.
Paresh Turlapati …… రాజాసింగ్ మళ్లీ అలిగాడు… అవును, రాజసింగ్ మళ్లీ బీజేపీ మీద అలిగాడు. నిజానికి రాజా సింగ్ బీజేపీ మీద అలగడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిసారి కూడా కాకపోవచ్చునేమో ? తను అలగకపోతేనే వార్త…
తాజాగా గోల్కొండ పరిధిలో తాను సూచించిన వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పలేదని బీజేపీ నాయకత్వం మీద అలిగి, పార్టీనుంచి వెళ్ళిపోతా అని అల్టిమేటం జారీ చేశాడు. ఇప్పుడు బీజేపీలో రాజా సింగ్ హాట్ టాపిక్ అయ్యాడు
Ads
అసలు ఈ రాజాసింగ్ ఎవరు? బీజెపీ ఈయన్ని ఎందుకు ఒదులుకోలేకపోతుంది ? ఈయన బీజేపీని ఎందుకు వదులుకోలేడు ? తెలుసుకోవాలంటే కొద్దికాలం వెనక్కి వెళ్ళాలి.
బీజేపీకి గోషా మహల్ నియోజకవర్గాన్ని కంచుకోటలా నిలిపిన వ్యక్తి రాజా సింగ్… అక్కడ ఫరమ్‌గా నిలబడి, నిలదొక్కుకుని గెలవడం ఎంత కఠినమైన టాస్కో అక్కడ పోటీచేసేవాళ్లకే తెలుసు… మూడు సార్లు బీజెపీ తరుపున గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు తను.
ఈ రకంగా పార్టీలో రాజా సింగ్ సీనియరే. కానీ ఇప్పటివరకు విప్ పదవి తప్ప రాజా సింగ్‌కి బీజేపీ పదవుల రీత్యా ఎందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది?
ఎందుకూ అంటే ఒకటే అందుకు కారణం కనిపిస్తుంది. అది రాజా సింగ్ దూకుడు స్వభావం. కరడు గట్టిన హిందూత్వ నినాదంతో ముస్లిమ్ సంఘాలపైన రాజా సింగ్ చేసిన వివాదాస్పద వాఖ్యలతో బీజేపీ రాజకీయంగా ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి
రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో 2022 లో బీజేపీ అధిష్ఠానం అతడ్ని పార్టీనుంచి సస్పెండ్ చేసింది కూడా… కానీ వెంటనే తదుపరి ఎన్నికల నాటికి అతడిపై పెట్టిన సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి గోషా మహల్ టికెట్ ఇచ్చింది. రాజా సింగ్ మూడోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు.
అందుకే ముందే చెప్పాను, బీజేపీ రాజా సింగ్‌ను ఒదులుకోదు. అలాగే రాజా సింగ్ బీజేపీని ఒదిలిపోడు. ఇక్కడ రాజా సింగ్‌కు బండి సంజయ్‌కు కొంత రాజకీయ సారూప్యతలు ఉన్నాయి. బండి సంజయ్ కూడా తన రాజకీయ ప్రస్థానం కార్పొరేటర్ పదవితో మొదలు పెట్టాడు. అలాగే రాజా సింగ్ కెరీర్ కూడా కార్పొరేటర్ పదవితోనే మొదలు అయ్యింది.
కాకపోతే బండి సంజయ్ తన రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే మొదలు పెట్టగా రాజా సింగ్ మొదట కాంగ్రెస్‌తోనూ తర్వాత టీడీపీతోనూ కొనసాగించి చివరికి బీజేపీలో స్థిరపడిపోయాడు. అలాగే బండి సంజయ్ హిందూత్వ విధానాలను విసృతంగా ప్రచారం చేసి చిన్న వయసులోనే హిందూ సంఘాల దృష్టిలో పడ్డాడు.
రాజా సింగ్ కూడా హిందూత్వ విధానాలను ప్రచారం చేశాడు కానీ ఈయన ఎంచుకున్న మార్గం వివాదాస్పదం అయ్యింది. బండి సంజయ్ పార్టీలో గుర్తింపు తెచ్చుకుని కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా రాజా సింగ్‌కు చెప్పుకోదగ్గ పదవులు ఏమీ లేవు. ఈ స్థితి కేవలం రాజా సింగ్ అతివాదం వల్లనే.
గోసంరక్షణ సమితి పేరిట దళాలను ఏర్పాటు చేసుకుని అనేక సందర్భాలలో గోవధను అడ్డుకున్నాడు. తరచూ ముస్లిమ్ సంఘాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనాలకు కేరాఫ్ గా మారాడు. రాజా సింగ్ మీద ఇప్పటివరకు మొత్తం 114 కేసులు బుక్ అయితే వాటిలో 18 కేసులు మత కలహాలకు సంబంధించినవి.
ప్రస్తుతం రాజా సింగ్ శత్రువుల హిట్ లిస్టులో ఉన్నాడు. ఇక ప్రస్తుత అంశానికి వస్తే, రాజా సింగ్ స్థానిక నాయకత్వం మీద అలిగి బీజెపీ నుంచి వెళ్లిపోతా అంటున్నాడు కానీ ఆయన ఉన్న పరిస్థితి దృష్ట్యా వెళ్ళలేడు. ఇప్పటికే ఆయన మీద కుప్పలు తెప్పలుగా కేసులు ఉన్నాయి. పైగా శత్రువుల హిట్ లిస్టులో ఉన్నాడు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని విడిచి పెట్టి వెళ్తే ఇబ్బందులు పడేది ఆయనే. ఈ విషయం రాజా సింగ్ కు కూడా తెలుసు. అలాగే బీజేపీలో బలమైన బీసీ నాయకుడిగా ముద్రపడ్డ రాజా సింగ్‌ను బీజేపీ నాయకత్వం కూడా అంత తేలికగా ఒదులుకోదు. నయానో భయానో అతడితో వివాదం పరిష్కారం చేసుకుంటుంది.
చివరికి ఇదంతా టీ కప్పులో తుఫాను మాదిరి అవుతుందా? అవును, అదే జరిగింది. అనుకున్నట్టుగానే కథ సుఖాంతం అయ్యింది.. రాజా సింగ్ సూచించిన వ్యక్తికే గోల్కొండ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు..!
Share this Article