- నో డౌట్… ఈ దేశంలో అత్యంత బాధిత వృత్తి, జాతి… రైతులు, వ్యవసాయం… డొల్ల చేతలే తప్ప ఏ ప్రభుత్వానికీ సరిగ్గా పట్టని ఓ ప్రధాన రంగం…
- నో డౌట్… ఆర్. నారాయణ మూర్తి పేదల పక్షపాతి… రైతుపక్షపాతి… ఆ రకరకాల అవలక్షణాలు, ప్రలోభాల సినిమా ఇండస్ట్రీలో ఓ తులసి చెట్టు…
- మరి ఇన్ని చిన్న సినిమాల మీద రివ్యూలు వస్తయ్… ట్రెయిలర్ల మీద, పోస్టర్ల మీద, హీరోల ఫోజుల మీద, డ్రెస్సుల మీద, సినిమా పేర్ల మీద… చివరకు షార్ట్ ఫిలిమ్స్ మీద కూడా బోలెడన్ని రివ్యూలు వస్తుంటయ్… కానీ రైతన్న అనే సినిమా మీద ఏవీ..? అసలు రివ్యూలకు అనర్హమా ఆ సినిమా..? ఒక్క ప్రజాశక్తి పత్రికలో మాత్రం కనిపించింది ఒక సమీక్ష…
- ఇన్ని సైట్లు, ఇన్ని యూట్యూబ్ చానెళ్లు… ఒక రైతన్న సినిమా ఎందుకు కనిపించలేదు..? ఆశ్చర్యం అనిపించింది… పెయిడ్ రివ్యూల్లాగా ఆహా ఓహో అని భజన చప్పట్లు కొట్టనక్కర్లేదు, ఉన్నదున్నట్టు రాయొచ్చు కదా… సినిమాను సినిమాగా గుర్తించొచ్చు కదా… నిజానికి మామూలు పరిస్థితుల్లోనైతే ఎగ్జిబిటర్ల సిండికేట్ అసలు థియేటర్ కూడా దక్కనిచ్చేది కాదు… కరోనాకాలంలో పెద్ద సినిమాలేవీ ఫీల్డులో లేవు కాబట్టి ఈమాత్రమైనా ఛాన్స్ దొరికింది…
నిజమే… అత్యంత విస్తారమైన, సంక్లిష్టమైన సబ్జెక్టు… విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం దాకా… ప్రకృతి, వ్యాపారి, ప్రభుత్వం, అధికారి, దళారి… ప్రతిచోటా రైతన్నకు ద్రోహమే… దాన్ని ఓ రెండు గంటల సినిమాలో, ఒక్క కథలో ఇమిడ్చి ఆవిష్కరించడం పెద్ద టాస్క్… ప్రేక్షకులకు కూడా డ్రై సబ్జెక్టు… అందుకని కొన్ని అంశాల్ని పరిమితంగా తీసుకుని, ఆ చర్చను కాస్త లోతుల్లోకి తీసుకువెళ్లి, పరిష్కారాల్ని సూచించడం ఓ పద్ధతి… నారాయణమూర్తితో వచ్చిన చిక్కేమిటంటే… మన పాత మాదాల రంగారావు తరహాలో వెళ్తాడు… సమస్య మూలాల్లోకి వెళ్లడు… ఇక్కడా అంతే… కానీ ఓ పిచ్చి కమర్షియల్ సినిమా తనెప్పుడూ తీయడు… సమాజపు కష్టనష్టాల్నే తలకెత్తుకుంటాడు… ఆ కథలే తీస్తాడు… ఆ సంకల్పాన్ని, ఆ అడుగుల్ని అభినందించాలి… ఈ సినిమాలోనూ రైతులకు సంబంధించిన రకరకాల అంశాల్ని స్పృశించాడు… అయితే..?
Ads
ఇదీ మనం పోతున్న తొవ్వ, ఇదీ మనం పోవాల్సిన తొవ్వ అని చెప్పగలగాలి సినిమా… కానీ నారాయణమూర్తి సినిమా చివర్లో ఆవేశాన్ని, ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోయాడు… కన్నకొడుకును, బావమరిది తుపాకీతో చంపేయడం మరీ నాటకీయం… అందరూ విలన్లేనా..? కొడుకు, బావ, అల్లుడు… అందరూ..! విత్తనం-ప్రైవేటు దోపిడీ, ఆర్గానిక్ సేద్యం, బీమా- పథకాల లోటుపాట్లు, ఆధునిక సేద్యం- వ్యయప్రయాసలు, గిట్టుబాటు ధర- మార్కెట్ మాయాజాలం, ఎరువులు- ప్రభుత్వ విధానాలు, విత్తనాలు, కలుపు మందులు- జెనెటిక్ కంపెనీల దాడి, కార్పొరేట్ సేద్యం- కంట్రాక్టు సేద్యం, రుణాలు- ప్రభుత్వ విధానాలు, యాంత్రీకరణ- సేద్యంపై ఖర్చు… ఎన్నో అంశాలు కదా… ఒక్కొక్కటీ బలంగా ఫోకస్ చేయాల్సిన అంశమే… కనీసం వర్తమానంపై ఫోకస్ చేయాలనుకుంటే… పంజాబ్ రైతాంగం ఎందుకిలా నెలలుగా ఆందోళన చేస్తోంది, వాళ్ల భయసందేహాలు ఏమిటి..? ప్రభుత్వ విధానాల్లో లోపాలేమిటి..? కథలో భాగంగా డిబేట్‌కు పెట్టినా బాగుండేదేమో…!! అదీ డిఫరెంటుగా… ప్రజెంట్ జనరేషన్‌కు రైతు త్యాగాలేమిటో, రైతు కష్టాలేమిటో బలంగా ఎక్కేలా…!!
Share this Article