.
Subramanyam Dogiparthi …….. 17 సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడ్డ బాలకృష్ణ మార్క్ రక్తాభిషేకం . 1988 నాటికే బాలకృష్ణతో అఖండ సినిమాలను కాస్త కాస్త ప్రారంభించారు . ఈ సినిమాలో క్లైమాక్స్ ఇంగ్లీషు సినిమాలలో లాగా కార్ ఛేజింగులు , ఖైదీ సినిమాలో లాగా దడదడలాడించే ఆటోమేటిక్ గన్లు , బాంబులు , బ్లేస్టులు ఉధృతంగా ఉంటాయి .
యండమూరి నవలలు చాలా వరకు క్లైమాక్సులన్నీ హాలీవుడ్ మోడల్లోనే ఉంటాయి కదా ! స్టార్డం ఉన్న బాలకృష్ణ . కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం . ఇంక చెప్పేదేముంది . కధ కన్నా మాటలు , పాటలు , హాట్ హాట్ డాన్సులు వగైరా కోదండరామిరెడ్డి లెవెల్లో ఉండాలి కదా ! ఉన్నాయి .
Ads
కధ మామూలే . హీరో గారు వీరోచితంగా ఉంటారు . హీరోయిన్ గారు పొగరుబోతు . ఆమె పొగరుబోతుతనంతో హర్టయిన హీరో గారు ఆమెకు బుధ్ధి చెప్పటం , ఆ క్రమంలో హీరో గారిని ప్రేమించేయడం జరిగిపోతాయి . బ్లాక్ టైగర్స్ అనే పేరుతో సంఘ విద్రోహ శక్తులు దేశంలో అశాంతిని సృష్టించడంతో పాటు హీరో గారి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు .
హీరో గారు హీరోయిన్ సహకారంతో ఒంటి చేతితో బ్లాక్ టైగర్సుని తుదముట్టించి అసలు నాయకుడిని పోలీసులకు పట్టివ్వడంతో సినిమా సుఖాంతం అవుతుంది . మొదటగా చెప్పుకోవలసింది బాలకృష్ణ గురించే . సినిమా అంతా ఆయనే . ఒంటి చేత్తో నడిపించారు .
తర్వాత రాధ . బాలకృష్ణతో నాలుగయిదు సినిమాలలోనే జోడీగా నటించిందనుకుంటాను . DIG గారి పొగరుబోతు కూతురుగా , తన తప్పు తెలుసుకుని హీరోని ప్రేమించి తోడుగా నిలబడే ప్రేయసిగా బాగా నటించింది . ముఖ్యంగా డ్యూయెట్లలో అదరగొట్టేసింది .
విలన్లుగా సత్యనారాయణ , రంగనాధ్ ; ఇతర ప్రధాన పాత్రల్లో శరత్ బాబు , సోమయాజులు , జగ్గయ్య , సుత్తి వేలు , సంగీత , పాపం పసివాడు బేబీ సుజిత , వంకాయల , సిహెచ్ కృష్ణమూర్తి , మమత , బ్రహ్మానందం , తదితరులు నటించారు .
ఇళయరాజా సంగీత దర్శకుడే కానీ ఆయన లెవెల్లో పాటలు హిట్ కాలేదనుకుంటా . బాలకృష్ణ అభిమానులకు బాగానే ఉంటాయి . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . అన్నీ డ్యూయెట్లే . హీరోహీరోయిన్లను పూర్తిగా వాడుకున్నారు .
బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర , మనో పాటల్ని పాడారు . సరిగంగ తానాలతో , చేయి చేయి , లవ్ అంటే లవ్వే లవ్వు , కాంచారే , గుంటూరు చిన్నవాడా అంటూ సాగుతాయి ఈ పాటలు . యండమూరి నవలకు జంధ్యాల డైలాగులను వ్రాసారు .
కాస్త మూస సినిమాలాగా అనిపిస్తుంది . తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలోకి రత్తాభిషేగం అనే టైటిలుతో విడుదలయింది . బాలకృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమాయే . యూట్యూబులో ఉంది . It’s an action-oriented , romantic , commercial entertainer .
నేను పరిచయం చేస్తున్న 1194 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
- ఇక్కడే మరికాస్త చెప్పుకోవాలి ఈ సినిమా గురించి … కొన్ని వరుస ఫ్లాపుల తరువాత ఈ సినిమా వచ్చింది… మూస, మాస్… ఊరమాస్… ఐతేనేం, హిట్ టాక్ తెచ్చుకుంది… కానీ వంగవీటి మోహన రంగా హత్య తరువాత ఈ రక్తాభిషేకం ప్రింట్లను థియేటర్లలో తగులబెట్టేశారు…
- ఎన్ని ప్రింట్లు మిగిలాయో తెలియదు…క్లైమాక్స్ ముందు బాలకృష్ణకి సంబంధించి రాధని తప్ప అందర్నీ లేపేశాడు దర్శకుడు కోదండరామడు… బాలకృష్ణ సహజ రౌద్ర విశ్వరూపం చూడాలంటే ఈ సినిమా క్లైమాక్స్ లోనే చూడాలి… సైగ చేస్తే ట్రెయిన్ వెనక్కి వెళ్లడాలు దగ్గర నుంచి మనిషిని తలకిందులుగా పట్టుకుని హారతులు ఇవ్వడాలు దాకా బాలయ్యను చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు…
- ఆ ధోరణికి బీజం పడింది బహుశా ఈ రక్తాభిషేకం సినిమా నుంచే కావచ్చు… హీరో ఎంత మందిని నరికితే అంత గ్రేట్ అప్పట్లో… అఫ్‌కోర్స్, ఇప్పుడింకా పెరిగి… థియేటర్లలో రక్తధారలే…నిజానికి యండమూరి, కోదండరామిరెడ్డి, రాధ, చిరంజీవి ఓ హిట్ కాంబో… ఇందులో చిరంజీవి బదులు బాలకృష్ణ… అంతే తేడా…!!
Share this Article