Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!

January 16, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …… యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏయన్నార్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ సినిమా 1989 సంక్రాంతికి విడుదలయింది . అంటే 37 ఏళ్ళయింది . ఈ సినిమాకు మరో విశేషం ఉంది . సినిమాలో ఏయన్నార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన పార్టీ పేరు ప్రజారాజ్యం పార్టీ .

1988 లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఈ పేరుతోనే చిరంజీవి 20 ఎళ్ళ తర్వాత ఆగస్టు 2008 లో అదే పేరుతో పార్టీ పెట్టడం యాదృచ్ఛికం .

Ads

ఈ సినిమాలో ఓడిపోయిన పార్టీ పేరు సర్వం నేనే పార్టీ .‌ చాలామంది యన్టీఆర్ని మనసులో పెట్టుకునే కృష్ణ ఆ పార్టీ ఓడిపోయి వేరే పార్టీ ఎన్నికల్లో గెలిచినట్లు చూపారని అనుకునేవారు . అలా అర్థం వచ్చేటట్లు మహారధి చేత డైలాగులను వ్రాయించారని కూడా అనుకునే వారు .

ఇలా అనుకోవటానికి కారణం లేకపోలేదు . ఈ సినిమా టైంకే కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు . Of course . తర్వాత 1989 నవంబర్ ఎన్నికల్లో లోకసభ సభ్యుడిగా గెలవటం , 1991 ఎన్నికల్లో ఓడిపోవటం , ఆ ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ చనిపోవటం , కృష్ణ రాజకీయాల నుండి బయటకు వచ్చేయటం జరిగిపోయాయి .

ఇంక సినిమా విషయానికి వస్తే మలయాళంలో 1988 లో వచ్చిన ఆగస్టు 1 అనే సినిమాకు రీమేక్ మన రాజకీయ చదరంగం సినిమా . మలయాళంలో మమ్ముట్టి , సుకుమారన్ , ఊర్వశి , కెప్టెన్ రాజు ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు వాతావరణానికి , ఏయన్నార్ కృష్ణల స్టార్డంలకు అనుగుణంగా మార్పులు , చేర్పులు , కూర్పులు చేయబడ్డాయి .

మలయాళం సినిమాకన్నా మన తెలుగు సినిమా చాలా బాగుంటుంది . పి చంద్రశేఖర రెడ్డి చక్కటి స్క్రీన్ ప్లేని తయారు చేయటమే కాకుండా బాగానే నడిపారు సినిమాను . కృష్ణ స్వంత బేనరయిన పద్మాలయ స్టూడియోస్ బేనర్లో తీయబడింది . త్రిపురనేని మహారధి డైలాగులను ఓ రాజకీయ సినిమాకు ఎలా ఉండాలో అంతే పదునుగా అందించారు .

ఇదంతా ఓకే అయినా సినిమా ఏయన్నార్ , కృష్ణ కాంబినేషన్ లెవెల్లో ఆడలేదు . ఇప్పటిలాగా సోషల్ మీడియా లేకపోయినా , రివ్యూలు వ్రాయకూడదంటూ కోర్టు ఉత్తర్వులు లేకపోయినా రాజకీయ కారణాల వలన సినిమా ఆడలేకపోయింది అని అనుకున్నారు .

కధ ఏంటంటే… : అధికారంలో ఉన్న సర్వం నేనే పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రజారాజ్యం పార్టీ గెలిచి ఏయన్నార్ ముఖ్యమంత్రి అవుతాడు . ముఖ్యమంత్రి అవ్వాలనే ఘట్టి కోరిక ఉన్న కోట శ్రీనివాసరావు నిరాశకు గురవుతాడు . కాంట్రాక్టర్ పాపారావు , పార్టీ అధ్యక్షుడు నాగభూషణం , కోట శ్రీనివాసరావు కలిసి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చరణ్ రాజుకి సుపారీ ఇస్తారు .

ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రత కోసం ఆయన స్నేహితుడు అయిన కృష్ణను నియమిస్తారు . పార్టీలోనే అసమ్మతి వర్గం , కాంట్రాక్టర్ పాపారావు పాత్రలో ప్రభాకరరెడ్డి కలిసి ముఖ్యమంత్రిని హత్య చేసే ప్లానుని కృష్ణ భంగం చేయటమే మిగిలిన సినిమా అంతా . క్లైమాక్సులో ముఖ్యమంత్రి రక్షించబడటంతో శుభాంతం అవుతుంది .

సినిమాకు ప్రత్యేకత ఏమిటంటే కృష్ణకు హీరోయిన్ లేకపోవటం . డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసరుగా ఉద్యోగం చేయటమే . బాగుంది పాత్ర . కృష్ణ బాగా  stable గా చేసారు . ఏయన్నార్ ముఖ్యమంత్రిగా , ప్రజా ముఖ్యమంత్రిగా చాలా బాగా నటించారు . ఏ టంగుటూరి ప్రకాశం పంతులు గారో మా తరం వారికి , మాకన్నా పెద్ద వారికి గుర్తుకొస్తారు .

సినిమాలో విలువలతో కూడిన రాజకీయాల గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది . Not approved అనే ముఖ్యమంత్రి గారి ఆదేశాలను Note approved గా మార్చే అవినీతి అధికారుల గురించి ఉంటుంది . ఇప్పుడు ఈ సినిమా వచ్చాక 37 ఏళ్ళకు చూస్తుంటే గత 30 ఏళ్ళలో , మరీ ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళలో , జరిగిన , జరుగుతున్న ఎన్నో రాజకీయ పరిణామాలు గుర్తుకు వస్తూ ఉంటాయి .

ముఖ్యమంత్రి భార్యగా సుజాత , పిఏగా బ్రహ్మానందం , కూతురిగా ప్రియాంక , ప్రొఫెషనల్ కిల్లరుగా చరణ్ రాజ్ , పార్టీ అధ్యక్షుడుగా నాగభూషణం , అసమ్మతి గ్రూప్ నాయకుడిగా కోట శ్రీనివాసరావు , కాంట్రాక్టరుగా ప్రభాకరరెడ్డి , ఐజీగా గుమ్మడి , మరో పోలీస్ అధికారిగా బాలయ్య , గవర్నరమ్మగా జమున , ఇతర పాత్రల్లో ప్రదీప్ శక్తి , ఈశ్వరరావు , త్యాగరాజు , తదితరులు నటించారు . ఈ సినిమాలో చరణ్ రాజుకు మంచి పేరు వచ్చింది .

ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రెండు హాస్య పాత్రలు ఉన్నాయి . నూతన్ ప్రసాద్ , శ్రీలక్ష్మి పాత్రలు . ఇధ్దరూ చిల్లర దొంగలు . స్టార్ హోటళ్ళలో దొంగతనాలు చేసే పాత్రలు . కిల్లరుని పట్టిచ్చే కీలక పాత్రలని బాగా పోషించారు .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడకపోతే తప్పక చూడండి . A watchable , political movie . నేను పరిచయం చేస్తున్న 1223 వ సినిమా. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…
  • వెంకటేశ్ ‘ఒంటరి పోరాటం’… చిరంజీవి సినిమా కథే కాస్త అటూ ఇటూ…
  • కలంయములు..! తెలంగాణ పోలీసులు చెబుతున్న పాఠమేమిటంటే..!!
  • నారీ నారీ నడుమ శర్వా..! సంక్రాంతి బరిలో కాలరెగరేసిన మరో హీరో..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions