రాహుల్ గాంధీ చిత్రమైన వ్యక్తి…. నాయకుడు వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరమేమీ లేదు… ఎంత చిత్రమైన వ్యక్తి అంటే…. ‘‘ఛిఛీ, ఈ మోడీ పాలన బాగాలేదు, పేదల్ని ప్రేమించలేడు, హృదయంతో పాలించలేడు, అసలు బీజేపీకి ఓ బలమైన ప్రత్యామ్నాయం అవసరం, ఈ కాంగ్రెస్ కాస్త బాగుపడితే బాగుండు, ఈ రాహుల్ బుర్ర వికసిస్తే బాగుండు’’ అని మనం పొరపాటును అనుకుంటామో లేదో… వెంటనే రంగంలోకి వస్తాడు… నో, నో… అలా ఆశలు పెంచుకోవడానికి మీరెవరు..? నాన్సెన్స్, మీ మనస్సుల్లో నుంచి ఆ కోరికల్ని తీసేయండి అర్జెంటుగా… నేనెప్పుడూ మారను… అన్నట్టుగా వ్యవహరిస్తాడు… మన ఆశలపై ట్యాంకుల కొద్దీ నీళ్లు గుమ్మరిస్తాడు… అంతేకాదు, మోడీ కలలుగన్న ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే లక్ష్యాన్ని కూడా రాహుల్ గాంధీ సాధిస్తున్నాడేమో అనిపిస్తుంది కూడా… ఎందుకంటారా..?
ఆమధ్య దేశదేశాలు తిరగబోయాడు కదా… వచ్చాడు… తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కదా… ప్రచారానికి బయల్దేరాడు… ఎన్నికలు జరగబోయే తమిళనాడు గానీ, బెంగాల్ గానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సీనేమీ లేదు… ఏదో ఓ కూటమిలో తోకపార్టీగా ఉండాల్సిందే… సరే, స్టాలిన్ దయతో ఇచ్చే సీట్లనైనా గెలుచుకోవాలి కాబట్టి, ఇక ప్రచారానికి బయల్దేరాడు యువరాజు… మంచిదే… కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిలాగే ఈ ప్రచారం కూడా నేను చేయనుపో అని కాడి కింద పడేయలేదు… ఓచోట మాట్లాడుతూ తను చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కడున్న విలేకరులనే కాదు, దేశమంతా విస్తుపోయేలా ఉన్నయ్… అదుగో, అందుకే రాహుల్ గాంధీ ఇక మారడు, కాంగ్రెస్ పార్టీ లక్కు ఏమీ మారదు అనిపించేది…
Ads
‘‘ఈ ప్రభుత్వం అయిదారుగురు పెద్ద వ్యాపారుల కోసం తప్ప ఇంకెవరి కోసమూ పనిచేయడం లేదు… ప్రత్యేకించి చేనేత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది… ఈ రంగాలను గనుక పట్టించుకుని ఉంటే అసలు దేశసరిహద్దుల్లో సైన్యం అవసరమే లేదు… రైతులు, కార్మికులు, చేనేతన్నలను గనుక సరిగ్గా వాడుకుంటే అసలు సరిహద్దుల్లో నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ అవసరం ఉండనే ఉండదు… అసలు చైనా మన సరిహద్దు దాటేందుకు సాహసించదు… అంతేకాదు, వీళ్లను ప్రోత్సహిస్తే ఆ చైనా అధ్యక్షుడు కూడా మేడిన్ ఇండియా చొక్కా వేసుకోవాలి.,.’’ ఇలా సాగిపోయింది సారుగారి ప్రసంగం… అసలు రైతులు, కార్మికులు, చేనేతన్నలకూ… దేశసరిహద్దుల్లోని సైన్యానికీ లంకె ఏమిటి..? సైన్యాన్ని తీసిపారేసి, కొంపదీసి వీళ్లందరినీ సరిహద్దుల్లో పెట్టమంటున్నాడా..? ద్యా-వు-డా…
#WATCH | …If India's labourers, farmers & weavers were strong, protected & given opportunities, China would never dare to come inside India…: Rahul Gandhi, Congress in Erode, Tamil Nadu pic.twitter.com/IFDbzflCBo
— ANI (@ANI) January 24, 2021
మోడీకి ఓ పాలసీ లేదు, మన్ను లేదు… ఐదారుగురు బడా కార్పొరేట్ల పాదాలు మొక్కడం తప్ప పేదవాళ్లకు చేసిందేమీ లేదు… అనే రాజకీయ విమర్శ వరకూ వోకే… అది అందరూ చేసేదే… రాహుల్ కూడా అలా మాట్లాడి అక్కడే ఆగితే సరిపోయేది… దాన్ని సరిహద్దుల్లో సైన్యానికి ముడేసి, అసలు సరిహద్దుల్లో వీళ్లుంటే సైన్యం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడటంతో… ఇక రాహుల్ గురించి కాంగ్రెస్ కేడర్ ఆశలు పెంచుకోవాల్సిన అవసరం లేదనే నిరాశను, నిస్పృహను, నీరస భావనను పెంచేశాడు,., మోడీ, అమిత్ షా మాత్రమే కాదు,., అక్కడ జిన్పింగ్ ఎంతగా నవ్వుకున్నాడో…! తమిళనాడులోనే ఇలా మాట్లాడాడు అంటే, ఇక బెంగాల్ వెళ్లి ఇంకేం పేలుతాడో దాల్ తడ్కా..!!
Share this Article