Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!

September 6, 2026 by M S R

.

సూపర్‌స్టార్‌ను ఎవరూ పట్టించుకోలేదు!
‘‘ఆ రోజు నా అహంకారం పటాపంచలైంది.. ఆధ్యాత్మికతే అసలైన సూపర్‌స్టార్‌డమ్’’ — రజనీకాంత్

సినిమా తెర మీద ఆయన కనిపిస్తే చాలు… విజిల్స్.
ఆయన నడిచొస్తే చాలు… థియేటర్లు దద్దరిల్లుతాయి.
ఒక్కసారి చేయి తిప్పితే చాలు… అభిమానులు ఊగిపోతారు.

Ads

అలాంటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ‘‘నన్నెవరూ చూడలేదు, ఒక్కరూ పట్టించుకోలేదు’’ అని చెబితే? అది కూడా ఏదో చిన్న సభలో కాదు. వేలాది మంది భక్తులు ఉన్న చోట. ఆయనతో పాటు ఉన్నది ఓ ఆధ్యాత్మిక గురువు. ఆ అనుభవం తన అహంకారాన్ని ఎలా కూల్చేసిందో రజనీకాంత్‌ చెప్పిన తీరు ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో శ్రీశ్రీ రవిశంకర్‌ 70వ జన్మదినం, సంస్థ 45వ వార్షికోత్సవం సందర్భంగా రజనీకాంత్‌ ఈ మాటలు చెప్పారు.

ఆశ్రమానికి తొలిసారి వెళ్లినప్పుడు రెండు రోజులు ఉండాలని అనుకున్నారట. కానీ అక్కడి వాతావరణం, ప్రశాంతత, పచ్చదనం, సరస్సులు, మనుషుల ముఖాల్లో కనిపించే చిరునవ్వులు ఆయనను అంతగా ఆకట్టుకున్నాయి. రెండు రోజులు కాస్తా 15 రోజులయ్యాయి.

అసలు అసలు కథ మాత్రం ఆ తర్వాత మొదలైంది. ఒక రోజు శ్రీశ్రీ రవిశంకర్‌ వేలాది మంది భక్తులకు దర్శనం ఇవ్వడానికి వెళ్తూ రజనీకాంత్‌ను కూడా తనతో రమ్మన్నారట. ‘‘నేను వస్తే మీకు ఇబ్బంది అవుతుంది గురూజీ. నన్ను చూసి జనం ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వస్తారు’’ అని రజనీ అన్నారట.

కానీ గురూజీ పట్టించుకోలేదు. ‘‘ఏమీ కాదు.. రండి’’ అన్నారట. రజనీకాంత్‌ కూడా వెళ్లారు. వేలాది మంది భక్తులు. అందులో తమిళవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ‘‘అందరూ నన్ను గుర్తుపట్టి ఫొటోల కోసం ఎగబడతారు, గురువు ప్రోగ్రాం డిస్టర్బ్ అవుతుంది’’ అనుకున్నారు.

కానీ… ఒక్కరు కూడా రజనీకాంత్‌ను చూడలేదు! ‘‘నిజంగా చెబుతున్నాను… ఒక్క వ్యక్తి కూడా నా వైపు చూడలేదు. నేను ‘హాయ్‌’ అని చేతులు ఊపుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫొటో సంగతి, ఆటోగ్రాఫ్‌ సంగతి తర్వాత… కనీసం నా వైపు కూడా చూడలేదు’’ అని నవ్వుతూ చెప్పారు రజనీకాంత్‌.

అక్కడే ఆయనకు తగిలింది అసలైన షాక్‌. ‘‘నా అహంకారం ఆ రోజు పటాపంచలైంది’’ అని రజనీకాంత్‌ చెప్పారు. ఇది చెప్పేటప్పుడు ఆయనలో సూపర్‌స్టార్‌ కనిపించడు. ఓ మనిషి కనిపిస్తాడు. తనను తాను బయట నుంచి చూసుకున్న ఓ మనిషి కనిపిస్తాడు.

తర్వాత గురుదేవ్‌ రజనీని చూసి… ‘‘డిస్టర్బెన్స్‌ ఏమీ కాలేదు కదా?’’ అని అడిగారట. రజనీ నవ్వుతూ… తన తల చూపిస్తూ… ‘‘ఇక్కడ మాత్రం డిస్టర్బెన్స్‌ అయిపోయింది గురూజీ!’’ అన్నారట. అదే ఆయనకు వచ్చిన జ్ఞానోదయం. ‘‘అదే ఆధ్యాత్మికత శక్తి’’

రజనీకాంత్‌ చెప్పిన ఈ ఒక్క మాటలోనే ఈ మొత్తం కథ సారం ఉంది. ‘‘స్టార్‌డమ్‌ వస్తుంది… పోతుంది. కొంతకాలం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్టార్‌డమ్‌ అత్యున్నతమైనది. అది మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. పైగా కాలం గడిచేకొద్దీ అది ఇంకా పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు.

