Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజమౌళి ఈగ కాదు… ఇది రాజీవ్‌గాంధీ ఈగ కథ… ఈగ చేసిన బదిలీ కథ…

March 13, 2022 by M S R

…….. Taadi Prakash………………     ఒక ఈగ – రాజీవ్ గాంధీ కథ (A Real life story by Tota Bhavanarayana) తోట భావనాారాయణ… పేరెక్కడో విన్నట్టే ఉందా ? జర్నలిస్టు… సీనియర్ మోస్టు ! ఎలక్ట్రానిక్ మీడియా ఆనుపానులన్నీ బాగా తెలిసినవాడు. పాత సంఘటనలు, రాజకీయ విశేషాలు, అలనాటి అపురూప చమత్కారాలు హాయిగా చెప్పగలడు, సెన్సాఫ్ హ్యూమర్ కి ఏ లోటూ లేకుండా. భావనారాయణ చాాలా ఏళ్ల క్రితం రాసిన ‘ ఈగ – రాజీవ్ గాంధీ ‘ అనే ఈ రియల్ లైఫ్ స్టోరీ చదవండి. ఎంత ఇంటరెస్టింగా నెరేట్ చేశారో ! It’s a must read, don’t miss it…



ఇది మూడున్నర దశాబ్దాల నాటి మాట. 1986 లో మనకు టీవీ అంటే దూరదర్శన్ మాత్రమే. అప్పటికే రంగుల ప్రసారాలు, శాటిలైట్ వినియోగం, ప్రత్యక్షప్రసారం మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ప్రైవేట్ చానల్స్ మాత్రం రాలేదు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రసారం చేయటానికే దూరదర్శన్ టైం సరిపోయేది కాదు. పైగా ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించటం లేదని విమర్శలు కూడా ఉండేవి. ఆ విమర్శలనుంచి తప్పించుకోవటం కోసం ప్రతిపక్షాల వారు పాల్గొన్న చిన్నాచితకా కార్యక్రమాలు కూడా ఒక ఫొటో జోడించి (వీడియో దొరక్క ) ప్రసారం చేసే వారు. ఆ రోజుల్లో జరిగిందే ఈ ఈగ కథ.

వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమం కోసం మార్గరెట్ థాచర్, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ సహా ప్రపంచదేశాల అధిపతులు చాలామంది పాల్గొంటున్న ప్రత్యక్షప్రసారమది. రాజీవ్ గాంధి కూడా ఆ ప్రత్యక్ష ప్రసారంలో ప్రసంగించాల్సి ఉంది. ఎక్కడివాళ్ళక్కడే ఉండి మాట్లాడుతున్నా, ఒకరినొకరు చూసుకుంటూ, వింటూ మాట్లాడే కార్యక్రమం అది. అలాంటి ఏర్పాటు అప్పటికి ఢిల్లీ స్టూడియోలో మాత్రమే ఉంది. మామూలు ప్రసంగమైతే ప్రధాని ఇంట్లో రికార్డు చేసి తీసుకురాగలిగేవారు. కుదరదు కాబట్టి రాజీవ్ గాంధి స్వయంగా దూరదర్శన్ స్టూడియోకు రావలసి వచ్చింది. ప్రధాని రాక గురించి ముందే తెలుసు కాబట్టి అధికారులు అక్కడ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.

Ads

లైవ్ లింక్ బాగానే సెట్ అయింది. రాజీవ్ గాంధి ప్రసన్న వదనంతో తనదైన సహజమైన చిరునవ్వుతో మాట్లాడటం మొదలెట్టారు. మధ్యలో ఒక ఈగ ఆయన మొహం మీదుగా వెళ్ళింది. ఆయన పట్టించుకోలేదు. అక్కడే ఉన్న సమాచార శాఖామంత్రి అజిత్ పాంజా కంగారుపడి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ భాస్కర్ ఘోష్ వైపు చూశారు. భాస్కర్ ఘోష్ తనవంతుగా ఢిల్లీ కేంద్రం డైరెక్టర్ గ్రేవల్ వైపు చూశారు.. స్టూడియో శుభ్రంగా ఉంచమని చెప్పానుగా అన్నట్టు. అప్పటికే ఆయనకు చెమటలు పట్టాయి. అసలే అది అంతర్జాతీయ కార్యక్రమం. స్వయానా ప్రధానికే ఈ పరిస్థితి ఎదురైంది. ఆపటానికి కూడా వీలులేని ప్రత్యక్షప్రసారం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈగ ఇంకేపనీ లేనట్టు రాజీవ్ మొహం మీదనే తచ్చాడుతోంది. భాస్కర్ ఘోష్ కాసేపు ఈగవైపు, మరికాసేపు గ్రేవల్ వైపు చూడటమే సరిపోయింది. మీ పని చెబుతా ఉండండి అన్నట్టు చూస్తున్నారు అజిత్ పాంజా.

