.
సినిమా సెలబ్రిటీల మాటలు ఈమధ్య బహిరంగ వేదికల మీద గమనిస్తూనే ఉన్నాం కదా… దర్శకుడు రాజమౌళి మినహాయింపు ఏమీ కాదు… కాపీ సీన్స్, చరిత్రల వక్రీకరణ సంగతులు బోలెడుసార్లు బొచ్చెడు కథనాల్లో చూశాం, చదివాం…
ఆర్ఆర్ఆర్‌లో కుమ్రం భీమ్, అల్లూరి రామరాజును కలిపిన ‘ఘొప్ఫ’ దర్శకుడు కదా… ఇప్పుడు ఇస్రో రాకెట్ మీద ఓ అర్థం లేని డొల్ల వ్యాఖ్య చేశాడు… ఇలా…
Ads

*ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన రాకెట్‌కు మా బాహుబలి పేరు పెట్టడం మాకు ఆనందాన్నిచ్చింది’’… ఇదీ తన స్టేట్‌మెంట్… పదే పదే బాహుబలిని బ్రాండ్ ప్రచారంలో పెట్టుకోవడం తప్ప ఇందులో వేరే అర్థం లేదు… పైగా ఇప్పుడు ఎపిక్ అని బాహుబలి రెండు పార్టులూ ఒకేచోట కుట్టి మళ్లీ రిలీజ్ చేశాడు కదా… ఇదో ప్రమోషన్…
నిజానికి తన వ్యాఖ్యలు అర్థరహితం, హాస్యాస్పదం… తనకు ఏమీ తెలియదు అని అర్థం… ఆర్ఆర్ఆర్ సినిమాలోని వక్రీకరించబడిన చరిత్రలాగే..! నిజం ఏమిటంటే..?
“బాహుబలి” అనేది LVM3 రాకెట్ యొక్క అధికారిక (official) పేరు కాదు… LVM3 అంటే… (లాంచ్ వెహికల్ మార్క్-3) ఇస్రో బాహుబలి, వీరబలి, మహాబలి, రక్తబలి వంటి పేర్లు పెట్టదు… అది సినిమా నిర్మాణ సంస్థ కాదు, పిచ్చి మీడియా సంస్థ కూడా కాదు… ఆ రాకెట్ అధికారిక పేరు… LVM3 (గతంలో GSLV Mk III అని పిలిచేవారు)….
బాహుబలి అనే పేరు మీడియా పెట్టుకుంది… సహజం… ఈ రాకెట్ పేలోడ్ దాదాపు 4 టన్నులు… అంత భారీ బరువును మోసుకుపోతోంది కాబట్టి బాహుబలి అన్నారు… ఈ బరువుతో రాకెట్ ప్రయోగించడం ఇస్రోకు ఇప్పుడు అలవోక పని… బాహుబలి అనే పేరును ఓ విశేషణంగా వాడుతున్నారు మీడియాలో…
ఆమధ్య గోదావరి వరదల్లో మునిగి, ఈరోజుకూ పూర్తిగా రిస్టోర్ గాని ఓ పంపు హౌజులో మోటార్లను కూడా బాహుబలి మోటార్లు అని రాసేది మీడియా… నిజానికి బాహుబలి అనే పదమే తప్పు భాషావేత్తల విశ్లేషణల్లో… బాహువుల బలం బాగా ఉంటే బాహుబలి ఎలా అవుతుంది… బలి అనే పదానికి అర్థం వేరు…
రాజమౌళి కోసం… తను వినడు, చదవడు, ఎవరు చెప్పినా పట్టించుకోడు… “బాహుబలి” చారిత్రక వ్యక్తి కాదు, అదొక మత సంబంధమైన పాత్ర… ప్రత్యేకించి జైన మతంలో అత్యంత గౌరవనీయమైన, పవిత్రమైన పురాణ పురుషుడు…
జైనమత విశ్వాసాల ప్రకారం…. మొదటి తీర్థంకరుడి కుమారుడు… బాహుబలి జైనమత స్థాపకుడైన, మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని (ఆదినాథుని) కుమారుడు… రాజ్యాన్ని త్యజించడం… తన సోదరుడు భరతుడితో రాజ్యం కోసం జరిగిన పోరాటంలో గెలిచినప్పటికీ, సంసార జీవితంపై విరక్తి చెంది, రాజ్యాన్ని త్యజించి సన్యాసం స్వీకరించాడు…
మహా తపస్సు…: మోక్షం పొందాలనే లక్ష్యంతో, శరీర స్పృహ లేకుండా, ఒక సంవత్సరం పాటు కాయోత్సర్గ (నిలబడి) భంగిమలో కఠోర తపస్సు చేశాడు… ఈ సమయంలో అతని కాళ్ళ చుట్టూ పాదులు (పాకే మొక్కలు) పెరిగాయని, అతని శరీరంపై చీమల పుట్టలు ఏర్పడ్డాయని ప్రతీతి… మోక్షం…: ఈ తీవ్రమైన ధ్యానం, తపస్సు ఫలితంగా, అతను సర్వజ్ఞానం ఆత్మవిముక్తి (మోక్షం) సాధించాడు…
గోమఠేశ్వరుడు…: బాహుబలిని “గోమఠేశ్వరుడు” అని కూడా పిలుస్తారు… కర్ణాటకలోని శ్రావణబెళగొళలో ఉన్న 57 అడుగుల ఏకశిలా విగ్రహం ఆయనకు అంకితం చేయబడింది.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి…
సో, బాహుబలి అంటే కండలు పెంచబడిన, అసాధారణమైన శారీరక బలాన్ని కృతిమంగా తెరపై ప్రదర్శించే పాత్ర కాదు… ప్రభాస్‌లు కాదు, రానాలు కాదు… బాహుబలి అంటే… అసాధారణమైన శారీరక బలం కలిగి ఉండి, చివరికి ఆ బలాన్ని, రాజ్యాన్ని వదిలిపెట్టి, ఆత్మశక్తితో మోక్షాన్ని సాధించిన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి…
Share this Article