*ఆదిపురుష్ లో రాముడికే కాదు… ఈ కృష్ణుడికీ ‘మీసాలు’న్నాయ్…!! ఈ ” మీసాల ” కృష్ణుడు చిన్నోడేం కాదండోయ్…!! అసలు కృష్ణుడికి మీసం వుంటుందా? లేదా? కృష్ణుడి ‘మీసాల’ పై మీమాంస… ఇప్పటిదాకా మనం సినిమాల్లో చూసిన రాముడికి, కృష్ణుడికి మీసాల్లేవు కదా ! మరి ఈ” మీసాల రాముడు, కృష్ణుడు ” ఎక్కడినుంచి వచ్చారని మీకు అనుమానం రావచ్చు…
శుక్రవారం నుంచి ఆదిపురుష్ సినిమాలో మీసాల రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు… ఇంతవరకు వచ్చిన రామాయణ కథా చిత్రాల్లో రాముడికి మీసాల్లేవు.. దీన్ని తిరగరాస్తూ… రాముడికి కూడా మీసాలుంటాయని ప్రభాస్ నిరూపించబోతున్నాడు…
మీసాల కృష్ణుడు..!!
Ads
మీసాల కృష్ణుడు సినిమాల్లో లేకున్నా… చాలా కాలంనుంచే.. గుళ్ళలో కొలువై వున్నాడు.. ఆ కథా కమామీషు ఇప్పుడు తెలుసుకుందాం..!! మీసాల కృష్ణుడు 200 యేళ్ళకు పూర్వమే వున్నాడు. ఒకచోటకాదు. రెండు చోట్ల కాదండోయ్.! మొత్తం మూడుచోట్ల కొలువైవున్నాడు.పైగా దినమూ.. పూజలు కూడా అందుకుంటున్నాడు.. దేశం మొత్తం మీద తమిళనాడులో ఒకచోట, ఆంధ్రాలో ఒకచోట, తెలంగాణలో ఒకచోట ఈ మీసాల కృష్ణులు కనిపిస్తున్నారు.
అందరిలోకెల్లా తెలంగాణ మీసాల కృష్ణుడే పాపులర్. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, చెల్లాపూర్ లో ఈ మీసాల కృష్ణుడి ఆలయం ఉంది. (హైదరాబాద్ కు 128 కి.మీ మెదక్ కు 55 కిమీ దూరం) ఈ ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర కూడా వుంది. ఇక్కడ ‘అఖండ దీపం’ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.గ ర్భాలయంలో కొలువైన ఈ మీసాల శ్రీకృష్ణుడి విగ్రహాన్ని… దీపారాధన వెలుగులోనే దర్శించాలి. దీన్నే ‘నందా’ దీపం అని కూడా అంటారు. దీనివల్ల చెల్లాపూర్ గ్రామం. ఎప్పుడూ పాడిపంటలు, సిరులు, ధన ధాన్యాలతో విలసిల్లుతూ వుంటుందన్నది గ్రామస్తులు నమ్మకం. ప్రతీ ఏడాది వ్యవసాయం మొదలు పెట్టే ముందు స్వామి వారికి ముడుపు కడతారట. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు, వివాదాలు ఎదురైనా ఈ స్వామి గుడిమెట్లెక్కితే ఇట్టేపరిష్కారమవుతాయనేది గ్రామస్తుల గట్టి నమ్మకం.
ఆలయం కథ.. కమామీషు!!
ఈ ఆలయానికి సంబంధించి ఓ ఆసక్తి కరమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. 200 సంవత్సరాల క్రితం మాట. దుబ్బాకసంస్థానాన్ని పరిపాలించే దొరల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకుంటారు. నిలువునామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్నికట్టి , ఆ పేరుతో కప్పానికి ఎగనామం పెట్టాలని…. తీర్మానిస్తారు. అనుకున్నదే తడవుగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తారు.. కాశీ నుంచి విగ్రహం తెప్పించి, గుళ్ళో ప్రతిష్టించాలనుకుంటారు.
