రావణ దహనానికి వ్యతిరేకంగా శ్రీరామదహనం – ద్రవిడ అస్తిత్వవాద ప్రకటన… విజయదశమి సందర్భంగా చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. ఎందుకు? రామాయణం ప్రకారం విజయదశమి నాడే రాముడు రావణుడ్ని వధించాడని నమ్ముతారు కాబట్టి. ఆ నమ్మకం ఏళ్లకేళ్లుగా సాగుతూ రావణదహనం నిరాటంకంగా సాగుతోంది. మనదేశంలో ఒకప్పుడు రామదహనం కూడా చేపట్టారని తెలుసా? రామ్‌లీలకు వ్యతిరేకంగా ‘రావణలీల’ జరిగిన కాలం ఒకటి ఉండింది. ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే.
ప్రముఖ ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ వ్యవస్థాపకుడు, ద్రవిడ అస్తిత్వ ఉద్యమ పితామహుడిగా పేరొందిన పెరియార్ ఇ.వి.రామస్వామి గారికి ఈ రావణదహనం అన్యాయంగా తోచింది. ద్రవిడ అస్తిత్వాన్ని తగ్గిస్తూ, ద్రవిడవాసుల్ని రాక్షసులుగా మార్చేసిన ఈ సంస్కృతి పట్ల ఆయనకు బలమైన నిరసన ఉంది. ‘రామ్‌లీలా’ పేరిట ఏటా ఉత్తరాదిన ఘనంగా నిర్వహించే రావణ దహనానికి విరుద్ధంగా ‘రావణలీల’ కార్యక్రమం నిర్వహించాలని, అందులో రాముడి బొమ్మను దహనం చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని 1973లో ఆయన తన వ్యక్తిగత నోట్స్‌లో రాసుకున్నారు. అయితే అదే ఏడాది ఆయన మరణించడంతో ఆ ఏడాది ఆ కార్యక్రమం జరగలేదు.
మనుషులు కనుమరుగైనంత మాత్రాన వారి ఆలోచనలు ఒక్కచోట ఆగిపోవు! మరెవరో వాటిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నమే పెరియార్ గారి రెండో భార్య మణియమ్మ చేశారు. ‘పెరియార్-మణియమ్మ’ అనగానే కూతుర్ని పెళ్లి చేసుకున్న పెరియార్ అనే దిక్కుమాలిన, అర్థం లేని ఆరోపణలు మొదలుపెడతారని తెలుసు!
Ads
మణియమ్మ అనాథ కాదు. ఆమె అసలు పేరు కాంతిమతి. కనకసబై ముదళియార్ కూతురు. ఆయన జస్టిస్ పార్టీ నాయకుడు. మణియమ్మకి 20 ఏళ్లు వచ్చేదాకా బతికే ఉన్నాడు. మణియమ్మని ఆయన ఎవరికీ దత్తత ఇవ్వలేదు. పెరియార్ మొదటి భార్య 1933లో మరణించారు. ఆ తర్వాత కొంతకాలానికి మణియమ్మ ఆయన సహాయకురాలిగా మారారు. తన ఆశయాలకు, తన పార్టీకి వారసురాలిగా (బహుశా తన కుమార్తె హోదాలో) మణియమ్మని ప్రకటించాలని పెరియార్ భావించారు. కానీ పరాయి వ్యక్తి, అందులోనూ స్త్రీ అయిన ఆమెకు ఆ హక్కు పరిపూర్ణంగా వచ్చే అవకాశం లేదని భావించారు. భార్యగా చేసుకుంటే ఆమెకు పూర్తి హక్కులు వస్తాయని తెలుసుకుని 1948లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. దానికి మణియమ్మ పూర్తి అంగీకారం తెలిపారు. తనపై ఎలాంటి బలవంతం లేదని సభాముఖంగా వివరించారు. అయితే వారి మధ్య ఉన్న వయసు తేడా కారణంగా ఆ పెళ్లి అన్నాదురైకి నచ్చక ఆయనతో విడిపోయి ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) పార్టీ పెట్టారు. ఇదంతా ఆ తర్వాతి కథ. ఈ చరిత్ర తెలియనివారు బోలెడన్ని విమర్శలు చేస్తారు. ఆలోచన ఉన్నవారు ఆలోచిస్తారు.
పెరియార్ మరణాంతరం ద్రవిడ కళగం (DMK కాదు) పార్టీకి మణియమ్మ అధ్యక్షురాలిగా మారారు. 1974లో దసరాకు కొన్ని రోజుల ముందు మణియమ్మ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె.వీరమణి కలిసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు. రామ్‌లీలా పేరిట జరిగే రావణ దహన కార్యక్రమానికి స్వస్తి పలకాలని కోరారు. ఆ లేఖలో వారు రాసిన మాటలు చూడండి.
“రామ్‌లీలా పేరిట ద్రవిడ నాయకుడైన రావణాసురుడి బొమ్మను కాల్చివేయడం లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధం. దిల్లీలో జరిగే ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్రావిడులను రెచ్చగొట్టడమే కాకుండా వారి మనోభావాలను పూర్తిగా దెబ్బతీయడమే అవుతుంది. ద్రవిడ జాతిని తీవ్రంగా అవమానించే ఈ దారుణమైన చర్యకు ముగింపు పలకండి. లేకపోతే తమిళనాడువ్యాప్తంగా రాముడి బొమ్మలతోపాటు మీ బొమ్మలనూ దహనం చేస్తాం” అని పేర్కొన్నారు. (ఈ లేఖ ప్రధానికి చేరే సమయంలో టెలిగ్రాఫ్ శాఖావారు ‘మీ (ప్రధాని) బొమ్మలనూ’ అనే పదం తీసేశారని ఆ తర్వాత రోజుల్లో కె.వీరమణి చెప్పారు).
