రామాయణం లఘు పాత్రలు మనకేమి చెబుతున్నాయి?
—————————
“మీరు రామాయణం చదివారా? అయితే ఈ పుస్తకం చదవండి” ఇది ఒక పుస్తకం టైటిల్… పుస్తక రచయిత అప్పజోడు వెంకటసుబ్బయ్య. అనంతపురం, గూడూరు, నంద్యాల, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరయ్యారు. “మహాభారతం- మానవ స్వభావ చిత్రణ” అన్న విషయం మీద ఉస్మానియాలో పిహెచ్డి చేశారు. రామాయణ, భారతాల మీద తెలుగు నేల మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేసి ఉంటారు. భారతి పత్రిక మొదలు ఇప్పటిదాకా కొన్నివేల వ్యాసాలు రాశారు. పెద్దవారు. వందలమంది అభిమానులయిన శిష్యగణాన్ని సంపాదించుకున్నారు. ఎనభై ఆరేళ్ల వయసు. కర్నూల్లో స్థిరపడ్డారు.
మొన్న మొన్నటిదాకా ఫోన్లలో నాలాంటివారి పిచ్చి ప్రశ్నలకు పుస్తకాలు వెతికి రెఫెరెన్సులతో ఓపికగా సమాధానాలు చెప్పేవారు. రామాయణాన్ని పారాయణ చేస్తే పుణ్యమే కానీ- అర్థం, అంతరార్థం తెలుసుకుని పాటిస్తే- పుణ్యం, పురుషార్థం అని వారు చెబుతుంటే వినడం ఒక భాగ్యం. ఎదుటి మనిషి స్థాయికి దిగి విడమరిచి చెబుతారు. మా నాన్న చదివాక ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. 475 పేజీలు… పుస్తకం టైటిలే విచిత్రంగా ఉండి వెంటనే చదివాను.
Ads
అందరికీ అర్ధమయ్యే అత్యంత సరళమయిన శైలి. ఒక మిత్రుడి ద్వారా ఆయనతో పరిచయం పెంచుకుని వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి విసిగించేవాడిని. కొంతకాలానికి నాకు ఎలాంటి సందేహాలున్నాయో ఆయనే కనుక్కుని నేను అడక్కుండానే చెప్పేవారు. నాలాంటి వేలమంది స్టూడెంట్స్ ను హ్యాండిల్ చేసిన అనుభవం మరి. వార్ధక్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో ఈమధ్య మాట్లాడలేకపోతున్నారు. అయినా అరవై ఏళ్లపాటు మాట్లాడాల్సినదంతా మాట్లాడారు. రాయాల్సినదంతా రాశారు. ఇప్పుడు ఆయన మౌనం కూడా మాట్లాడుతూనే ఉంటుంది.
ఇది ఆ పుస్తక సమీక్ష కాదు. శ్రీరామనవమి సందర్భంగా ఆ పుస్తక పరిచయం- అంతే. ఎప్పుడెప్పుడో రామాయణంలో పాత్రలమీద ఆయన రాసిన వ్యాసాలకు కొన్ని శ్లోకాలు, కొంత వ్యాఖ్య జోడించి ఒక పద్ధతిలో రూపొందించిన పుస్తకమిది. శబరి మొదలు శ్రీరాముడి దాకా 27 పాత్రలను ప్రస్తావిస్తూ 27 వ్యాసాల సమాహారం. క్రమపద్ధతిలో అయితే మొదట వసిష్ఠుడో, వాల్మీకో రావాలి. శబరితో మొదలయ్యింది. శ్రీరాముడు చిట్ట చివర ఉన్నాడు. రచయిత చమత్కారం ఇక్కడే ఉంది. రాముడిని మించిన రామభక్తి రూపుదిద్దుకున్న పాత్రలకు మొదట పట్టం కట్టారు. 475 పేజీల్లో విస్తరించిన 27 వ్యాసాలను ఇక్కడ ప్రస్తావించడం కుదరదు. కొన్ని పాత్రలు, కొన్ని స్వభావాలు ఆయన మాటల్లోనే- మనం ఇంతకుముందు మూడు భాగాల్లో చదువుకున్నాం… శబరి, మంథర, గుహుడు, కైకేయి…
———————————————
———————————————-
ఒక్కొక్క పాత్ర మీద కనీసం పదిహేను- ఇరవై పేజీల వ్యాసం ఉంటుంది. అందులో కొన్ని పాత్రల ప్రస్తావనలో అక్కడక్కడా కొన్ని భాగాలివి. ఏదీ పూర్తి కాదు. మొత్తం ఇవ్వడానికి ఇది వేదిక కాదు. ఇలా మిగిలిన పాత్రల గురించి కూడా విశ్లేషణ సాగుతుంది. ఊర్మిళ, శూర్పణఖ, మండోదరి, సీతాదేవి, త్రిజట, వాల్మీకి మహర్షి, వసిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, మారీచుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, రావణుడు, దశరథ మహారాజు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు… ఏ పాత్రకు ఆ పాత్ర గొప్పది. ఒక్క రామాయణంలోనే కథానాయకుడయిన రాముడికి అన్ని పాత్రలతో సంబంధం ఉంటుంది. సీతారాములు, హనుమ, భరత, లక్ష్మణ, రావణాసురుల గురించి అందరికీ తెలిసిందే. తార, శూర్పణఖ, మండోదరి, ఊర్మిళ, మారీచుడు లాంటి పాత్రలను రచయిత మనకు మరో కోణంలో చూపిస్తారు.
