Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేహాన్, మిరియా… ఆ కుటుంబం నుంచి అయిదో తరం కూడా రెడీ…

May 26, 2024 by M S R

అయిదో తరం… ఈ దేశాన్ని సుదీర్ఘంగా ఓ హక్కులా పాలిస్తున్న కుటుంబం నుంచి అయిదో తరం రెడీ… పేరుకు గాంధీ కుటుంబంలా చెలామణీ… కానీ గాంధీలు కారు… నిజానికి నెహ్రూ కుటుంబం, ఆ పేరుతో అస్సలు చెలామణీ కారు… వాద్రా కుటుంబంగా ఎవరూ పిలవరు… గాంధీ పేరుకు భారత రాజకీయాల్లో ఉన్న డిమాండ్ అది…

ఒక నెహ్రూ… కశ్మీరీ పండిట్, హిందూ… సరే, మతం కేవలం వ్యక్తిగతం, అదేమీ వారసత్వం కాదు అనుకుందాం… ఆయన కూతురు ఇందిర ఓ పార్శీని పెళ్లిచేసుకుంది… ఆయన పెళ్లికి ముందు హిందూ మతంలోకి మారాడని అంటారు… మనది పితృస్వామ్యమే అయినా ఇందిర తను గాంధీ ఇంటిపేరుతోనే చెలామణీ అయ్యింది… తోడుగా భర్త పేరుకు కూడా గాంధీ అనే పదం వచ్చి చేరింది విచిత్రంగా… సరే, ఇదీ ఆమె వ్యక్తిగత ఇష్టమనుకుందాం…

కొడుకు పేరు రాజీవ్ గాంధీ… కానీ పెళ్లిచేసుకుంది ఓ విదేశీయురాల్ని, క్రిస్టియన్… సరే, ఆమె ఈ దేశానికి వచ్చి ఓ కోడలిగానే ఉండిపోయింది కాబట్టి మన మహిళే… కాకపోతే ఆమెకూ గాంధీ అనే పదం వచ్చి చేరింది… అనివార్యంగా, ఓ అవసరంగా… అత్త, భర్త ఉగ్రవాదానికి బలైపోయారు, విషాదమే… కానీ వారసత్వం ఆమె కొడుకు రాహుల్‌కు వచ్చి ఆలింగనం చేసుకుంది… వద్దంటే పార్టీ ఊరుకోదు, వేరే నాయకత్వమూ లేదు… ఉండనివ్వరు…

Ads

సరే, రాహుల్ మాటలు, అడుగులు, చేష్టలు ఓ ఖడ్గతిక్కన తరహా… పెళ్లి లేదు, పిల్లల్లేరు, ఏ జంఝాటమూ లేదు… మరి ఈ వారసత్వ పగ్గాల్ని అందుకుని ఉరకలు వేసేదెవరు..? పార్టీ వారికి వారసత్వ సంపదే కదా… దీనికి సమాధానం ప్రియాంక గాంధీ కాదు, వాళ్ల పిల్లలు రేహాన్, మిరాయా… నిజానికి ఆమె వాద్రా కుటుంబ కోడలు… ఐతేనేం, ఆమెకూ గాంధీ అనే ఇంటిపేరే స్థిరపరిచారు… అవసరం, అనివార్యం…

Rehan

సరే, ఈ గాంధీ-నెహ్రూ-వాద్రా కుటుంబ వారసుడు రేహాన్… హిందూ, పార్శీ, క్రిస్టియన్ మతాల కలయిక తను… తనకు సంబంధించిన వార్తో, ఫోటో కనిపిస్తే సహజంగానే పాత్రికేయ ప్రాధాన్యం ఉంటుంది, జనానికి ఆసక్తికరంగానూ ఉంటుంది… శనివారం రేహాన్, మిరాయా శనివారం వోటు హక్కు వినియోగించుకున్నారు… అలా తెర మీదకు వచ్చారు… వోటేసి బయటకు రాగానే విలేఖర్ల ప్రశ్నలకు క్లుప్తంగా జవాబిచ్చాడు… ‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం. అందరూ బాధ్యతగా ఓటేయాలి..’ అన్నాడు… గుడ్, క్లుప్తంగా, స్ట్రెయిట్‌గా, తమ కుటుంబం కమ్ పార్టీ ప్రధాన ప్రచారాంశాన్నే తనూ ఔపోసన పట్టినట్టుగా ముక్తసరిగా చెప్పేశాడు…

rehan

అవునూ, తను ఏం చదివాడు..? యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్వోఏఎస్‌)లో ఎంఏ రాజనీతి చదివాడు… సో, రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్ని చదువుకుని ఎంటర్ కావడమే, అల్లాటప్పాగా రాడన్నమాట… గుడ్… మోడీ 2047 దాకా కలలు కంటుండవచ్చుగాక… పర్లేదు, కననివ్వండి, కానీ రేహాన్‌కు ఇప్పుడు 23 ఏళ్లే… పొలముంది, పొద్దుంది, ఉరికేంత మైదానం ఉంది… తొందరేమీ లేదు…

rehan vadra

క్రికెట్‌ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో ఒక కంటి (ఎడమ) చూపు పోగొట్టుకున్న రేహాన్‌ కు ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఎక్కువ… సోషల్ మీడియాలో ఉన్నాడు… రాజకీయాలంటే ఆసక్తి లేదనే చెబుతుంటాడు… కానీ ఏమో ఏ అవసరం ఎలా ముంచుకొస్తుందో… రాజీవ్ గాంధీ కూడా రాజకీయాల పట్ల విముఖంగా ఉండేవాడు కదా మొదట్లో… తన కంటి చూపు గురించి రేహాన్ మంచి పరిణతితో మాట్లాడాడు ఓసారి…