అయితే తగిన ఆర్థిక స్తోమత లేక రామ్ గోపాల్ పేటలో ఓ కృష్ణ విగ్రహం వుందని తెలిసి, అక్కడ్నుంచి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించారు.. విషయం తెలుసుకున్న రామ్ గోపాల్ పేట గ్రామస్తులు విగ్రహం కోసం గాలించడం మొదలుపెట్టారు.. వాళ్ళకళ్ళు కప్పటానికి , ఈ విగ్రహాన్ని కొంత కాలం చెరువులో దాచి వుంచి, ఆ తర్వాత బయటకు తీసి, ఎవరూ గుర్తుపట్టకుండా వుండేందుకు..విగ్రహంపైన వున్న కొప్పును తొలిగించి, కిరీటం పెట్టారు.. తర్వాత విగ్రహానికి అదనంగా వెండి ‘ మీసాలను’ తొడిగారు.. దీంతో కృష్ణుడి రూపురేఖలు మారిపోయి, చివరకు మీసాల కృష్ణుడు వెలిశాడు. ఇదీ… ఆ ప్రాంతంలో ప్రచారంలో వున్న కథ.
కాగా…. దేవరపల్లె గ్రామంలో వున్న ‘ శ్రీ వల్లభ రాయ స్వామి’ ని ‘మీసాల వల్లభుడు’ అంటారని అళహరి శ్రీనివాసాచార్యులు ‘తమ” శ్రీ వల్లభ రాయ వైభవం, అష్టాదశ వల్లభ క్షేత్రాలు”అనే పుస్తకంలో(పే.72) లో రాశారు.
తమిళనాడు ‘ మీసాల కృష్ణుడు.. ‘పార్థసారథి’!!
చెన్నై ట్రిప్లికేన్‌లో వుందీ” మీసాల పార్థసారథి “ఆలయం. చేతిలో శంఖం, మరో చేత్తో గీత బోధిస్తున్నట్లుగా కనిపించే స్వామి ‘ పార్థసారథి ‘… ఈ మూలవిరాట్టుకు మీసాలు ఉంటాయి. కాబట్టి స్వామిని ‘ మీసాల కృష్ణుడని ‘ పిలుస్తుంటారు. కొందరు ‘వేంకటకృష్ణస్వామి’ గానూ కొలుస్తారు. ఇక్కడ స్వామి వారు రుక్మిణి, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్న, అనిరుద్ధ సమేతంగా దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని ‘దక్షిణ బృందావనం’గా పిలుస్తారు. సప్తరుషులు… ఇక్కడ పూజ చేశారనీ చెబుతారు. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం దాదాపు అయిదు వేల ఏళ్ల నాటిదని చెప్పడానికి ఓ కథ…. ప్రాచుర్యంలో వుంది.
స్థలపురాణం ప్రకారం… సుమతి అనే మహారాజు వేంకటేశ్వరస్వామి అనుగ్రహాన్ని కోరుతూ తనకు భగవద్గీత చెబుతున్నట్లుగా…. దర్శనం ఇవ్వమంటూ తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి అతడికి కలలో కనిపించి ‘బృందారణ్యకు వెళ్తే కోరిక నెరవేరుతుంద’ని చెప్పాడట. అదే సమయంలో ఆత్రేయ మహర్షి కూడా తపస్సు చేయడానికి ఓ స్థలం చూపించమంటూ, వేదవ్యాసుడ్ని అడిగాడట. వేదవ్యాసుడు కూడా అతడిని బృందారణ్యకు వెళ్లమని చెబుతూనే కుడిచేతిలో… శంఖం, ఎడమచేయి జ్ఞానముద్రలో ఉన్న స్వామి విగ్రహాన్ని ఇచ్చాడట…!
