Sankar G …………. ఒక్క రాఘవేంద్రరావు – వంద భ్రష్టు సినిమాలు… సినిమాలు తీసి దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళలో మొదటి తరం మనిషి. సరే, నేటి సినిమా రంగమే డబ్బుండి సంస్కారం లేని కుటుంబాల చేతులలోనూ, మాఫియా చేతులలోనూ, ఉన్నప్పుడు మనం చూడటం మానేయటం తప్ప, ఏమీ చేయలేము. ఏది ఎలా ఉన్నా, సినిమా నిర్మాతలకు టార్గెట్స్ యువకులు, స్త్రీలు. ఈ రెండు గ్రూపులనూ ప్రధానంగా లక్ష్యంగా చేసికొని, సినిమాలు తీయటం ఆధునిక మేనేజిమెంట్ విద్యలో ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ / రిస్క్ ఎసెస్మెంట్ అనే భాగం.
వజ్రాయుధం సినిమానే కాదు, ఆయన తీసిన ఏ సినిమాను తీసుకున్నా, హీరోయిన్ సకల వస్త్రాలూ, వదిలేసుకోవలసినదే! సెన్సారు బోర్డు వాళ్ళెలానూ, సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళున్నదే అందుకు కదా! నీతులూ, విలువలూ, ఎలా ఉన్నా, యువకుల రక్తం మరిగించటమే ఇటువంటి దర్శకుల ఉద్దేశం. జులాయి కుర్రాళ్ళే కాదు, చాల మంచి కుర్రాళ్ళు కూడ, ఈ సినిమాలు చూస్తారు. అది ఈ దర్శకులకు తెలుసు. డబ్బులు వస్తాయి. వ్యాపారం జరుగుతుంది. మన అక్కినేని వారు చెప్పారు కదా! ‘సినిమా వ్యాపారం’ అని.
దృశ్యాన్ని భావించటానికి ఇటువంటి దర్శకులున్నారు; బూతు పాటలు వ్రాయటానికి మహా పండితులున్నారు; ఒళ్ళు చూపించుకునేందుకు హీరోయిన్లున్నారు; పెట్టుబడి పెట్టటానికి బోలెడు నల్లధనం ఉన్న నిర్మాతలున్నారు. చూడటానికి ప్రేక్షకులున్నారు. ప్రజలకు అభిప్రాయాలున్నాయి – ఎవరికీ పట్టనివవి.
Ads
అన్నమయ్యకు ఇద్దరు భార్యలనే విషయం ఒక చారిత్రక సత్యం కావచ్చు. ఒకరు చనిపోయిన తరువాత ఒకరిని చేసుకున్నాడేమో, 600 ఏళ్ళ క్రితం చరిత్ర మనకు తెలియదు. ఒకామె మాత్రం కవయిత్రి అని తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరి మాట నిజమే అయినా, వాళ్ళిద్దరినీ ఒకే పానుపు మీద పడుకోబెట్టి, వాళ్ళ జఘన సీమల మీద అన్నమయ్య పాత్రలో నాగార్జున దొర్లుతూ, రొమాన్సు ఏమిటి? అన్నమయ్యే ఇలా చేయగా లేనిది, మనం చేస్తే ఏమిటి తప్పు? అనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.
సమాజ చింతనలో విషాదకరమైన మార్పులు వస్తాయి, వచ్చాయి. ఆడవాళ్ళ అత్యాచారాల మీద అరిచి గోల చేసే మహిళా సంఘాలకు ఇవి సమస్యలు కానే కావు. స్త్రీ గౌరవానికి భంగం కలిగినపుడు వీళ్ళకేమీ అనిపించదు. స్త్రీని అసభ్యంగా మాట్లాడటం, చూడటం, ఈ మహిళా సంఘాలకు అవమానంగా అనిపించదు. స్త్రీపై అత్యాచారమో, యాసిడ్ దాడియో జరిగితేనే ఆమెకు అగౌరవమని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకు మాత్రం పబ్లిసిటీ వద్దా, చెప్పండి.
1955 నాటి మాట. దొంగరాముడు సినిమా షూటింగ్ లో హీరోయిన్ స్నానం చేస్తూండగా హీరో వస్తాడు. అతను పిలిస్తే, హీరోయిన్ ’స్నానం చేస్తున్నాను’ అని చెప్పే డైలాగ్ ఉంటే, కెవి రెడ్డి గారు “ఆ డైలాగ్ తీసేయండి; దాని వలన ప్రేక్షకుడు స్నానం చేసే హీరోయిన్ ను ఊహించుకుంటాడు” అన్నారట! అందుకే వారు దర్శకులు గానే మిగిలిపోయారు. నేడు దర్శకేంద్రులు తయారయ్యారు. ఇవన్నీ దర్శకుడి పరిధి లోనికి రావండీ! అతడు వ్యాపారాత్మక విజయాన్నే దర్శించాలి అంటే, అప్పుడు అతను ఫైనాన్షియల్ అడ్వైజర్ అవుతాడు తప్ప, దర్శకుడెలా అవుతాడు?