తిట్లు తప్పవని భాస్కర్ ఘోష్, సస్పెన్షన్ ఖాయమని గ్రేవల్ ఎవరికి వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఆ ఈగ ఇకనైనా దయదలచి వెళుతుందేమోనని ఒక మూలన ఆశ ఉన్నా అది మాత్రం నిరాశపరచింది. అది రాజీవ్ మొహం మీదనే తచ్చాడటం మొదలెట్టింది. అయినా సరే, ఆయన ఆహ్లాదకరమైన చిరునవ్వు మాత్రం చెరగలేదు. చేత్తో దాన్ని విసురుతూనే ఉన్నారు. ఆయన మొహంలో ఇసుమంతైనా చిరాకు లేదు. ఆయన చిరాకు పడకపోవటం కాస్త ఊరటగా ఉన్నా ఎవరికి వాళ్ళే భయపడుతున్నారు. కార్యక్రమం ముగిసింది. కోటుకున్న మైక్ తీసి విసిరిపారేశారు. పరిశుభ్రత ఇలాగేనా అని ఆ గ్రేవల్ ను చెడామడా తిట్టారు. సర్ది చెబుదామనుకుంటూ వెళ్లబోయిన సమాచార శాఖామంత్రి అజిత్ పాంజా వైపు చూడనైనా చూడకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి కారెక్కారు.

డైరెక్టర్ గ్రేవల్ తో బాటు అక్కడి సిబ్బంది కూడా స్టూడియో ఎంత శుభ్రంగా తుడిపించామో చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు గాని అదంతా వృధా ప్రయాసేనని భాస్కర్ ఘోష్ కి అర్థమైంది. రాజీవ్ వెళ్ళేదాకా భయంతో ఉన్న మంత్రి ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. బాధ్యుణ్ణి గుర్తించి వేటు వెయ్యాల్సిందేనన్నారు. హోదా తగ్గించటమో బదిలీ చేయటమో జరిగి తీరాల్సిందేనన్నారు. ఆయనకు సర్దిచెప్పి పంపిన భాస్కర్ ఘోష్ ఆ ఈగ గురించి వాకబు చేశారు. స్టూడియో శుభ్రం చేసిన మాట నిజమే గాని చెత్త సామానంతా స్టూడియో వెనుక గదిలో భద్రపరిచారట. దాని వల్లనే ఈగ వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. సరే ఎలాగో మంత్రిగారు వదిలేశారు కాబట్టి సరిపోయింది.

ఇంతటితో ముగిసి ఉంటే ఈ కథ గురించి ఇప్పుడు చెప్పుకునే వాళ్ళం కాదు. ఒకరోజు మంత్రి అజిత్ పాంజా నుంచి డైరెక్టర్ జనరల్ భాస్కర్ ఘోష్ కు పిలుపొచ్చింది. వెళ్ళగానే ” ఏంటండీ.. ఈ పద్ధతేం బాగాలేదు.” అన్నారు చూడగానే కోపంగా. ఉరుములేని పిడుగులా ఆయన నేరుగా కోప్పడటం మొదలెడితే భాస్కర్ ఘోష్ షాక్ తిన్నారు. “మొన్న రాజీవ్ గాంధీ గారితో కలిసి టీవీ చూస్తుంటే ఒకావిడ పాట పాడుతూ ఉంది, ఆవిడ మొహం మీద ఈగ కదులుతూ ఉంది. ఆమె దాన్ని విసురుతూనే ఉంది. పీఎం చాలా కోఫ్ఫడ్డారు”… ఏం చెప్పాలో భాస్కర్ ఘోష్ కు అర్థం కాలేదు. కానీ ఈసారి ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు అని మాత్రం అనుకున్నారు.

“మీరో పని చెయ్యండి… ఆ పాట మీకు నచ్చిందని చెప్పి, దాని రికార్డు తెప్పించండి. అప్పుడు మనదగ్గర సాక్ష్యం ఉంటుంది. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవచ్చు” అన్నారు మంత్రి. ఆయన చెప్పినట్టే భాస్కర్ ఘోష్ ఆ స్టేషన్ డైరెక్టర్ గ్రేవల్ కి ఫోన్ చేసి అడిగితే ఆయన మొహం విప్పారింది. సాయంత్రానికల్లా టేప్ వచ్చి చేరింది. వెంటనే భాస్కర్ ఘోష్ ఆ టేప్ ప్లే చేసి చూశారు… ఆశ్చర్యం! అందులో ఈగ లేదు.. మళ్ళీ చూశారు… అయినా లేదు..ఏంటబ్బా.. ఒకరు కాదు ఇద్దరు చూశామంటున్నారు… వాళ్ళ ఇద్దరికీ ఈగ ఎలా కనపడిందా అని ఆలోచిస్తుంటే… తళుక్కున ఆలోచన మెరిసింది. చేయి ఊపటానికీ ఈగకూ సంబంధం లేదని కనిపెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో ఆ టేపు పట్టుకుని మంత్రిగారి ఆఫీసుకు వెళ్ళారు.