ఆత్రేయ మహర్షి స్వామి విగ్రహంతో ఆ ప్రాంతాన్ని చేరుకున్నాక… మహారాజు కూడా అక్కడికి వచ్చి స్వామి రూపాన్ని దర్శించుకుని ఆనందించాడట. ఆ తరువాత ఆత్రేయ మహర్షి అక్కడే స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, తరువాత పల్లవరాజులు ఆలయాన్ని కట్టించడం జరిగిందట. ఆ తరువాత చోళులూ, విజయనగర రాజులూ ఈ ఆలయాన్నిఅభివృద్ధి చేశారని చెబుతారు. ఇక్కడ స్వామి విగ్రహం ముఖంపైన అక్కడక్కడా గాట్లు ఉంటాయని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో భీష్ముడు సంధించిన అస్త్రాలు శ్రీకృష్ణుడికి తగలడం వల్లే ముఖంపైన గాట్లు పడ్డాయని చెబుతుంటారు.
శంఖంతో దర్శనమిచ్చే మీసాల కృష్ణుడు!
శ్రీకృష్ణుడిని రుక్మిణీ సమేతంగా.. అదీ మీసాలతో దర్శించుకోవాలంటే చెన్నైలోని పార్థసారథి ఆలయానికి వెళ్లాల్సిందే. మీసాల కృష్ణుడిగా పిలిచే. ఈ…స్వామిని ఆత్రేయ మహర్షి ప్రతిష్ఠించారని అంటారు. సుమారు అయిదువేల యేళ్ళక్రితం నాటి ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ ఆలయంలో ఉన్న ‘ పుష్కరిణి’ ని కలువపూల కొలను అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం ఇక్కడున్న పుష్కరిణిలోనే లక్ష్మీదేవి భృగు మహర్షికి వేదవల్లిగా పుట్టిందట.
భృగుమహర్షి తనకు స్వామే అల్లుడిగా రావాలని కోరుతూ తపస్సు చేస్తే. ఇక్కడి పుష్కరిణిలోని ఓ తామర పువ్వు మధ్యలో పడుకున్న పాపాయి కనిపించిందట. దాంతో మహర్షి పాపను తీసుకెళ్లి…. ‘వేదవల్లి’అని పేరు పెట్టి, పెంచి, పెద్దచేశాడట. ఆ తరువాత ఆమె రంగనాథస్వామిని వివాహం చేసుకుందట. లక్ష్మీదేవి ఈ కొలనులో.. పుట్టింది కాబట్టి దీన్ని’ కైరవిని’అని పిలుస్తారు. ఈ పుష్కరిణిలోని నీటికి ఔషధ గుణాలన్నాయనీ చెబుతారు. ఒకప్పుడు తిరుపతి నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని అంటారు.
ఈ ఆలయంలో స్వామికి ఏడాది పొడవునా పూజలు నిర్వహించడం ఒక ఎత్తయితే , బ్రహ్మోత్సవాల్లో విగ్రహాలను ఊరేగించడం మరొకెత్తు. ఇక్కడ స్వామికి వండే నైవేద్యాల్లో నెయ్యి ఎక్కువగా వాడతారు. అలాగే వేరుసెనగపప్పు, నూనె, ఎండు మిర్చి వాడకాన్ని’నిషేధం’గా భావిస్తారు. స్వామి ముఖంపైన ఉన్న గాయాలు మానడానికే అలాంటి వాటిని నిషేధించారని అంటారు. ఈ ఆలయంలో పార్థసారథితోపాటు,.. సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా శ్రీరాముడినీ , యోగ నరసింహుడినీ దర్శించుకోవచ్చు. ఆలయంలో మొదటి పూజను నరసింహస్వామికే నిర్వహించడం విశేషం.
నరసింహస్వామి గోపురం ముందు గంట ఉన్నా, దాన్నుంచి శబ్దం రాదు. ఇక్కడ స్వామికి ఉప్పు, మిరియాలు సమర్పిస్తే.. సమస్యలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం.
