ఈమధ్య ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతున్నయ్… రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ముందుగా బీజేపీ అనే అత్యంత బలమైన ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీయాల్సిందే అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది… రాహుల్‌పై అనర్హత వేటును బేస్‌గా చేసుకుని దాదాపు 18, 19 ప్రతిపక్షాలు బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి… సుప్రీంకు కూడా వెళ్లాయి… మోడీ ప్రధాన అస్త్రాలైన ఈడీ, సీబీఐల నుంచి రక్షణ కోసం ఏవేవో సాంకేతిక పదాలతో కేసు వేశాయి… మీరు అందరిలాంటివారు కాదా..? మీకెందుకు మినహాయింపులు అంటూ సుప్రీం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది…
నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట రెచ్చిపోయి తమ పోలీసులతో బీజేపీ ముఖ్యుల మీద కేసులు పెట్టడం లేదా..? సుప్రీంకు వెళ్లిన స్పిరిట్ ఏమైపోయింది..? మమత ఏకంగా సీబీఐ అధికార్లనే అరెస్టు చేసింది… బీఆర్ఎస్ నాయకుడు కేసీయార్ రోజురోజుకూ ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినే గోకుతున్నాడు… రకరకాల కేసులు, అరెస్టులతో నేరుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శినే బజారుకు లాగచూశాడు… అప్పుడే అయిపోలేదు… మోడీ నిష్క్రియాపరత్వంతో కేసీయార్ ఆశిస్తున్నవి బహుముఖ ప్రయోజనాలు…
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఈ కేసులతో నిస్సహాయింగా నిలబడిపోతున్నాడు, అది సహజంగానే కేడర్‌ను డిమోరల్ చేస్తుంది…
- నేను బజారుకు లాగుతా, బురద జల్లుతా, ఎలా కడుక్కుంటావో నీ తలనొప్పి అన్నట్టుగా మోడీకే విసురుతున్న సవాల్ ఇది…
- రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఐక్యత లేదు, కేసీయార్ ఈ కేసులతో ఆ విభేదాలింకా బట్టబయలయ్యేలా చేస్తున్నాడు…
- రాష్ట్రంలో ఎంతగా అంగీలు చింపుకున్నా సరే, ఢిల్లీ ఏమీ చేయలేదు, చేయడం లేదనే భావన కేడర్‌లో పెరుగుతుంది…
- బీజేపీని ఖతర్నాక్‌గా ఎదురుకుంటున్నాడనే ఇమేజీ కావాలి కేసీయార్‌కు… అది మెల్లిమెల్లిగా సాధిస్తున్నాడు…
- నా బిడ్డ మీద కేసు పెడతారా అనే కోపంతో ఎక్కడబడితే అక్కడ బీజేపీలో ఇద్దరిని టార్గెట్ చేసి కొడుతున్నాడు…
- బీజేపీని ఎదురుకుంటున్నందునే కక్షతో తన కుటుంబాన్ని మోడీ వేధిస్తున్నాడనే ప్రచారంలో ముందున్నాడు…
- ఈ ప్రచారం ద్వారా అవినీతి అనే ఆరోపణలు పక్కకు వెళ్లిపోయి, రాజకీయ వేధింపులే తెరపైకి వస్తున్నాయి…
- నాన్ బీజేపీ పార్టీల్లో ఛాంపియన్ అనే ముద్ర వస్తే, అది తనకు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఫాయిదా…
- ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు సంభావ్యతలు, ప్రతిపాదనలు బలంగా చర్చకు వస్తున్నాయి…
ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయి కేసీయార్ ఒక దశలో తనను నాన్ బీజేపీ కూటమికి లీడర్‌ను చేస్తే మొత్తం ప్రచారవ్యయం భరిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు ఓ వ్యాఖ్య వదిలాడు… దానిపై తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతూనే ఉంది… ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసంలో మోడీని ఎదురొడ్డే లీడర్ ఎవరు అంటూ ఓ విశ్లేషణ రాసుకొచ్చాడు… మోడీ కేసులకు భయపడి ఇక అన్ని ప్రతిపక్షాలూ ఏకమవుతున్నాయి అంటూ రాసుకొచ్చిన ఆ వ్యాసంలో ప్రధాని మోడీకి ప్రబల ప్రత్యర్థిగా కేసీయార్ కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు… మమత, కేజ్రీవాల్ తదితరులు ఎక్కడ ఫెయిలయ్యారో రాశాడు… జనతా వంటి ప్రయోగమే శరణ్యమని కూడా రాశాడు… కానీ…
Ads
స్టాలిన్‌కు, నితిశ్‌కు కూడా ఆశలున్నాయనీ.., స్టాలిన్ కూడా కొన్ని జాతీయ సమావేశాలతో ప్రతిపక్ష ఛాంపియన్‌గా అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడనీ రాజదీప్ రాయడం మరిచిపోయాడు… అప్పట్లో ఇందిరాగాంధీని చిత్తుగా ఓడించిన సందర్భాన్ని రాస్తూనే… ప్రతిపక్షాల్ని జనతాపార్టీగా ఏకం చేసి, విజయం సాధించి, ఇందిరను గద్దెదించడంలో జయప్రకాష్ నారాయణ పాత్రను విస్మరించాడు… ప్రముఖ జర్నలిస్టుల రాతలే ఇంత గందరగోళం, ప్రతిపక్ష ఎజెండాలాగే… నిజానికి ప్రస్తుతం ప్రతిపక్షాల్లో జయప్రకాష్ వంటి నిష్కళంకుడు, క్రౌడ్ పుల్లర్, సంధానకర్త ఎవరున్నారు..? ఆ క్రెడిబులిటీ ఎవరికి ఉంది..? ఈ చర్చ, ఈ ప్రస్తావన లేకుండా ప్రతిపక్ష ఐక్యత గురించి ఎన్ని ఠావులు రాసుకొచ్చినా అందులో పస ఏమీ ఉండదు మిస్టర్ రాజదీప్…!
Share this Article