వారు రాసిన లేఖకు ఇందిరాగాంధీ ప్రత్యుత్తరం రాశారు. “ప్రపంచంలోని ఉత్తమ గ్రంథాల్లో రామాయణం ఒకటి. మనదేశంలో ఎంతోమందికి రాముడి పేరు పెట్టారు. మీ పార్టీ వ్యవస్థాపకుడికీ (ఇ.వి.రామస్వామి) అదే పేరు ఉంది. ఉత్తరాదిన నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎటువంటి జాతి వివక్ష లేదు. రామాయణంలో ఆనాడు ప్రస్తావించిన చారిత్రక ప్రాంతాలను పలువురు ఆధునిక విద్యావేత్తలు గుర్తించి, నిర్ధారించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రామ్‌లీలా వేడుకలు రాజకీయరంగు పులుముకోవడం దురదృష్టకరం. ప్రజల శక్తి, తెలివితేటలను సామాజిక అంతరాలు, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఉపయోగించాలని కానీ, మతాల మధ్య గొడవలు రేపేందుకు కాదు. దయచేసి మీరు చేస్తానన్న పనిని (రాముడి బొమ్మలు దహనం చేయడం) మానుకోమని కోరుతున్నాను” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ తర్వాత దిల్లీలో రామ్‌లీలా మైదానంలో జరిగిన రావణ దహనానికి ఇందిరాగాంధీ హాజరయ్యారు. దీంతో తాము అన్నట్టుగానే ‘రావణలీల’ పేరిట రాముడి బొమ్మలు దహనం చేయాలని ద్రవిడ కళగం పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించారు. డిసెంబర్ 24 పెరియార్ వర్ధంతి కాగా, ఆ తర్వాత రోజు డిసెంబర్ 25వ తేదీ చెన్నైలోని పెరియార్ తిడల్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. ముందే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి రాముడు, సీత, లక్ష్మణుడి చిన్నబొమ్మలు తీసుకెళ్ళిపోగా, ఆ తర్వాత పెద్ద బొమ్మలు తెచ్చి దహనం చేశారు. రాముడి బొమ్మ 18 అడుగులు, లక్ష్మణుడి బొమ్మ 17 అడుగులు, సీత బొమ్మ 16 అడుగులు ఉన్నట్టు ఆనాడు ఆ కార్యక్రమాన్ని చూసిన కొందరు ఇటీవల వెల్లడించారు.
రామదహనం తర్వాత మణియమ్మతోపాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్లు కోర్టులో కేసు నడిచింది. 1976లో సెషన్స్ కోర్టు అందర్నీ నిర్దోషులుగా విడుదల చేసింది. వారు చట్టబద్ధమైన పార్టీలో ఉన్నారని, వారు చేసిన పని ఏ మతాన్నీ కించపరిచేందుకు కాదని, వారు చేపట్టిన కార్యక్రమం వల్ల ఎవరికీ ఏ హానీ జరగలేదని కోర్టు వివరించింది.
1978లో మణియమ్మ మరణించారు. ఆ తర్వాత కొంతకాలం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపైన ‘రావణలీల’ అరుదుగా మారింది. దిల్లీలో జరిగే ‘రావణ దహనం’ ఆపేయమని 2016లో ద్రవిడ కళగం పార్టీ నాయకులు ప్రధాని మోదీని కోరారు. కానీ అక్కడి నుంచి ఏ సమాధానమూ రాలేదు. దీంతో చెన్నైలో ‘రావణలీల’ కార్యక్రమం ఏర్పాటు చేసి, అందుకు తగ్గ పోస్టర్లు కూడా వేశారు. అప్పట్లో ఈ పోస్టర్లు చాలా చర్చకు దారి తీశాయి. ఆ తర్వాత మళ్లీ ఎవరూ ఆ కార్యక్రమం చేపడుతున్నట్లు లేరు. తమిళనాడులో కొన్ని వర్గాలవారు నేటికీ రావణాసురుడిని కొలుస్తారు. వారు అక్కడక్కడా రామదహనం చేపడుతున్న వార్తలు వినిపిస్తున్నా, అవేవీ అందరికీ తెలిసేలా చేయడం లేదు.
పరాయి వ్యక్తి భార్యను అపహరించిన రావణుడు నాయకుడు ఎలా అవుతాడు? మారువేషంలో వచ్చి సీతను అపహరించిన వాడిని పూజించడం ఏమిటి అనే చర్చ చాన్నాళ్లుగా ఉంది. రామాయణ రచనలో చాలా భాగం ద్రావిడులపై ఆర్యులు చూపిన వివక్షే అనేది కొందరి మాట. దీనిపై అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. విస్తృతమైన చర్చకు దారి తీసే ఈ అంశాన్ని ఇక్కడికిక్కడ ఎటూ తేల్చలేం! కానీ రావణదహనానికి ప్రతిగా రామదహనమూ జరిగిందనేది చరిత్ర చెప్తున్న నిజం!….. విశీ
Share this Article