సినిమా సూపర్‌స్టార్‌కు… ఆధ్యాత్మిక గురువు ముందు తన స్టార్‌డమ్‌ ఎంత చిన్నదో అర్థమైంది. అందుకే తర్వాత రజనీకాంత్‌ చెప్పిన మాట మరింత గొప్పగా అనిపిస్తుంది. ‘‘జీవితంలో మంచి గురువు దొరకడం చాలా కష్టం. మనల్ని నేర్పించి, నడిపించే గురువు దొరకడం అంతకంటే కష్టం.’’

మనిషిగా పుట్టడం గొప్ప అదృష్టం.
ఆ తర్వాత ఆరోగ్యకరమైన శరీరం దొరకడం మరో అదృష్టం.
ప్రశాంతమైన మనసు దొరకడం ఇంకా అరుదు.
తనను తాను తెలుసుకోవాలనే కోరిక కలగడం మరింత అరుదు.
అలాంటి సమయంలో సరైన గురువు దొరకడం మహాభాగ్యం అని ఆయన చెప్పారు.

అందుకే… ‘‘శ్రీశ్రీ లాంటి గురువు దొరికినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన మాట వినడం… అదంతా నా అదృష్టం. గురువు అనుగ్రహం, దేవుడి అనుగ్రహం’’ అని రజనీకాంత్‌ అన్నారు.

ఇక్కడే ఈ ప్రసంగం అందంగా మారుతుంది. ఎందుకంటే ఇది రజనీకాంత్‌ అనే సూపర్‌స్టార్‌ తన గురించి చెప్పుకున్న కథ కాదు. తనకంటే గొప్పదైనదేదో గుర్తించిన ఓ మనిషి కథ. తన స్టార్‌డమ్ ఎంత అల్పమైందో అర్థం అయిన కథ…

ప్రపంచం తనను చూస్తుందని అనుకున్న వ్యక్తికి… ఒక్కసారి ప్రపంచమే తనను చూడని అనుభవం ఎదురైంది. ఆ అనుభవంలో అవమానం లేదు. అహంకారానికి ఔషధం ఉంది. సినిమా స్టార్‌డమ్‌ కోసం లక్షల మంది అరుస్తారు. కానీ ఒక నిజమైన గురువు ముందు…

నిశ్శబ్దమే మాట్లాడుతుంది. రజనీకాంత్‌ చెప్పిన మాటల్లో అందుకే ఇంత బలం ఉంది. ‘‘సూపర్‌స్టార్‌డమ్‌ వస్తుంది… పోతుంది. ఆధ్యాత్మికత మాత్రం మనిషిని మించిన ప్రయాణం.’’ ఇంతటి స్టార్‌ అయినా… ‘‘నాకు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది’’ అని చెప్పగలగడం — బహుశా అదే అసలైన స్టార్‌డమ్‌!

.

మబ్బుల్లో తిరిగి, మనకన్నా తోపులు ఎవడు అనే చిత్తభ్రమల్లో బతికే ప్రతి నటుడికీ, ఫ్యాన్స్ ఆరాధనతో తననే ఓ దేవుడిగా భావించే చిల్లర మనస్తత్వాలకు ఈ రజినీకాంత్ ప్రసంగం ఓ పాఠం..!! కాలగతిలో పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు, ఈ చిల్లర గ్రహాలు ఎంత!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!
  • రేవంత్ రెడ్డిని ‘అండర్ ఎస్టిమేట్’ చేశారు – అడ్డంగా బుక్కయ్యారు !!
  • వావ్ గుజ్జూస్- ఏదైనా మాయ చేయగలరు… 8542 వోట్లు- ఖర్చు 290 కోట్లు !!
  • హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!
  • మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…
  • Just డేటా సెంటర్ కాదు… తెలంగాణ భవిష్యత్తుకు ‘కంప్యూట్ పవర్’!
  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…
  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !
  • ఉండవల్లి అంటే ఉడుంపట్టు ! కానీ పోరాటమార్గాలు ఏం మిగిలాయి !?
  • అమెరికా ఆధిపత్యానికి అంతిమరోజులు – చైనా నోస్ట్రడామస్ జోస్యం

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions