Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆస్కార్ బరిలోకి ‘రామాయణం’… రాజమౌళి ఆర్ఆర్ఆర్ బాటలోనే!

November 11, 2026 by M S R

.

భారత్ అధికారిక ఎంట్రీ కాకున్నా ఆస్కార్‌కు మరో మార్గం… 99వ అకాడమీ అవార్డుల పరిశీలనకు రణ్‌బీర్ కపూర్ సినిమా సమర్పణ… గతంలో ఇదే దారిలో వెళ్లి ‘నాటు నాటు’తో ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్….

భారతీయ ఇతిహాసం రామాయణం ఇప్పుడు మరో అంతర్జాతీయ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది… ‘రామాయణ: పార్ట్ 1’ను 99వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు సమర్పించారు… నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పరిశీలనకు పంపించినట్లు ఎన్డీటీవీ ప్రత్యేక కథనం వెల్లడించింది…

Ads

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది… ఈ ఏడాది ఆస్కార్ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో భారత్ తరఫున మరాఠీ సినిమా ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైంది… అయినప్పటికీ ‘రామాయణ’కు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది… ఎందుకంటే భారత్ తరఫున ఒక సినిమా అధికారికంగా ఎంపికైనంత మాత్రాన ఇతర భారతీయ చిత్రాలకు ఆస్కార్ పోటీలో పాల్గొనే అవకాశం మూసుకుపోదు… అకాడమీ నిర్దేశించిన అర్హతలు సాధిస్తే ఇతర సినిమాలు కూడా స్వతంత్రంగా పరిశీలనకు సమర్పించుకోవచ్చు…

ఆర్ఆర్ఆర్ కూడా ఇదే దారిలో… ఇందుకు గతంలోనే ఒక బలమైన ఉదాహరణ ఉంది… 2022లో విడుదలైన ఎస్.ఎస్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా భారత్ అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌కు వెళ్లలేదు… 95వ ఆస్కార్ అవార్డుల కోసం గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను భారత్ ఎంపిక చేసింది… అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ నిర్మాతలు వెనక్కి తగ్గలేదు… అమెరికా పంపిణీదారుల సహకారంతో సినిమాను ఆస్కార్‌లోని పలు విభాగాల పరిశీలనకు స్వతంత్రంగా సమర్పించారు…

అంతటితో ఆగకుండా అమెరికాలో ప్రత్యేక ప్రదర్శనలు, హాలీవుడ్ ప్రముఖులకు సినిమా పరిచయం, అకాడమీ సభ్యులను ఆకర్షించేలా భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు… ‘For Your Consideration’ పేరుతో సాగిన ఈ ప్రచారం అంతర్జాతీయంగా ఆర్ఆర్ఆర్‌పై ఆసక్తిని పెంచింది…

చివరకు ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ సాధించడమే కాకుండా అవార్డును కూడా గెలుచుకుంది… భారతీయ సినిమా చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయింది… అయితే ఈ అవార్డు మొత్తం సినిమాకు కాకుండా పాటకు లభించింది…

ఇప్పుడు ‘రామాయణ’ కూడా భారత్ అధికారిక ఎంట్రీతో సంబంధం లేకుండా ఆస్కార్ పరిశీలనకు వెళ్లే మార్గాన్ని ఎంచుకుంది… అయితే ఆర్ఆర్ఆర్ మాదిరిగా నామినేషన్ సాధించాలంటే కేవలం సినిమాను సమర్పించడం మాత్రమే సరిపోదు… అర్హతలు, ప్రచారం, అకాడమీ సభ్యుల ఓటింగ్ వంటి అనేక దశలను దాటాల్సి ఉంటుంది…

రామాయణ

ఆస్కార్‌కు అర్హతలు ఏమిటి? బెస్ట్ పిక్చర్ వంటి సాధారణ విభాగాల్లో ఆస్కార్ పరిశీలనకు రావాలంటే అమెరికాలో అకాడమీ గుర్తించిన ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీసం ఒకచోట అర్హత కలిగిన థియేట్రికల్ ప్రదర్శన ఉండాలి… లాస్ ఏంజెలిస్ కౌంటీ, న్యూయార్క్ నగరం, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, చికాగో, డల్లాస్-ఫోర్ట్ వర్త్, అట్లాంటా ఈ జాబితాలో ఉన్నాయి…