ఒక పౌరాణిక+ చారిత్రక విషయమైన అన్నమయ్య కథనే ఇంత నీచమైన సినిమాగా తీయగలిగాడు. ఏమైనా అంటే, బోలెడన్ని అన్నమయ్య కీర్తనలున్నాయి కదా అందులో అనటం. ఆ సంకీర్తనలను స్వరపరిచిన బాలకృష్ణప్రసాద్, శ్రీమతి ఎమ్మెస్, సెమ్మంగుడి, నేదునూరి వంటి వాళ్ళ ట్యూన్లు కొన్ని వాడుకొని, డబ్బుల మాట దేముడెరుగు, కనీసం టైటిల్స్లో క్రెడిట్స్ అయినా వేసారా? లేదు. ఇంత గొప్ప అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన వారెవరంటే – జాతికి తెలిసినది కీరవాణి అనే పేరు మాత్రమే. కొంత వేల్యూ యాడిషన్ ఆయన చేసాడు నిజమే! మూలమైన ట్యూన్ ఎవరిది? పాడటానికి మనకెలానూ ఒక గాన గంధర్వుడున్నాడు.
ఒక వ్యక్తిపై కోపంతోనో, ద్వేషంతోనో, ఇది వ్రాయటం లేదు. కాంట్రాస్ట్ గా ‘దేవదేవం భజే’ అనే అన్నమయ్య కీర్తన కూడ ఒక సినిమా ద్వారానే ప్రజాబాహుళ్యానికి తెలిసింది. కాని, అది పాడినది గానగంధర్వుడు కాదే! ఒక శాస్త్రీయ కళాకారుడు. ఈ మాత్రం మర్యాద ఈయన అన్నమయ్యకు ఇవ్వలేకపోయాడే! కనీసం రెండో, మూడో, పాటలు అలాంటి వాళ్ళ చేత పాడించవచ్చు కదా! అవసరం లేదు. మనకు జనం కావాలి, వాళ్ళ జేబుల్లోనున్న ధనం కావాలి.
మహా గేయకారుడూ, సంస్కర్త, భక్తుడూ అయిన అన్నమయ్య వంటి ఉదాత్త చరిత్రను తీసుకుని, వెకిలిగా, విశృంఖలంగా, లేకిగా చిత్రీకరించారు. ఒక కాంట్రాస్ట్ చెపుతాను. సినిమాలో సింహభాగం (90%) వేశ్యల జీవితాలపై ఆధారపడిన కథ. సమాజం చీదరించుకునే మాట, వృత్తి, ‘వేశ్య’. అలాంటి కథను తీసుజుని, స్వర్గీయ గురుదత్ తీసిన ‘ప్యాసా’ ఎంత ఉదాత్తమైన చిత్రం? ఆ సినిమాను చూస్తే, వేశ్యలపై జాలి కాదు, గౌరవం కలుగుతుంది. అదీ దర్శకత్వ ప్రతిభ అంటే!
ఆ సినిమాను చూసిన ప్రతిసారీ, ఏడ్చాను. అలాంటి సినిమాలు తీస్తే, ప్రజలకు స్త్రీలంటే మర్యాద పెరుగుతుంది. ‘మదద్ చాహతీ హై…జిన్హే నాజ్ హిందోం కా పర్వోం కహా హై’ అనే పాట స్ఫూర్తిని మహిళా సంఘాలేనాడైనా గ్రహించగలవా? తెలుగులో మానవుడు-దానవుడు సినిమాలో ’ఎవరు మీరు? మన రక్తం పంచుకున్న ఆడపడుచులు, మనం జారవిడుచుకున్న జాతి పరువులు’ అనే పాట ఎంత గొప్పది? ఇటువంటి పాటలు స్త్రీలపై గౌరవాన్ని పెంచవా? ఆడది అంటే బొమ్మ మాత్రమేనా? ఎవరికి కావాలి?
సినిమాలు ఎలా తీసి తగలబడినా, అది తీసే వాళ్ళ ఇష్టం, చూసే వాళ్ళ ఇష్టం. కాని, మన సమాజ పతనానికి పరాకాష్ఠ ఏమిటంటే, ఒకటి, రెండేండ్ల క్రితం ఈయన గారిని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్వీబీసీ ఛానెల్ కు ప్రధానాధికారిగా నియమించటం. దానికి ఇతనికున్న అర్హతలేమిటి? ఇదే అనుకుంటే, వెకిలితనమూ, బూతుతనమూ, చూపుల్లో, మాటల్లో, మూర్తీభవించిన ‘పృథ్వి’ అనే వ్యక్తిని కూడ కొన్నాళ్ళు ఆ పదవిలో నియమించారు. ప్రజల అదృష్టం కొద్దీ, అతను కొద్ది రోజులే ఉన్నాడు ఆ పదవిలో.
అయితే, చివరగా, రాఘవేంద్రరావులో భావుకత లేదా? అంటే – పుష్కలంగా ఉన్నది అని చెప్పాలి. దీనికి ఉదాహరణ అన్నమయ్య సినిమాలో పతాక సన్నివేశంలో అన్నమయ్యకూ, వేంకటేశ్వరుడికీ, మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణ. అంత ఉదాత్త స్థాయిలో ఆ సన్నివేశాన్ని సృష్టించగలిగిన ఈయన ఇంత వెకిలిగా ఎందుకు తీస్తాడు అంటే – ‘ప్రజలు చూస్తున్నారు కనుక తీస్తున్నాము’ అని సినిమా వాళ్ళూ, “వాళ్ళు తీస్తున్నారు కనుక, మేము చూస్తున్నాము’ అని ప్రజలూ, ఒకరిపై నొకరు త్రోసుకుంటూ, చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. అసలు మనకిన్ని సినిమాలు అవసరమా?
Share this Article