ఈ గుడికి ఎలా వెళ్ళాలి…?
చెన్నై ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి ఆలయానికి విమానమార్గం ద్వారా చేరుకోవాలంటే…. మీనంబాకం విమానాశ్రయంలో దిగి… అక్కడి నుంచి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి క్యాబ్‌లు లేదా బస్సుల ద్వారా చేరుకోవచ్చు. అదే రైల్లో వెళ్లాలనుకుంటే చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి- ఆటోలో వెళ్లొచ్చు.
పులిదిండి గ్రామంలో మీసాల కృష్ణుడు…!!
ఆంధ్రలో గోదావరి తీరంలో వున్న పులిదిండి గ్రామంలో మీసాల కృష్ణుడి ఆలయం వుంది.. ఈ ఆలయాన్ని దర్శించుకున్నవారి కోరికలు నెరవేరుతాయన్నది స్థానికుల నమ్మకం. బాపు గారి తొలి సినిమా సాక్షి చిత్రం షూటింగ్ అవుట్ డోరు మొత్తం ‘పులిదిండి” ’గ్రామంలోనే జరిగింది. సినిమా షూటింగ్ జరుగుతుండగా…. అక్కడ ఉన్న ‘మీసాల కృష్ణుడు’ గుడిలో కృష్ణ, విజయ నిర్మల మెడలో తాళికట్టే సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకులు బాపు.
అక్కడే వున్న హాస్యనటుడు రాజబాబు ఈ షాట్ చూసి విజయనిర్మలతో ‘‘మీసాల కృష్ణయ్య చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన సమక్షంలో ఏది అనుకున్నా అది జరిగి తీరుతుంది. మరి మీరు కూడా దంపతులవుతారేమో ’’ అని జోక్ గా అన్నారట. కొంత కాలానికి (1967 మార్చి 24న) ఆ జోక్ నిజమై తిరుపతిలో వివాహమైంది.
చిత్రలేఖనంలో… ‘ మీసాల ‘ కృష్ణుడు..!!
కేవలం గుళ్ళలోనే కాదండోయ్…! చిత్రలేఖనంలో కూడా… మీసాల కృష్ణుడు కనిపిస్తాడు. మార్చాల రామాచార్యులు గారు దీని చిత్రకర్త. అయితే…పెద్దలు సురవరం ప్రతాపరెడ్డి గారు సంకల్ప’ కర్త.! కృష్ణుడు సామాన్యుడు కాదు…. వెన్న దొంగే కదా! అని తీసిపారేయకండి… కృష్ణుడు…. శత్రువుల వెన్ను విరిచే వీరాధి వీరుడు.!! గోపాలుడే కదా ! అని తక్కువ చేసి చూడకండి.. కృష్ణుడు…. చాణూర మర్దనుడు అన్ని విషయం మరువకండి.!