అక్కడ ఒకే థియేటర్‌లో వరుసగా ఏడు రోజుల పాటు నిర్దేశించిన సంఖ్యలో రోజువారీ ప్రదర్శనలు నిర్వహించాలి… అనంతరం నిర్మాతలు లేదా పంపిణీదారులు అకాడమీకి అవసరమైన దరఖాస్తులు, ఇతర వివరాలు సమర్పించాలి… బెస్ట్ పిక్చర్ వంటి కొన్ని విభాగాలకు అదనపు అర్హత నిబంధనలు కూడా ఉన్నాయి…

అంతర్జాతీయ చలనచిత్ర విభాగానికి మాత్రం ప్రత్యేక విధానం ఉంటుంది… సాధారణంగా ప్రతి దేశం గుర్తింపు పొందిన ఎంపిక కమిటీ ద్వారా ఒక సినిమాను అధికారికంగా పంపిస్తుంది… అయితే అకాడమీ గుర్తించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో నిర్దిష్ట పురస్కారాలు సాధించిన సినిమాలకు కూడా దేశ అధికారిక ఎంపికతో సంబంధం లేకుండా పోటీకి అర్హత లభించే అవకాశం ఉంది…

ఈ విధానం వల్ల నాగ భాషలో తెరకెక్కిన ‘అంగ్’ సినిమాకు కూడా అవకాశం లభించింది… 2026 టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ అవార్డు సాధించడంతో ఈ సినిమా అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పరిశీలనకు అర్హత పొందింది…

బాక్సాఫీస్ నుంచి ఆస్కార్ వరకు… మరోవైపు ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది… నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి ఆరు రోజుల్లో భారత్‌లో రూ.403.95 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.673.90 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి…

రామాయణం కూడా ఆర్ఆర్ఆర్ బాటలో అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తుందా? భారతీయ ఇతిహాసం హాలీవుడ్ ఆస్కార్ వేదికపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి… కావల్సిందల్లా బలమైన లాబీయింగ్…


రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు హాలీవుడ్ కొత్త ప్రపంచం కాదు…. ఆయన స్థాపించిన DNEG సంస్థ ఇప్పటికే ఎనిమిది ఆస్కార్ అవార్డులను అందుకుంది… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, అకాడమీ అవార్డుల వాతావరణంతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది… అందువల్ల రామాయణ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ ప్రచారం నిర్వహించడానికి ఆయనకు పరిచయాలు, అనుభవం రెండూ అందుబాటులో ఉన్నాయి… సినిమా సమర్పణతోనే ఆగకుండా, నామినేషన్ లక్ష్యంగా వ్యూహాత్మక ప్రచారం చేపట్టే అవకాశాలున్నాయి…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆస్కార్ బరిలోకి ‘రామాయణం’… రాజమౌళి ఆర్ఆర్ఆర్ బాటలోనే!
  • సహస్రకంఠ రావణుడిని సీత చంపుతుంది ! అదే అద్భుత రామాయణం !!
  • ఏవేవో కవరింగులు-! నీ జ్ఞాపకాల దొంతర ‘నిజాయితీ’గా లేదమ్మా..!
  • Pyre … మీకు వీలైతే మేం కూడా వెళ్లిపోకముందే చచ్చిపొండి..!!
  • ఇజ్రాయిల్ రాజకీయాల్లో మలుపు? జాతీయ ప్రభుత్వం ఏర్పాటు?
  • తొమ్మిది పెళ్లిళ్ల ‘భరణం’ కేటుగత్తె..! మొత్తానికి ముసుగు తొలిగింది..!!
  • కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లినా విమర్శలేనా..?!
  • సోనియా గాంధీ ఆరోగ్య రహస్యాలు… 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది..?
  • నిందించకండి- వాళ్లు రాముడి జెండా ఎగరేశారు విశ్వవీథుల్లో…
  • 3 లేదా 4 పెళ్లిళ్ల ఇండియన్ సెలబ్రిటీలు- తక్కువేమీ లేరు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions