రాముడు, కృష్ణుడు నల్లని వారు, నీల మేఘ శ్యాముడన్న (నీల అంటే సంస్కృతంలో నలుపు) పేరిట పిలుస్తారు కదా. మన సినిమాల్లో మాత్రం రాముడు, కృష్ణుడి వేషధారులకు ఎందుకు నీలం రంగుతో మేకప్ చేస్తారు? నీలమేఘము అంటే నీటితో నిండి ఉన్న మేఘము అని అర్థం. నీళ్ళతో నిండిన మేఘం నల్లగా ఉంటుంది… ఈ ప్రశ్న, ఈ సందేహం చాలామందిలో ఉన్నదే… ప్రవచనకారులు కూడా ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెబుతారు…
మన సౌత్ ఇండియన్ సినిమాల్లో రాముడు, కృష్ణుడి పాత్రధారులకు దట్టంగా నీలం రంగు పులుముతారు… ఆమధ్య బాలకృష్ణ రాముడిగా నటించిన బాపు సినిమా శ్రీరామరాజ్యంలో రాముడికి పూసిన రంగు మరీ నేత్ర భీకరంగా ఉంది… ఫోటోలు, బ్యానర్లు, విగ్రహాల్లో కూడా రాముడిని, కృష్ణుడిని నీలం పురుషులుగానే చూపిస్తారు మనవాళ్లు…
ఈ సోదంతా దేనికి అంటే… 500 పైచిలుకు కోట్లతో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాష్ రాముడిగా ఆదిపురుష్ అని ఓ సినిమా నిర్మితమవుతోంది కదా… ఇంతకుముందు ట్రయిలర్ విడుదల చేస్తే, అందులోని యానిమేషన్లను చూసి, ప్రత్యేకించి రావణుడి వేషం చూసి నెటిజనం ముక్కచీవాట్లు పెట్టారు… పైగా సీతమ్మ కిడ్నాప్ కూడా సమర్థనీయమే అన్నట్టుగా కథ ఉందని తెలిసి కొందరు సోషల్ మీడియాలో దర్శకుడిని బూతులు తిట్టేశారు… ఆ దెబ్బకు గ్రాఫిక్స్ మార్చే పని చేపట్టి, మరో 100 కోట్లకు టెండర్ పెట్టాడు దర్శకుడు… చూడబోతే ఇదో స్కాంలా ఉంది…
Ads
ఆ సినిమా ప్రభాస్ ఇమేజీకి తీవ్రంగా నష్టం తీసుకొచ్చేలాగే ఉంది… తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు… ప్రభాస్ సహా సినిమా ముఖ్యులంతా దాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నారు… సదరు పోస్టర్ ఇదుగో…
ఈ పోస్టర్ కూడా నెటిజనానికి ఏమాత్రం నచ్చలేదు… అసంతృప్తి వ్యక్తమవుతోంది… సినిమాను వాయిదా వేసి, మరో 100- 150 కోట్ల దాకా ఖర్చు పెట్టించిన రీ- గ్రాఫిక్స్ వర్క్ కూడా ఫలించలేదని అర్థమవుతోంది… ప్రభాస్ తనకు తెలియకుండానే ఈ ప్రాజెక్టులో కూరుకుపోయినట్టున్నాడు… కనీసం సినిమా ఎలా తీస్తున్నారో, ఔట్‌పుట్ ఎలా వస్తున్నదో కూడా వెనక్కి తిరిగి చూసుకునే సోయి లేకపోతే ఎలా ప్రభాసూ..?
రాముడికి, కృష్ణుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వంటి అస్త్ర నిరోధ కవచాలు తొడిగారు… అవి తోలు కవచాలా..? లేక వస్త్రధారణే అలా ఉందని దర్శకుడి భావనా..? పైగా ఇద్దరికీ తోలు బెల్టులు…
రాముడికి మబ్బురంగు ఉండాలి… అంటే మేఘవర్ణం… కానీ ఈ పోస్టర్‌లో రాముడు సీతకు దీటుగా ఫెయిర్ కలర్‌లో ఉన్నాడు… అంటే ఈ నిర్మాతదర్శకులు రాముడిని ఎలా చూపించినా అంగీకరించాలా..? మన సౌత్ దట్టమైన బ్లూకలర్ పూయాల్సిన అవసరం లేదు, కానీ రాముడు ఫెయిర్ కలర్ కాదనే సోయి లేనట్టుంది దర్శకుడికి… సో, ఓం రౌత్ మారలేదు, సినిమా తీరు మారలేదు… ఏదో మార్చేశాం అని చెప్పి, పాత ఔట్ పుటే మన మొహాన కొడుతున్నాడు దర్శకుడు అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది…
హనుమంతుడికి మీసాలుండవు, గడ్డం ఉంటుంది… రాముడికి క్లీన్ షేవ్, లక్ష్మణుడికి ప్రజెంట్ ట్రెండ్ గడ్డం… ఏమాటకామాట సీత లుక్ సింపుల్‌గా బాగున్నట్టుంది… కానీ పుస్తెలు లేవు, గాజులు లేవు, మెట్టెలు లేవు… చీర కొంగు కాదు, ఏదో శాలువా తలపై కప్పారు…
సాధారణంగా సీతారామలక్ష్మణులు, కూర్చున్న హనుమంతుడి పోస్టర్లు కోట్లల్లో ఉంటాయి… కానీ అవి రాముడి పట్టాభిషేకం తరువాత దృశ్యాలు… కానీ ఆదిపురుష్ రిలీజ్ చేసిన పోస్టర్ వనవాసం నాటిది… వనవాస సమయంలో ఇలాంటి దృశ్యం నిజానికి ఉండదు… హనుమంతుడు రాముడిని కలిసే సమయానికి సీత రాముడితో ఉండదు… తరువాత ముగ్గురూ కలిసి కనిపించే సందర్భం వనవాసం వేళ ఉండదు… యుద్ధం ముగిసిన అనంతరం పుష్పకవిమానంలో అందరూ అయోధ్యకు వస్తారు, అప్పుడిక ఈ వనవాస దుస్తులే ఉండవు… హేమిటో మరి… ఓం రౌత్ వీలైనంతగా ఈ ప్రభాస రామాయణాన్ని చెడగొడుతున్నట్టున్నాడు…!!
Share this Article