అనుమానాలతో మంచి క్యారెక్టర్లు మిస్ చేసుకోవద్దు …. శరణ్య
… సినిమాల్లో కొన్ని పాత్రలు చేసేటప్పుడు అవి మనకు సుమారుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు దర్శకుడు, తోటి నటుల మాటల్ని నమ్మి ఆ పాత్ర చేయాలి. అది అన్నిసార్లూ కరెక్ట్ అవుతుందని చెప్పలేం. కానీ ఆ క్షణాన ఆ పాత్ర వదులుకుంటే ఆ తర్వాత చాలా బాధపడతాం. ‘వీఐపీ’(తెలుగులో ‘రఘువరన్ బీటెక్’) సినిమా అందుకు మంచి ఉదాహరణ.
ఆ సినిమా ధనుషే నిర్మించాడు. ఆ సినిమాలో తల్లి పాత్ర ఉందని, కథ చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నాడు. తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ లిస్టు చెప్పి, అవి వండిపెట్టమని, కథ చెప్పి తినేసి వెళ్తానని అన్నాడు. ధనుష్ వచ్చి తిన్న తర్వాత కథ చెప్పాడు. నాకు ఆ కథ చాలా సుమారుగా తోచింది. అందులో అమ్మ పాత్రకు అసలు ప్రాధాన్యమే లేదని అనిపించింది. పైగా మధ్యలోనే ఆ పాత్ర చచ్చిపోతుంది. ఇలాంటి సినిమాలో నేను నటించడానికి ఏం ఉంటుంది అని ధనుష్‌తో అన్నాను.
Ads
‘నా మీద నమ్మకం ఉంచండి. ఈ పాత్ర మీకు చాలా పేరు తెస్తుంది’ అని ధనుష్ చెప్పాడు. ఆ పాత్ర కోసం ఒక పాట కూడా ఉందని అన్నాడు. సరే అని ఇష్టం ఉండీలేనట్లు ఆ సినిమా షూటింగ్‌కి వెళ్లాను. షూటింగ్ టైంలో కూడా నా పాత్రకు అసలు ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించలేదు. నేనున్న సీన్లు కూడా చాలా హడావిడిగా అయిపోయాయని అనిపించింది.
ఎప్పుడైతే డబ్బింగ్‌కి వెళ్లి, ఆ సినిమాలో నా సీన్స్ చూశానో నా ఆలోచన అంతా మారిపోయింది. నేనున్న సీన్స్ ముందువెనుకా చాలా అందమైన సీన్లు పెట్టి సినిమాను డిజైన్ చేశారు. అమ్మ పాత్ర చచ్చిపోయాక కూడా ఆ పాత్ర సినిమా మొత్తం ఉన్నట్లే అనిపించింది. అంత ప్రభావం చూపించేలా ఆ పాత్రను డిజైన్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క దెబ్బతో ఇండస్ట్రీ మొత్తం నన్ను అమ్మగా ఒప్పుకుంది. ఆ సినిమాతో నా కెరీర్ మరో లెవల్‌కి వెళ్లింది.
ఒక్కోసారి సుమారుగా అనిపించే కథలు తెరపైన గొప్పగా ఉంటాయి. గొప్పగా అనిపించే కథలు చివరకు సుమారుగా మారిపోతాయి. ఏదైనా దర్శకుడి చేతిలో ఉంది. (ఓ ఇంటర్వ్యూలో నటి శరణ్య పొన్‌వణ్ణన్ చెప్పిన మాటలు..) …. విశీ
Share this Article