పాపం శమించుగాక… బండ్ల గణేష్ వంటి కేరక్టర్లు రజినీకాంత్ వంటి అగ్రహీరోలను కూడా ఆవహించే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది… నిజం… ఒక మెచ్చుకోలు సున్నితంగా గుండెను తాకాలి… కానీ మొరటు మెచ్చుకోళ్లు, అతిశయోక్తులు రోత పుట్టిస్తాయి… రజినీకాంత్ మరణించిన పునీత్ రాజకుమార్ గురించి మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నయ్… నిజానికి పునీత్ ప్రశంసలకు పాత్రుడే, కానీ ఆ పొగడ్తలు పొగడపూలలా తాకాలి… కానీ ఇదేమిటి రజినీకాంత్..?
నిజానికి తను స్పందించకపోయేవాడేమో… తను కన్నడిగుడు కాబట్టి మొన్న రాజ్యోత్సవ సంబరానికి పిలిచింది అక్కడి సర్కారు… మరణాానంతరం పునీత్‌కు కర్నాటక రత్న పురస్కారం అందచేసింది… అయిదు తులాల ఆ అవార్డును పునీత్ భార్య అశ్విని అందుకుంది… జూనియర్ ఎన్టీయార్, కర్నాటక సీఎం బొమ్మై, రజినీకాంత్, సుధామూర్తి తదితరులు సాక్షులు… అయితే అంతకుముందే రజినీపై విమర్శలు వినవచ్చాయి… పునీత్ మరణించినప్పుడు ఎక్కడ పోయావ్..? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నవ్..? అనేది ఆ విమర్శల సారం… దానికి జవాబుగా అన్నట్టు ఏదేదో మాట్లాడాడు…
వర్షం కారణంగా అందరూ షార్ట్‌గా స్పీచులు ముగించారు… రజినీకాంత్ మాట్లాడుతూ… ‘‘అందరూ సుఖశాంతులతో బతకాలి… కులం, మతాలకు అతీతంగా మెలగాలి… రాజరాజేశ్వరి, అల్లా, జీసస్ ఆశీస్సులను కోరుకుంటున్నా’’ అన్నాడు… బాగుంది… కానీ వెంటనే పునీత్ ‘‘దేవుడి కొడుకు, కలియుగంలో పునీత్ ఒక మార్కండేయుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక నచికేతుడు… కొంతకాలం మనతో గడిపాడు… మనతో ఆడుకున్నాడు, నవ్వించాడు… తరువాత మళ్లీ దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు… కానీ తన ఆత్మ మనతోనే ఉండిపోయింది… మళ్లీ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఇంకా చెబుతాను’’ అని ప్రసంగిస్తూ పోయాడు రజినీకాంత్…
Ads
మరీ మార్కండేయుడు, ప్రహ్లాదుడు, నచికేతుడు దాకా వెళ్లిపోయిన తీరుతో రజినీకాంత్ మీద నిజంగా జాలేసింది… జూనియర్ బెటర్‌గా మాట్లాడాడు… ‘‘ఒక వ్యక్తి తన పెద్దల నుంచి కుటుంబ వారసత్వంగా ఇంటి పేరును పొంది ఉండవచ్చుగాక… కానీ జనం మెచ్చే వ్యక్తిత్వాన్ని సొంతంగా సంపాదించుకోవాలి… అహం, పొగరు వంటి దుర్లక్షణాలు లేకుండా తన చిరునవ్వుతో రాష్ట్రాన్ని గెలుచుకున్నవారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వెంటనే చెప్పడానికి పునీత్ పేరుంది… గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి, గొప్ప ఫ్రెండ్, గొప్ప డాన్సర్, గొప్ప సింగర్… అన్నింటికీ మించి గొప్ప మనిషి… అది కదా తనను పీపుల్స్ సూపర్ స్టార్‌ను చేసింది… కర్నాటక రత్న అవార్డుకు అక్షరాలా అర్హుడు’’ అంటాడు జూనియర్… స్ట్రెయిట్…
రజినీ ఇంకా మాట్లాడుతూ ‘‘పునీత్ తొలి సినిమా అప్పు… 2002లో దాన్ని పునీత్ తండ్రి రాజకుమార్‌తో కలిసి చూశాను… ఇది వందల రోజులు ఆడుతుంది అని చెప్పాను… అదే నిజమైతే వంద రోజుల పండుగకు రావాాలి అన్నాడు ఆయన… వచ్చాను, అప్పును సత్కరించాను…’’ అని గుర్తు చేసుకుంటూ… ‘‘అడుగుతున్నారు అందరూ… పునీత్ అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని… అప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను, ఆపరేషన్ జరిగింది, ఐసీయూలో ఉంచారు… కనీసం నాకు పునీత్ మరణం వార్త కూడా ఎవరూ చెప్పలేదు… ఒకవేళ లేచి తిరిగే పరిస్థితి ఉన్నా బెంగుళూరు దాకా వచ్చేంత స్థితి మాత్రం లేదు… అంతేకాదు, మరణించిన అప్పు మొహం చూడలేను… ఆ నవ్వు మొహమే నాకు గుర్తుండాలి…’’ అని చెబుతూ పోయాడు…!!
Share this Article