.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన అమర్ అక్బర్ ఆంథొనీ సినిమాకు రీమేక్ 1980 లో వచ్చిన ఈ రాం రాబర్ట్ రహీం సినిమా .
హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రిషికపూర్ , పర్వీన్ బాబీ , షబానా ఆజ్మీ , నీతూసింగ్ , ప్రాణ్ , నిరూపరాయ్ , జీవన్ తదితరులు నటించారు . మన తెలుగు సినిమాలో కృష్ణ , రజనీకాంత్ , చంద్రమోహన్ , శ్రీదేవి , ఫటాఫట్ జయలక్ష్మి , సునీత , అంజలీదేవి , జగ్గయ్య , ప్రభృతులు నటించారు .
Ads
హిందీ సినిమా అంత సూపర్ హిట్ కాలేదు మన తెలుగు సినిమా . ఈ సినిమాలు చూస్తుంటే వద్దువద్దన్నా యాదోం కి బారాత్ , అన్నదమ్ముల అనుబంధం సినిమాలు గుర్తుకు వస్తుంటాయి . కధల్లో తేడా ఉంది .
అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఆఖరి తమ్ముడు పాత్రను కోల్పోయిన చంద్రమోహన్ ఈ సినిమాలో చిన్న తమ్ముడి పాత్రను వేసారు . విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు . ఆయన కూడా తన మార్కుని వదలలేదు . పాటలన్నీ థియేటర్లో బాగానే ఉన్నా బయట పెద్దగా హిట్ కాలేదు .
బయట కూడా బాగా హిట్టయిన పాట టైటిల్ పాట రాం రాబర్ట్ రహీం పాట . ఆ తర్వాత బాగా హిట్టయిన పాట సాయిబాబా ఓ సాయిబాబా షిరిడీ సాయిబాబా . ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ ముందుకు దూకారంటే , ఒక అమ్మాయి ఒక అబ్బాయి , లక లక లక లక , చిలకుంది చిలక ముసుగున్న పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి .
నటనపరంగా కృష్ణ చాలా చలాకీగా , హుషారుగా నటించారు . రజనీకాంత్ తన స్టైల్లో తాను నటించారు . ఆయన నటించారనే తమిళంలోకి డబ్ చేసి విడుదల చేసారు . చంద్రమోహనుకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . బాగా నటించారు .
ఇలాంటి వినోదాత్మక సినిమాల్లో నటులకు తమ ప్రతిభను చూపేందుకు కూడా పెద్దగా అవకాశం ఉండదు . రజనీకాంత్ సరసన నటించింది సునీత…
(ఈమె బెంగాలీ… కలకత్తా నేటివ్… పూణె ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో విజయనిర్మలతో పరిచయం… సత్యజిత్ రే తీసిన జనఅరణ్య తొలి సినిమా… ఏదో తమిళ సినిమాలో సౌత్‌లో చాన్స్ ఇప్పించిన విజయనిర్మల సంఘం చెక్కిన శిల్పాలు సినిమాతో తెలుగులో తనే పరిచయం చేసింది… సునీత అని పేరు పెట్టింది కూడా తనే… సౌత్ భాషలు ప్లస్ బెంగాల్‌లో దాదాపు 20 సినిమాల వరకూ చేసింది… తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు ఇక…)
విజయనిర్మలకు శ్రీదేవి మీద ఏమయినా కోపం ఉందేమో , శ్రీదేవిని కూడా ఈ సినిమాలో అందంగా చూపలేదు . ఇంత భారీ తారాగణం స్థాయిలో ఆడలేదు సినిమా . కేవలం కృష్ణ సరదా , చలాకీ నటన కోసం చూడాల్సిందే సినిమాను . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే కృష్ణ అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article