అప్పుడెప్పుడో త్రేతాయుగంలో మంథరలు, కైకేయిలు ఉండేవారట అని చదువుకోవడం కంటే- అలాంటివారు ఇప్పుటికీ లేరా? అన్నది రచయిత ప్రశ్న. గుహుడి ఆతిథ్యం, వినయం, ప్రేమల ముందు ఏ జ్ఞానం నిలబడగలుగుతుందన్నది రచయిత ప్రశ్న. శబరి సేవల ముందు మహర్షులే చిన్నబోలేదా అన్నది రచయిత ప్రశ్న. ఇలాంటి పుస్తకాలు బహుశా బయట మార్కెట్లో దొరక్కపోవచ్చు. వెయ్యి కాపీలు అచ్చయితే అమ్ముడుపోవడానికి వెయ్యేళ్లు పట్టచ్చు. పాఠ్యపుస్తకాలు మనం చదువుకుంటే అర్థం కావు. టీచర్లు చెబితేనే మనకు అర్థమవుతాయి. రామాయణం లాంటి కావ్యాలు కూడా అంతే. దాన్ని దర్శించి, అనుభవించిన వారు చెబితే ఆ అందం వేరు. ఆ ఆనందం వేరు. ఆ రసానుభూతి వేరు. ఇష్టమున్నవారు ఈ పుస్తకాన్ని వెతికి పట్టుకుని చదువుకోవచ్చు.
——————————
ఇక మన ప్రపంచంలోకి వద్దాం. వాల్మీకి రచన చదువుతుంటే వీడియో కళ్లముందు కదులుతుంది. భారత దేశంలో ఏ భాషలో అయినా వాల్మీకి రామాయణం ఒదిగిపోతుంది. పాడుకోవడానికి వీలుగా రాశానని వాల్మీకే చెప్పుకున్నాడు. ఆ రామాయణాన్ని గానం చేసిన తొలిగాయకులు లవకుశులు. మొదటి శ్రోత వాల్మీకే. తరువాతి శ్రోతలు అయోధ్యలో శ్రీరాముడితోపాటు సకల జనులు. భూమి మీద నదులు, కొండలు ఉన్నంతవరకు నువ్ రాసే రామాయణం నిలిచి ఉంటుందని రాయకముందే వాల్మీకికి బ్రహ్మ వరమిచ్చాడు. పదహారు కళల చంద్రుడిలా పదహారు సద్గుణాలతో వెలిగే మనిషి ఈ భూలోకంలో ఎవరయినా ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా నారదుడు పట్టిస్తేనే వాల్మీకికి రాముడు దొరికాడు. ఆ రాముడిని వాల్మీకి మన చేతుల్లో పెట్టాడు.
తెలుగులో లెక్కలేనన్ని రామాయణాలు. మరలనిదేల రామాయణంబన్న… నా భక్తి రచనలు నావి అన్న విశ్వనాథలా ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభూతి. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యలు అయోధ్య రాముడిని తెలుగు రాముడిని చేశారు. దేవదేవం భజే దివ్యప్రభావం! అని అన్నమయ్య పల్లవి ఎత్తుకోగానే రాముడు తాళ్లపాక పూరిపాకల్లో రాతి అరుగుల మీద కూర్చుని ఆదమరిచి వింటూనే ఉన్నాడు. ఓ రామ శ్రీరామ నీ నామమెంత రుచిరా! అని రామదాసు కీర్తిస్తుంటే రాముడు భద్రాచలం వదిలి వెళ్లలేకుండా ఉండిపోయాడు.
మరుగేలరా? ఓ రాఘవా? అని త్యాగయ్య భక్తితో నిలదీస్తే రాముడు తెలుగు కీర్తనల్లోనే ఉండిపోయాడు. ఆంధ్ర వాల్మీకి ఒంటిమిట్ట వావిలికొలను సుబ్బారావు 24 వేల పద్యాల్లో రామగానం చేస్తే కోదండరాముడు ఒంటిమిట్ట గుడిలోనే ఉండిపోయాడు. భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం… ఒకటా రెండా? రామాయణం జీవనదిగా పాయలు పాయలుగా ప్రవహిస్తూనే ఉంది. మనిషిని గెలిపించడానికి దేవుడే దిగివచ్చి మనిషిగా మసలిన కథ రామాయణం. ధర్మం పోతపోస్తే రాముడు. సాక్షాత్తు రాముడికే కష్టమొచ్చినా అనుకోవాల్సిన నామం- రామ రామ. శ్రీరామ రక్ష- సర్వ జగద్రక్ష. రాత్రంతా రామాయణం విని పొద్దున్నే ఎవరికి ఎవరు ఏమవుతారని అడగకూడదు. “రాయినయినా కాకపోతిని రామపాదము సోకగా…”………….. శుభాకాంక్షలతో…………. — – పమిడికాల్వ మధుసూదన్ (రెండేళ్ల క్రితం పోస్టు)
Share this Article