చేతిలో టేపుతో వచ్చిన భాస్కర్ ఘోష్ ను చూడగానే ఈ సారి వదలకూడదన్న పట్టుదల మంత్రి మొహంలో కనబడుతోంది. కానీ భాస్కర్ ఘోష్ మాత్రం ధీమాగా, “సార్ ! ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎత్తి చూపాలి గాని ఒకసారి పొరపాటు చేసినంత మాత్రాన పదే పదే అనుమానించటం మంచిది కాదు. చేయని తప్పుకు శిక్షిస్తామంటే ఎలా ?” అంటూ టేప్ చూపారు. ఈగ లేదు. మంత్రి బుర్ర గోక్కున్నారు. “కానీ మేం చూశాం. నేనే కాదు.. రాజీవ్ కూడా.. ” అన్నారాయన. కానీ ఈసారి మునుపటిలా గంభీరస్వరం కాదు.

ఆయన కాస్త తగ్గినట్టు కనబడగానే భాస్కర్ ఘోష్ గొంతు పెరిగింది. “కర్నాటక సంగీతం ఆలపించేవాళ్ళు చేయి ఊపటం సహజం. మీరు ఈగ గొడవ నుంచి బయటపడలేదు కాబట్టి ఆమె ఈగను విసురుతున్నట్టు మీకు అనిపించింది” అన్నారు. అదే అయి ఉంటుందన్నట్టు తలూపారు మంత్రి. మళ్ళీ చూస్తారా అని అడిగితే వద్దన్నారు. ప్రధానికి స్వయంగా చూపమని చెప్పి మరీ వచ్చేశారు భాస్కర్. మంత్రికి మాత్రం అంతా ఒక కలలా ఉంది. బుర్ర గోక్కోవటం ఆపలేదు.

కొద్దిరోజుల తరువాత భాస్కర్ ఘోష్ మంత్రిని కలిసినప్పుడు టేపు చేతికందిస్తూ, “రాజివ్ చూశారు. పొరపాటు పడి ఉంటామన్నారు” అన్నారు. టేపు తీసుకెళ్ళిన భాస్కర్ ఘోష్ ఆ ఢిల్లీ డైరెక్టర్ కు ఫోన్ చేసి ఈసారి వచ్చినప్పుడు టేప్ తీసుకెళ్ళమన్నారు. ఆయన రాగానే, ” బాగుందండీ, నాకు బాగా నచ్చింది. పాట బాగా రికార్డ్ చేశారు” అన్నారు భాస్కర్ ఘోష్. “థాంక్యూ సర్” అన్నారు గ్రేవల్ చేతులు నలుపుకుంటూ.

“ఆమె చాలా గొప్ప గాయని. నిజం చెప్పాలంటే మన టేప్ లో చిన్న ప్రాబ్లం ఉంది సర్” అన్నారు. భాస్కర్ ఘోష్ కి అర్థం కాలేదు. “ప్రాబ్లమా ?” టేప్ బాగానే ఉందే !” అన్నారు. “అదే సార్! ఈగ…” సస్పెన్స్ కి తెరదించుతూ చెప్పారు గ్రేవల్. “పిఎమ్ రాకముందే ఈ పాట రికార్డింగ్ జరిగింది. అందుకే స్టూడియోలో ఈగ ఈ పాటలో కూడా కనిపిస్తుంది. మీరు అడగ్గానే, పంపే ముందు చూసి ఈగ కనబడకుండా ఎడిట్ చేసి పంపాం”. అనగానే భాస్కర్ ఘోష్ కు నోట మాట రాలేదు. మరుసటిరోజే గ్రేవల్ కు ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ అందాయి. తనను, తన ద్వారా మంత్రిని, ప్రధానమంత్రిని కూడా మోసం చేసినందుకు మాత్రం కాదు… ప్రధాని రావటానికి ముందే ఈగ గురించి తెలిసినా, నిర్లక్ష్యంగా ఉన్నందుకు భాస్కర్ ఘోష్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు… ( దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్ భాస్కర్ ఘోష్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ప్రైవేట్ సంభాషణలో చెప్పిన అనుభవమిది )…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions