా మదిలో కూడా… ! అకస్మాత్తుగా నేనేదో ఆ స్టూడియోలో ఒంటరినైపోయినట్టుగా అదేదో ఫీలింగ్ ఆవరించింది నన్ను… రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను, ఆమె నంబర్ నా దగ్గర ఉంది, ఆమె పేరు కూడా ఏదో చెప్పింది… రికార్డు వింటే తెలుస్తుంది… కానీ ఏం చేయాలి..? ఆమె సేఫ్‌గా బయటపడాలి… ఎలా..?
మళ్లీ ఆమెకు కాల్ చేయకముందు, పోలీసులకు కూడా చెప్పకముందే, మరుసటిరోజు ఉదయం ఓ సీనియర్ పోలీస్ అధికారి నుంచి కాల్ రిసీవ్ చేసుకున్నాను… తను నా రేడియో షో విన్నాడట… నేను ఆ మహిళను కలవాలి అన్నాడు… ఏమో, తను పోలీసేనా..? కాకపోవచ్చు కూడా… కొంపదీసి ఆమె రేడియోకు కాల్ చేసిన విషయం తెలిసి, పోలీసులాగా నాకు కాల్ చేస్తున్నాడా..? కాస్త కలవరం కూడా మొదలైంది… అసలే శాడిస్టుగాడు… నా గురించి ఎంక్వయిరీలు మొదలుపెట్టేశాడా..?
ధైర్యం కూడదీసుకుని… ‘‘నో, నో, అలా నంబర్ ఇవ్వడం కుదరదు, మీరు అసలు పోలీసేనా కాదా నాకు ప్రూఫ్ ఏమిటి..?’’ అని రెఫ్యూజ్ చేసి, నా రొటీన్ డ్యూటీలో పడిపోయాను… సాయంత్రం ఎవరో విజిటర్ వచ్చినట్టు అటెండర్ వచ్చి చెప్పాడు… చెబుతుండగానే ఒకాయన పోలీస్ డ్రెస్సులో నా దగ్గరకే వచ్చాడు నేరుగా… ఓ ఐడీ కార్డు చూపించాడు… ‘ఇప్పుడైనా నమ్ముతావా’ అన్నట్టుంది తన చూపు…
ఆమె సేఫ్టీ కోణంలో ఆలోచించినప్పుడు, నా పొజిషన్‌లో మీరున్నా ఇలాగే చేస్తారు కదా అన్నాను… తరువాత ఆమె నంబర్, పేరు ఇచ్చాను… కొన్ని రోజులు గడిచాయి… ఆ పోలీసాయన కూడా మళ్లీ కాల్ చేయలేదు, ఆయన చేసింది ల్యాండ్ నంబర్ కదా, నాకు తెలిసే చాన్స్ లేదు… మెల్లిమెల్లిగా ఆమె గురించి మరిచిపోతున్నాను… చేయాల్సిన పని పోలీసులు చేస్తారు కదా, వాళ్లకు మించి నేనేమీ చేయలేను కదా అనుకున్నాను…
3 నెలలు గడిచాయి… ఓరోజు ఆమె నుంచి కాల్ వచ్చింది… ఆనందమేసింది మొదట, తరువాత నిజంగా ఆమె ఇప్పుడెలా ఉంది, పోలీసులు ఏమైనా సాయం చేశారా..? అడిగేశాను గబగబా… మళ్లీ దొరకదేమో అన్నంత హడావుడిగా… పోలీసులు కొంత బలప్రయోగం చేసి మరీ ఆమె భర్త నుంచి ఆమెను కాపాడారుట…
‘థాంక్యూ జిమ్మీ, నువ్వు నా ప్రాణాలు కాపాడావు… ఆత్మహత్య చేసుకుందామనే అనుకున్నాను, తరువాత నీకు కాల్ చేశాను, ఇక నా లైఫ్ ఇంతేనా అన్నంత నైరాశ్యంలో పడిపోయాను… నీకు చేసిన కాల్ నన్ను బయటపడేసింది…’ అని చెప్పింది, తను క్షేమంగా ఉంది… ఓహ్, నా రేడియో షో ఓ మహిళను మళ్లీ ఈలోకంలోకి తీసుకొచ్చిందన్నమాట… వావ్, నా షో సార్థకమైంది… సంతోషంగా ఉంది… రేడియో ప్రాణాలనూ కాపాడగలదన్నమాట… వరల్డ్ రేడియో డే సందర్భంగా ఇంతకుమించిన మంచి ఉదాహరణ నేనేమీ చెప్పగలను మీకు… బైబై… #Radio Saves Lives…
Share this Article