నల్లవాడను కుంటున్నారేమో…? కృష్ణుడు మన్మధుడ్ని తలదన్నే అందగాడు.. గోపికా మానస చోరుడు సుమండీ! కాళిందికే చెమటలు పట్టించాడు… పూతన ప్రాణాలు తీశాడు… కంస మామకు చుక్కలు చూపించాడు. మహా మహా రాక్షసులనే మట్టి కరిపించాడు. శిశుపాలుడి శిరస్సు ఖండించాడు. వికారి కుబ్జను అందగత్తెను చేశాడు. లోకానికి ‘గీతాసారం’ అందించాడు. పొన్న చెట్టు నీడన పిల్లను గ్రోవిని మోగించాడు… శృంగార మర్మాలను ఎరిగిన రసకేళీ విలాసుడు సుధాముడికి స్నేహ ధర్మం చెప్పాడు. సారధియై అర్జునుడిని విజయుడ్ని చేశాడు. ‘మీసాలు’ వీరత్వాన్ని కి, మగటిమికి చిహ్నాలు కదా! మరి ఇలాంటి వీరాధి వీరుడు కృష్ణుడికి… వీరత్వం సూచించే….మీసాలు లేకపోవడమేంటి? చోద్యం కాకపోతేనూ..? అనుకున్నారు…
అనుకున్నదే తడవుగా…. శ్రీకృష్ణుడి వీరత్వం ఆధారంగా “హైందవ ధర్మ వీరులు ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. అంతటితో ఊరుకోకుండా, గోలకొండ పత్రికలో కృష్ణుడి మీసాల గురించి ఓ వ్యాసం రాశారు… కృష్ణుడి మీసాల గురించి చర్చకు తెరతీశారు. పండితులతో చర్చించారు… అబ్బే…! బాగుండదేమో నండీ! అంటూ పండితులు పెదవి విరిచారు. ప్రతాపరెడ్డి గారు ఊరుకోలేదు… ఆయనలో పట్టుదల పెరిగింది… 1939, డిసెంబర్ 23న ఓ చిత్రకారుడి ద్వారా… మీసాల కృష్ణుడి చిత్రాన్ని గీయించి… లోకం ముందుకు తీసుకొచ్చారు…
చూసిన వాళ్ళు విస్తుపోయారు…. కొందరు .. కృష్ణ.. కృష్ణా అంటూ లోలోపలే గొణుక్కున్నారు.. ‘ఈ పెద్దాయనకు ఇదేం తిక్కమ్మా’ అంటూ… మరికొందరు విమర్శించారు…. అప్పట్లో మద్రాసులో వున్న ఆంధ్రపత్రిక ముద్రణాలయంలో చిత్రాన్ని ముద్రింపజేశారు సురవరం. అంతేకాదు, మీసాల కృష్ణుడి చిత్రపటాన్ని తన సన్నిహితులందరికీ పంచి పెట్టారు కూడా. మీసాల కృష్ణుడి చిత్రపటాన్ని అందంగా ప్రేమ్ కట్టించి హైదరాబాద్, ట్రూప్ బజారులో వున్న.. గోలకొండ పత్రికా కార్యాలయంలో తనకు కనిపించేటట్లు గోడకు తగిలించారు . మీసాల కృష్ణుడంటే… సురవరం వారికి పిచ్చిఅభిమానం… అలా… సురవరం గారి అండదండలతో తెలుగు తెరపై మీసాల కృష్ణుడు ఆవిష్కృతమమయ్యాడు..!!
మీసాల కృష్ణుడి చిత్రంపై వివాదం…..!!
‘మీసాల కృష్ణుడి’ చిత్రరచన చేసిన చిత్రకారుడిపై కూడా వివాదం వుంది. ఈ చిత్రాన్ని అడివి శ్రీ పేరుతో ప్రఖ్యాత రచయిత, కవిచిత్రకారులు అడివి బాపిరాజు గారే వేశారని …!! ఆంధ్రజ్యోతి, దినపత్రిక (జూన్ 5,2005) ఆదివారం అనుబంధంలో ‘ సమ్ థింగ్ ‘ స్పెషల్ పేరుతో ‘గోపి కృష్ణ’ సేకరణ…పేరుతో ఎస్.కృష్ణారెడ్డి ఆర్టికల్ అచ్చయింది.. (కృష్ణారెడ్డి…. ‘ సురవరం’వీరాభిమాని. ఆయన తిరుపతిలో వుంటారు. సురవరం జీవిత చరిత్ర రాశారు. సురవరం లేఖలను భద్రపరిచిన పరిశోథకుడాయన)
అయితే… మీసాల కృష్ణుడు బొమ్మవేసింది బాపిరాజుగారు కాదని… ‘మార్చాల రామాచార్యులు’ గారని జి.యాదగిరి గారు (పాలమూరు పత్రిక)” ‘తెలంగాణ తొలితరం చిత్రకారులు మార్చాల రామాచార్యులు”అనే తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ఆధారాలను కూడా చూపారు. బొమ్మపై రామాచార్యులు సంతకాన్ని చూపి ఇది వారి చిత్రమేనని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని యాదగిరి సోదాహరణంగా నిరూపించారు.
