.
రాముడికంటే లక్ష్మణుడు రెండు ఇంచులు ఎత్తుగా ఉండకూడదా? లక్ష్మణుడి పాత్రకు ఎత్తు అడ్డొచ్చిందట..! రామాయణంలో అలా ఉందా? లేక దర్శకుడి లెక్కేనా..?
రామాయణం కథలో రాముడు– లక్ష్మణుడు అంటే అన్నదమ్ముల అనుబంధం. రాముడి వెంట నీడలా నడిచే లక్ష్మణుడు. వనవాసం నుంచి సీతాన్వేషణ వరకు అన్న అడుగులోనూ తమ్ముడి అడుగు ఉంటుంది. కానీ ఇప్పుడు తెర మీద ఆ లక్ష్మణుడి పాత్రకు ఒక విచిత్రమైన అడ్డంకి ఎదురైందట… రెండు ఇంచుల ఎత్తు!
Ads
అదేంటీ… లక్ష్మణుడు రాముడికంటే రెండు ఇంచులు ఎత్తుగా ఉంటే రామాయణం చెడిపోతుందా? ఈ ప్రశ్న రావడానికి కారణం నటుడు దేవ్ శర్మ చేసిన తాజా వ్యాఖ్యలు.

నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర కోసం తాను కూడా ఆడిషన్ ఇచ్చానని దేవ్ శర్మ చెప్పాడు. లుక్ టెస్టులు కూడా దాదాపు పూర్తయ్యాయని, కానీ చివరకు తనను ఎంపిక చేయలేదని వెల్లడించాడు. కారణం ఏమిటంటే… తాను రాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్ కంటే రెండు ఇంచులు ఎత్తుగా ఉన్నాడట!
అంతే కాదు. ‘ఆదిపురుష్’లోనూ లక్ష్మణుడి పాత్ర కోసం ప్రయత్నించాడట. అక్కడ కూడా చివరి దశ వరకు వెళ్లినా, తన శరీరాకృతి రాముడి పాత్రలో ఉన్న ప్రభాస్‌తో సరిపోలలేదట. అక్కడ తాను ప్రభాస్‌తో సమానంగా భారీగా కనిపించానని, అందుకే అవకాశం రాలేదని దేవ్ చెప్పాడు.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సినిమాలో అన్నదమ్ముల ఎత్తు కూడా ఒక పాత్రకు కాస్టింగ్ కండిషన్ అయిపోయిందా?
నిజానికి దర్శకుడికి విజువల్ కంపోజిషన్ విషయంలో తనదైన ఆలోచన ఉండొచ్చు. రాముడిగా ఒక నటుడిని ఫిక్స్ చేసిన తర్వాత, అతడి పక్కన నిలబడే లక్ష్మణుడు ఎలా కనిపించాలి? ఇద్దరి శరీరాకృతి ఎలా ఉండాలి? ఇద్దరి మధ్య అన్నదమ్ముల సంబంధం తెరపై ఎలా కనిపించాలి? ఇవన్నీ దర్శకుడు ఆలోచించడంలో తప్పు లేదు.
కానీ రామాయణంలో లక్ష్మణుడు రాముడికంటే పొట్టిగా ఉండాల్సిందేనా? అసలు రామాయణ కథలో కీలకమైనది రాముడు– లక్ష్మణుల ఎత్తు కాదు. వారి అనుబంధం. లక్ష్మణుడి విధేయత. అన్న కోసం అన్నింటినీ వదిలి అడవికి వెళ్లడం. రాముడి పట్ల అతని భక్తి. ఆగ్రహం వచ్చినప్పుడు కూడా రాముడి మాటకు కట్టుబడటం.
అలాంటి పాత్రకు రెండు ఇంచుల ఎత్తు తేడా అంత పెద్ద సమస్య కావడం మాత్రం సినిమా కాస్టింగ్ ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈరోజు లక్ష్మణుడి పాత్రకు సరిపోని ఎత్తు ఉన్నాడని తిరస్కరించిన అదే దేవ్ శర్మ… ఇప్పుడు రాముడి పాత్రలో నటిస్తున్నాడు! అవును, ‘మహాకావ్య శ్రీ రామాయణ కథ’లో దేవ్ శర్మే రాముడిగా కనిపించబోతున్నాడు. అంటే అప్పట్లో రాముడి పక్కన నిలబడటానికి తన ఎత్తు సరిపోలలేదని చెప్పబడిన నటుడే… ఇప్పుడు మరో సినిమాలో స్వయంగా రాముడిగా నిలబడుతున్నాడు.
ఇదే సినిమా ప్రపంచం. ఒక సినిమాలో “రాముడికంటే రెండు ఇంచులు ఎత్తు” అనేది రిజెక్షన్‌కు కారణం. మరో సినిమాలో అదే నటుడికి “రాముడు” పాత్ర!
అందుకే దేవ్ శర్మ చెప్పిన ఈ సంఘటనను కేవలం ఒక నటుడి రిజెక్షన్ కథగా చూడాల్సిన అవసరం లేదు. ఇది పౌరాణిక పాత్రలను తెరపైకి తీసుకొచ్చేటప్పుడు దర్శకులు ఎంతవరకు చారిత్రక/ సాంప్రదాయ ప్రతిరూపాన్ని అనుసరించాలి? ఎంతవరకు తమ సొంత విజువల్ ఇంటర్‌ప్రిటేషన్ చేసుకోవచ్చు? అనే పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది.
రాముడి పక్కన లక్ష్మణుడు రెండు ఇంచులు ఎత్తుగా ఉంటే ప్రేక్షకుడికి రాముడు చిన్నవాడిగా కనిపిస్తాడా? లేక… తక్కువ ఎత్తు ఏమైనా చిన్నతనమా..? రాముడి పాత్రను పోషించే నటుడి పక్కన ఎవరు నిలబడినా, అతడి పాత్ర రాముడిదే అని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించడమే దర్శకుడి అసలు పని కాదా?
ఏమో… దర్శకుడి ఆలోచన ఏమిటో మనకు తెలియదు. కానీ రెండు ఇంచుల ఎత్తు కారణంగా లక్ష్మణుడి అవకాశం పోయిందన్న కథ మాత్రం… రెండు ఇంచుల కంటే చాలా పెద్ద ప్రశ్ననే లేవనెత్తుతోంది!
Share this Article