రామోజీరావు అనితర సాధ్యుడు ఏమీ కాదు… ఆయన పెట్టుబడుల అడుగులన్నీ సక్సెస్ ఏమీ కాదు… చేతులు కాల్చుకుని, మూసేసుకున్నవి బోలెడు… చివరకు తనకు కీర్తికిరీటాలు తొడిగిన మీడియా రంగంలోనూ బోలెడు వైఫల్యాలు… తన ఇంగ్లిష్ పత్రిక న్యూస్టైం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్… చాలారోజులు నష్టాల్లో నడిపీ నడిపీ ఇరవయ్యేళ్ల క్రితం మూసేశాడు… పలు భాషల్లో తీసుకొచ్చిన ఈటీవీ న్యూస్ చానెళ్లన్నీ ఫ్లాప్… వాటిని పాత బాకీల కింద ముఖేష్ అంబానీకి ముడిపెట్టి చేతులు దులుపుకున్నాడు… మిగిలిన చానెళ్లలోనూ రెండు న్యూస్ చానెళ్లు, ఈటీవీ ప్లస్, అభిరుచి ఎట్సెట్రా అన్నీ సూపర్ ఫ్లాప్… చివరకు ఈనాడు వినోద చానెల్ కూడా మూడో ప్లేసుకు పడిపోయింది… సితార పత్రిక ఎప్పుడో మూసేశారు… ఇప్పుడు తాజాగా విపుల, చతుర, తెలుగువెలుగు, బాలభారతం పత్రికల్ని శాశ్వతంగా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నాడు… ఇది వేల కోట్ల రామోజీ గ్రూపుకే పరువు తక్కువ వ్యవహారం… ఎందుకో కూడా కాస్త చెప్పుకోవాలి…
సహజంగానే మీడియా అనేది కూడా ఓ వ్యాపారం… అందులోనూ పెట్టుబడులు, తగిన రాబడి లెక్కలుంటయ్… రూపాయి లాభం లేనప్పుడు ఏ పెట్టుబడిదారైనా తన దుకాణాన్ని క్లోజ్ చేస్తాడు… ప్రభుత్వమే భారంగా మారిన సంస్థల్ని డిజిన్వెస్ట్మెంట్, డిస్పోజ్ పద్ధతుల్లో వదిలించుకుంటోంది… ఆ కోణంలో న్యూస్టైం, సితార మూసివేత సబబుగానే కనిపిస్తుంది… కానీ తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల మ్యాగజైన్లను రామోజీ ఫౌండేషన్ కిందుకు మార్చారు చాలారోజుల క్రితమే… అంటే లాభనష్టాలకు అతీతంగా, ఫౌండేషన్ తను సంకల్పించిన లక్ష్యాల దిశలో వాటిని నడిపించడానికి అన్నమాట… వేల కోట్లు, అంతకు మించి ఉన్న రామోజీరావు గ్రూపు ఆప్టరాల్ ఓ నాలుగు చిన్న వెబ్ మ్యాగజైన్లను నడిపించలేక మూసివేయడం అనేది దానికే పరువు తక్కువ వ్యవహారం… పేరుకు ఫౌండేషన్ పేరిట, సేవాదృక్పథం పేరిట నడిపినా… సగటు పెట్టుబడిదారీ మనస్తత్వమే డామినేట్ చేసి, లాభనష్టాల లెక్కలేసుకుని, చివరకు ఆ నాలుగు పత్రికలనూ ఉరితీసింది… ఇక ఈనాడు గ్రూపులో మిగిలిన పత్రికలు ఈనాడు, అన్నదాత…
Ads
నిజమే… ఇది ప్రింట్ మీడియా కాలం కాదు… చాలా పత్రికలు ప్రింటింగ్ మూసేసుకుని, వెబ్ ఎడిషన్లతో కథ నడిపించేస్తున్నాయి… ఏవో పార్టీల అనుబంధ పత్రికలు ‘పత్రికేతర ఆదాయం’తో బండి నడిపిస్తున్నాయి… వాటి విస్తృతావసరాల నేపథ్యంలో ఆ నష్టాల్ని భరిస్తుంటాయి… ఈ స్థితిలో ఫస్ట్ దెబ్బతిన్నవి మ్యాగజైన్లు… కాలప్రవాహంలో చాలా మ్యాగజైన్లు కొట్టుకుపోయాయి… వాటి ధరను పాఠకుడు చెల్లించలేక కాదు… స్టాండ్స్ వరకూ వెళ్లి, వాటిని కొని, తాపీగా తిరగేసే మూడ్లో లేడు పాఠకుడు… అంటే తన వద్దకు వచ్చిన పత్రికను పాఠకుడు తీసుకుంటున్నాడు తప్ప తను పత్రిక వద్దకు వెళ్లడం లేదు… ఈనాడు ఇంటి ముందు పడుతుంది, అన్నదాత ఇంటికే వస్తుంది… కానీ విపుల, చతుర, తెలుగువెలుగు, బాలభారతం వద్దకు పాఠకుడు వెళ్లడం లేదు… అందుకని ఆ కాపీల సంఖ్య ఘోరంగా పడిపోయింది… ఆమధ్య వాటి ప్రింటింగ్ ఆపేశారు… కేవలం డిజిటల్ ఫార్మాట్ అన్నారు… ఇప్పుడిక ఆ వెబ్ ఎడిషన్లకూ మరణశిక్ష అమలు చేశారు… మరి రేప్పొద్దున ఈనాడు, అన్నదాత..? కాలం చెప్పాలి…
ఇక్కడ ఖచ్చితంగా రామోజీరావును మనసారా అభినందించాల్సిన అంశం ఒకటుంది… నలభై ఏళ్ల క్రితం విపుల, చతుర ఓ గొప్ప ప్రయోగం… వేరే పబ్లిషర్లు కనీసం కలలో కూడా ఆలోచించలేని సాహితీసేవ అది… అనేకానేక భాషల్లో మంచి కథల్ని ఎంచుకుని, తెలుగులోకి అనువదించి అందించడం విశిష్ట ఆలోచన, విపుల ఆచరణ… అలాగే ప్రతి నెలా ఒక నవలను చౌకగా అందించడం చతురమైన సాహసం… తెలుగువెలుగు, బాలభారతం పుట్టుక, ఆయుష్షు తక్కువ… సత్ సంకల్పమే… నడిచినన్ని రోజులూ నడిచాయి… వెబ్ ఎడిషన్స్ నడపాలన్నా సరే, సిబ్బంది జీతాలు, డిజైనర్ల భారం తప్పదు… ఈనాడులో ఆ భారం మరీ ఎక్కువ… ఇతర వెబ్ పత్రికల్లాగా రచయితలకు పారితోషికాలు ఇవ్వకుండా, పేజీనేషన్ లేకుండా, మ్యాగజైన్ ఫార్మాట్ తీసేసి, కేవలం ఓ సాదాసీదా లిటరరీ వెబ్ సైట్లాాగా నడపడం ఈనాడుకు ఇష్టముండదు… చేతకాకపోతే ఏదయినా చంక దింపేయడమే… అంతే… అందుకే ఇక మూసేశారు… ఇంతకుముందూ చెప్పుకున్నాం కదా… రాబోయేది యాప్ జర్నలిజం, వెబ్ జర్నలిజం, సోషల్ జర్నలిజం… ఈనాడు కూడా అటువైపే వెళ్తోంది… కాకపోతే మెల్లమెల్లగా….!!
Share this Article