ఆచార్య జయధీర్ తిరుమలరావుగారు కూడా యాదగిరిగారి అభిప్రాయాన్నే బలపరిచారు… (తొవ్వ ముచ్చట్లు.… ఆంధ్రభూమి దిన పత్రిక)… క్షత్రియ యోధునిగా శ్రీకృష్ణుని మీసాలతో రామాచార్య ఒక చిత్రం చిత్రించారని డాక్టర్ శ్రీ రంగాచార్య 1933లో మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వంలో పేర్కొన్నారు. బాపిరాజు గారు మీసాల కృష్ణుడి బొమ్మ వేయనే లేదని ఆచార్య మన్నవ సత్యనారాయణ ఖరాఖండిగా చెప్పారు. మన్నవగారు.. బాపిరాజు నవలలపై విస్తృత పరిశోథన చేసి,.. డాక్టరేట్ డిగ్రీ పొందారు.
బాపిరాజు గారు వేసిన చిత్రాల వివరాల్ని, వాటి జాబితాను ఆయన తన థీసిస్ లో పొందుపరిచారు. అందులో మీసాల కృష్ణుడు లేడు. మన్నవ గుంటూరులో బాపిరాజు చిత్రప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి వున్నారు. ప్రస్తుతం దుగ్గిరాలలో వున్నమన్నవ గారిని ఈ విషయమై అడిగినపుడు…. “బాపిరాజు గారు మీసాల కృష్ణుడు బొమ్మను వేశారనడం శుద్ధ అబద్ధమని ” తేల్చేశారు.. కాబట్టి ఇక ఈ విషయంలో వివాదానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టొచ్చు…
ఎవరీ రామాచార్యులు…!!
తెలంగాణ, కల్వకుర్తి తాలూక మార్చాల గ్రామస్తులు.. కవి, చిత్రకారులు… సురవరం గారికి సన్నిహితులు. ఈయన చిత్రాలు, పద్యాలు గోలకొండ పత్రికలో అచ్చేయించారు సురవరం. 1924 ప్రాంతంలో హైదరాబాద్నుంచి వెలువడిన ‘ సుజాత’ అనే పత్రికలో కూడా…. ఈయన ఎన్నో బొమ్మలు వేశారు. ఈయన బందరు నేషనల్ ఆర్ట్స్ కళాశాలలో అడవి బాపిరాజు, గుర్రం మల్లయ్య వంటి చిత్రకారుల సహాధ్యాయి… శాంతినికేతన్ లో సాధికారికంగా చిత్రకళను అభ్యసించారు. ఈయన సృజనశీలి కూడా.. సొంతంగా ఓ కెమెరాను తయారు చేసుకొని, పాలమూరులో ఓ స్టుడియోను కూడా నడిపారు. సొంతంగా మగ్గం తయారు చేసుకొని, తన వస్త్రాలను తానే నేసుకునేవారట. ఉపాధి కోసం తివాచీలు కూడా అల్లారట. దివిటిపల్లి ఆలయం గోడలపై బొమ్మలు చిత్రించాడు. 1974 లో తన 75వ యేట మరణించారు… —- ఎ.రజాహుస్సేన్..!!
.
(అయినా హీరోల ఇమేజ్ ముఖ్యం గానీ చరిత్ర పురుషుల వేషం, కేరక్టర్ మనకేల… మీసాల అన్నమయ్యలు, మీసాల రాఘవేంద్రులు లేరా మనకు… RRR వక్ర చరిత్ర ఎలాగూ చూసిందే…… ముచ్చట)
Share this Article