.
బాహుబలి… తెలుగు సినిమా మార్కెట్‌ను ఎలా విశ్వవ్యాప్తం చేయాలో చేసి చూపించాడు రాజమౌళి… ఆ సినిమా రిలీజప్పుడు రకరకాల మార్కెటింగ్ పద్ధతులతో వీలైనంత దండుకున్నాడు… తరువాత బాహుబలి సీక్వెల్… దాన్నుంచి మరింత పిండుకున్నాడు…
పుస్తకాలు, బొమ్మలు, కామిక్స్, ఆడియోలు… మార్కెటింగ్ మాయామర్మాలు తెలిసినోడు కదా, కొడుకును ప్రయోగించి ఓ ఆస్కార్ కూడా కొట్టాడు… అదీ ఓ పిచ్చి పాటకు… పది అవార్డులకు వల వేస్తే ఒకటి పడింది… అదే బాహుబలి పేరిట ఇంకా ఇంకా కుమ్మేస్తున్నాడు… రాబోయే ది ఎపిక్ బాహుబలి అదే…
Ads
బాహుబలి రెండు పార్టులూ ఓచోట కలిపేసి, కుట్టేసి… మళ్లీ వదలడమే… మరి ఇప్పటికే థియేటర్లలో చూశారు, ఓటీటీల్లో చూశారు, టీవీల్లో చూశారు, మేకింగ్ వీడియోలు చూశారు, చిన్న చిన్న బిట్స్ కూడా సోషల్ మీడియాలో చూశారు… లక్షల వార్తలు, కథనాలు, సమీక్షలు, తప్పొప్పులు, మిస్టేక్స్ కూడా చదివాం, విన్నాం, చూశాం… మరింకా ఏముంది చూడటానికి..?
ఏవో కొన్ని కొత్త సీన్లున్నాయి అని ఊదరగొడుతున్నారు… అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు కొన్నాళ్లు నడిచాక పాటలో, సీన్లో జతచేస్తుంటారు కదా… అలాగన్నమాట… ఓజీలో నేహా కిస్ కిస్ పాట యాడ్ చేసినట్టు… ఏమైనా ఫాయిదా ఉంటుందనేది పెద్ద బ్రహ్మపదార్థం వంటి చిక్కు ప్రశ్న…
220 నిమిషాలు చూసే ఓపిక ఉందా ప్రేక్షకుల్లో..? అదీ ఆల్రెడీ తెలిసిన సీన్లు, చూసేయబడిన సీన్లు… ఏమో, చూడాలి… బెనిఫిట్ షోలు, అదనపు షోలతో డబ్బు దండుకోవడం చూస్తూనే ఉన్నాం కదా… ఇలా రెండు భాగాల సినిమాను ఒక్కచోట కుట్టేసి, గంటలకొద్దీ ప్రేక్షకుడిని కట్టేసి మరీ చూపించడం కొత్త ట్రెండ్ అన్నమాట…
ఇంకేముంది… నాలుగు రోజులాగి కాంతారను, కాంతార చాప్టర్ వన్‌ను కుట్టేసి రిలీజ్ చేయొచ్చన్నమాట హొంబలె వాడు… కాకపోతే కొత్త కాంతారను ముందుగా చూపి, దానికి పాత కాంతారను తరువాత యాడ్ చేయాలి… కేజీఎఫ్ కూడా వాళ్లదే…
హిందీలో కూడా కొన్ని సీక్వెళ్ల సినిమాలున్నాయి… రాజమౌళి ప్రయోగం సక్సెసైతే వాళ్లూ ఇదే మొదలుపెడతారు ఇక… అవునూ… 220 నిమిషాలు అంటే రెండో మూడో ఇంటర్వెళ్లు ఉంటాయా మిస్టర్ రాజమౌళీ… మధ్యలో బయటికి వెళ్లి ఎక్కడైనా టిఫినో, భోజనమో చేసి వచ్చే వీలు కూడా కల్పిస్తే బెటరేమో ఆలోచిచండి ప్లీజ్…!!
Share this Article