rehan

‘‘ఫోటోగ్రాఫర్‌ కు ఓ కన్నుపోయినా నష్టం లేదని తర్వాత తెలుసుకున్నా… ఈ దుర్ఘటన తర్వాత ఇది నా జీవితంలో అత్యంత ముఖ్య ఘటన అని గుర్తించా… కారు నడిపేటప్పుడు కాస్త ఎక్కువ పక్కకు తిరిగి చూడాలి… రోడ్డు దాటేప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… అంతే… ఒక కన్నుతోనే చూసే శక్తి ఉన్నవారికి అంతకన్నా ఇబ్బంది ఏమీ ఉండదు…’’ అంటూ తాను తీసిన ఛాయాచిత్రాల ప్రదర్శన (2021 లో) సందర్భంగా రేహాన్‌ రాజీవ్‌ చెప్పాడు. (అప్పుడప్పుడూ ఈ విషయంలోనే ప్రియాంక హైదరాబాద్‌లోని ప్రముఖ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని సందర్శిస్తుంది… ప్యూర్ పర్సనల్… ఏ నాయకుడినీ కలవదు…) 

(ఆమె ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే, కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉండీ ఏదో కంటి ఆపరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్లి రోజులతరబడీ మాయమైపోయేవాడు… అదొక మిష…) రేహాన్ కాస్త లోతైన ఆలోచనపరుడు అంటారు… కాకపోతే ఈ వయస్సులోనే పట్టిచూసి ఓ అంచనాకు రాలేం… బ్రిటన్‌ లో రాజకీయాలు ఎక్కువ చర్చించే, అధ్యయనం చేసే విద్యాసంస్థల్లో ఒకటిగా బాగా పేరున్న ఎస్వోఏఎస్‌లో చదువు కారణంగా రేహాన్‌ రాజకీయాలను క్షణ్ణంగా ఫాలో అవుతున్నాడు…

priyanka

మీరు చివరికి రాజకీయాల్లోకి దిగుతారు కదా? అని ఓ పత్రిక విలేఖరి ప్రశ్నించగా.., ‘‘నేను రాజకీయాల్లో బాగా ఇన్వాల్వ్‌ కాకపోయినా, ఈ రంగంలో ఏం జరుగుతుందో నిత్వం గమనిస్తుంటాను. రాజకీయాలపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించాలి. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతున్నదో చూస్తుండాలి. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? ఎలా పనిచేస్తున్నాయి? అని అందరూ అధ్యయనం చేయాలని నేను భావిస్తాను,’’ అని రాజీవ్‌ మనవడు ధైర్యంగా చెప్పాడు…

అమ్మ ప్రియాంక రూట్స్ అందరికీ తెలుసు కదా… నాన్న రాబర్ట్ వాద్రా రూట్స్ పాకిస్తాన్‌ పంజాబ్‌లోని సియాల్‌ కోట్‌ అనే నగరంలోనివి… పంజాబీ ఖత్రీ (క్షత్రియ) కుటుంబ నేపథ్యం… అమ్మమ్మ సోనియాది ఇటలీ అయితే, నాయనమ్మ మౌరీన్‌ మెక్‌ డొనాఫ్‌ ఇంగ్లండ్‌లోని స్కాట్లండ్‌ మూలాలున్న మహిళ… ఇన్ని రకాలుగా వైవిధ్య భరితమైన కుటుంబ నేపథ్యం ఉన్న రేహాన్‌‌కు ఫోటోగ్రఫీనే జీవితవ్యాపకంగా మార్చుకునే అభిలాష ఉంది, కానీ రాజకీయాలు వచ్చి కౌగిలించుకుంటే కెమెరా మూలకుపడక తప్పదు..!! నిజంగానే రాజకీయాల్ని ఇంకా లోతుగా  అధ్యయనం చేసి, పొలిటికల్ ఎంట్రీ గనుక ఇస్తే ఈ దేశం స్వాగతిస్తుంది… తప్పు కూడా లేదు..!!

miraya

ఏమో… రేహాన్‌కు పొలిటికల్ కెరీర్ ఇష్టం లేకపోవచ్చు, కానీ మిరాయాకు..? ఆమె వయస్సు ఇంకా 21 ఏళ్లే… రేహాన్ కనీసం అప్పుడప్పుడూ ప్రధాన స్రవంతిలో కనిపిస్తాడు, కానీ ఈమె మొత్తం లోప్రొఫైల్… బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా కొన్ని ఫోటోలు, వార్తలు కనిపిస్తాయి, ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా జంతువుల ఫోటోలు, వీడియోలు కనిపిస్తాయి… ఆమె చదువు, అభిరుచులు తెలియవు కాబట్టి ఆమె రాజకీయాల కెరీర్ గురించి అప్పుడే చెప్పుకోవడం సరికాదు…!

miraya

చివరగా… ఈ ఇద్దరూ తమ పేర్లకు చివర గాంధీని తగిలించుకోలేదు… తగిలించుకునే పరిస్థితి వస్తే చెప్పలేం… కానీ ఇప్పుడైతే రేహాన్ రాజీవ్… మిరియా వాద్రా… అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions