.
( రమణ కొంటికర్ల
) అండర్ వరల్డ్ బెదిరింపులకు.. అదర్ వరల్డ్ బాటపట్టాడు: ఓ బాలీవుడ్ దర్శకుడి రియల్ స్టోరీ ఇది!
బాలీవుడ్ ఇండస్ట్రీపై అండర్ వరల్డ్ మాఫియా ప్రభావమెంతో అందరికీ తెలిసిందే. కథలుకథలుగా చెప్పుకున్నదే. సినిమాల రూపంలో రీళ్లకు రీళ్లు బయటకొచ్చి బాక్సాఫీసులను బద్దలుకొట్టిందే. ఏకంగా జైళ్లకు వెళ్లిన నేతల సంగతీ ఈ లోకం చూసిందే.
Ads
అలా అండర్ వరల్డ్ బాధితుల వరుసలో ఓ బాలీవుడ్ దర్శకుడు కూడా ఉన్నారు. అయితే, ఆయన తనను తాను రక్షించుకోవడానికి ఆయన ఏకంగా సీఐడీ ట్రైనింగ్ కూడా తీసుకోవడం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్. ఎవరాయన..?
ఆయన ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా హిట్ లిస్టులో ఉన్నాడు. ఆ జాబితాలో ఉన్నట్టు ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఇక నిన్ను చంపేస్తామని హెచ్చరించారు. దాంతో సదరు దర్శకుడు ఏకంగా సినిమాలకే స్వస్తి పలికాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆయన ఇష్యూ ముంబై సర్కార్ లో కూడా చర్చకొచ్చింది. ఆయన తనను తాను రక్షించుకునేందుకు.. ఆత్మరక్షణకై ఏకంగా సీఐడీ అధికారుల నుంచి శిక్షణ కూడా తీసుకున్నారు.
ఆయనే బాబీడియోల్, అక్షయ్ కుమార్, కాజోల్, రవీనాటాండన్ వంటి ప్రముఖులైన హీరో, హీరోయిన్స్ పనిచేసిన రాజీవ్ రాయ్.
ఎందుకు గ్యాంగ్ స్టర్స్ రాజీవ్ రాయ్ ని బెదిరించారు..?
బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్స్ ప్రభావం చాలామందిపై ఉంది. అందులో తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నవారెందరో. కానీ, ఏకంగా రాజీవ్ రాయ్ ని హెచ్చరించడంతో పాటు.. ఆయన కార్యాలయంపైనా మాఫీయా గూన్స్ దాడి చేసిన ఘటన ముంబైలోనూ.. అక్కడి బాలీవుడ్లోనూ తీవ్ర కలకలమే రేపింది. ఏకంగా రాజీవ్ రాయ్ ముంబై వదిలి యూకేకు మకాం మార్చేశాడు. అండర్ వరల్డ్ మాఫియా ప్రభావం పూర్తిగా తగ్గిపోయాక.. మళ్లీ ముంబై తిరిగి వచ్చాడు.
రాజీవ్ రాయ్ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానక ఘట్టమది!
1990 కాలంలో తనకు వచ్చిన ఫోన్ కాల్స్ ను గుర్తుచేసుకుంటూ కొన్ని విశేషాలను పంచుకున్నారు రాజీవ్ రాయ్. అండర్ వరల్డ్ నుంచి వచ్చే కాల్స్ ను ఎత్తొద్దని పోలీసులు సూచించారని.. తన భద్రత కోసం సీఐడీ అధికారుల వద్ద శిక్షణ కూడా తీసుకున్నానన్నాడు.
అలాగే, ముంబైలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు అవసరమైతే, అనుమానంగా అనిపిస్తే రెడ్ సిగ్నల్స్ ని కూడా క్రాస్ చేసి వెళ్లిపోయే పోలీస్ పర్మిషన్ కూడా రాజీవ్ రాయ్ కి ముంబై పోలీస్ కల్పించింది.
రాజీవ్ రాయ్ సినిమాల్లో మొహ్రా, గుప్త్ ఈ రెండూ బాక్సాఫీసును బద్ధలు కొట్టిన బంపర్ హిట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరించిన గుప్త్ తో పాటు, మల్టీస్టారర్ మొహ్రా.. మ్యూజికల్ గా కూడా విజూ షా అందించిన పాటలతో బ్లాక్ బస్టర్స్ గా నిల్చాయి. అయితే, అంత సక్సెస్ ఇచ్చిన గుప్త్ సినిమాతోనే రాజీవ్ రాయ్ కి చిక్కులు కూడా మొదలయ్యాయి.
గుప్త్ విడుదల తర్వాత రాజీవ్ రాయ్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అదో అన్ నోన్ నంబర్. ఫోన్ లో అటువైపు నుంచి బెదిరింపులెదుర్కొన్నాడు. కానీ, తానొక్క మాటా మాట్లాడలేదు. జస్ట్ వినడానికే పరిమితమయ్యాడు. వెంటనే రాజీవ్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏ నంబర్ నుంచి అయితే ఫోన్ కాల్ వచ్చిందో ఆ నంబర్ నుంచి ఇకముందు ఫోన్ వస్తే ఎత్తొద్దని పోలీసులు రాజీవ్ రాయ్ కి సూచించారు.
రాజీవ్ రాయ్ మొదటిసారి వచ్చిన అన్ నోన్ కాల్ తో… తర్వాత జాగ్రత్త పడ్డాడు. ఇకపై వచ్చే కాల్స్ అన్నింటినీ రికార్డ్ చేయించాడు. తన ఆఫీస్ లో ఒక బృందాన్నే ఏర్పాటు చేసుకుని వచ్చే ప్రతీ అన్ నోన్ కాల్ ను రికార్డ్ చేయించి భద్రపర్చాడు.
మొదటి కాల్ తాను నాల్గు సెకన్లపాటు మాట్లాడానన్న రాజీవ్ రాయ్.. ఇక తనకు అలాంటి ఏ కాల్స్ వచ్చినా అవి కచ్చితంగా డబ్బు కోసమేననే అనుమానించానన్నాడు. అంటే, తనకు మొదట వచ్చిన అన్ నోన్ కాల్ లోనూ డబ్బు కోసం మాఫియా గూన్స్ బెదిరించి ఉంటారనేది ఆయన చెప్పకనే చెప్పారు.
రాజీవ్ రాయ్ కార్యాలయంపై దాడి ఘటన!
1997లో రాజీవ్ రాయ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఏకంగా కొందరు మాఫియా డాన్స్ తుపాకులతో తన కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చారు. తన కార్యాలయంపై దాడి చేశారు. తనపైనా దాడికి తెగబడ్డారు. అదే రాజీవ్ రాయ్ కి చివరి రోజనుకున్న భయానక పరిస్థితి.
కింద నల్గురు.. పైన మరో నల్గురు తుపాకులతో దాడికి తెగబడితే.. రాజీవ్ రాయ్ బాడీగార్డ్స్ ఆయన్ను కాపాడారు. దాని గురించి మరింక వివరించేందుకు మాత్రం రాజీవ్ రాయ్ కి ఎందుకో మనసొప్పలేదు.
దాంతో ఇక్కడ ఉండటం వల్ల తన ప్రాణాలకు భరోసా కరువవుతుంది. అలాగే, తానే బాలీవుడ్ లో ఓ చర్చగా తయారవుతాడు. నిత్యం మాఫియా నుంచి బెదిరింపులెదుర్కొంటూ భిక్కుభిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. ఇదిగో ఇవన్నీ ఆలోచించుకున్న రాజీవ్ రాయ్ ఆ తర్వాత దేశం విడిచి యూకే వెళ్లి సెటిలయ్యాడు.
పైగా తన తండ్రి ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో.. ఒత్తిడికి గురికావల్సి వచ్చిన సమయమది. తాను లేకపోతే తన తండ్రికి దిక్కెవరు అనే బాధ కూడా రాజీవ్ రాయ్ ని వేధించింది. ఒకవేళ తననెవరైనా చంపేస్తే పరిస్థితేంటన్న భయం వెంటాడింది.
అలాగే, తన కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి.. ఇంకోవైపు ఆటిజంతో బాధపడుతున్న కొడుకు.. ఇలా చాలా విపత్కర పరిస్థితులు చుట్టుముట్టడంతో రాజీవ్ రాయ్ చాలాకాలంపాటు యూకేలోనే గడిపాడు…
Share this Article