ఒకటి గుర్తుంది… బోలెడు భాషల్లో ఈటీవీ చానెళ్లు స్టార్ట్ చేసే సందర్భం… చంద్రబాబు వచ్చాడు… చాలామంది పెద్దలు వచ్చారు… జస్ట్, రామోజీరావు అలా స్విచ్చులేవో నొక్కాడు… ప్రారంభోత్సవం జరిగిపోయింది… ప్రేమతో వచ్చాడు కదాని చంద్రబాబుతో మర్యాదకు, మొహమాటానికి కూడా ఒక్క చానెల్ స్విచ్చునూ నొక్కనివ్వలేదు… వందల మంది ఆహుతుల్లో చంద్రబాబు కూడా ఒకరు… అంతే… ఎవరొచ్చినా సరే, ఫిలిమ్ సిటీకి వెళ్లి, రామోజీతో భేటీ వేసి, చర్చించడం ఓ పెద్ద ప్రివిలేజ్ ఒకప్పుడు… అంతెందుకు..? మోడీ ప్రథమ ప్రధాని టరమ్ ప్రమాణ స్వీకారం సమయంలో రామోజీ ముందు వరుసలో మంచి ప్రొటోకాల్ మర్యాదలు పొందగా… చంద్రబాబు వెనుక వరుసల్లో వందల్లో ఒకడిగా చూస్తూ కూర్చున్న దృశ్యాలూ గమనించాం కదా… ప్రధాని నంబర్ టూ అనిపించుకున్న అమిత్ షాయే టైమ్ తీసుకుని, ఫిల్మ్ సిటీ వెళ్లి, అంతటి రామోజీరావుతో భేటీ అయిన వార్తలూ చదివాం… అలాంటి రామోజీరావు చాలా మారిపోతున్నాడు… దిగివస్తున్నాడు…
మోడీని ఏమీ అనలేడు, జగన్‌నూ ఏమీ అనలేడు, మరి కేసీయార్‌ను..? కలలో కూడా ఏమీ అనలేడు… ఏదో భయం… పత్రికలో ఏమీ రాయనివ్వడు… అదేమో రుచీపచీ లేని పథ్యం తిండిలా తయారైంది… ఎలాంటి ఈనాడు..? ఎలాంటి రామోజీ..? ఇప్పుడేమిటి..? ఇప్పుడు విషయం ఏమిటంటే..? కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది కదా… వెంటనే రామోజీరావు నుంచి ప్రత్యేక శుభాకాంక్షల లేఖ ఒకటి అందింది… మండలిలో మస్తు మాట్లాడాలె నువ్వు, జననాయకురాలిగా ఇంకా ఎదగాలె, అందరి మన్ననలందుకోవాలె అని ఆకాంక్ష… బాగుంది, ఒక ప్రజాప్రతినిధిని అభినందించడం మంచిదే… కానీ గెలిచిన ఎమ్మెల్సీలందరినీ, ఇతర ప్రజాప్రతినిధులను ఇలాగే గ్రీట్ చేస్తున్నాడా..? ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు గెలుస్తున్నారు, మారుతున్నారు… అందరికీ ఇలా రామోజీ మార్క్ శుభాకాంక్షల లేఖలు అందుతున్నాయా..?
Ads
ఆమె కవిత కాబట్టి… కేసీయార్, కేటీయార్‌లతో ఈక్వల్‌గా ఆమె కూడా కనిపిస్తున్నది కాబట్టి… ఆమెతో మంచి రిలేషన్ అవసరం కాబట్టి… అంతేనా సార్..? ఐనా ఆయన కేసీయార్, ఆపై కేటీయార్ వారసత్వం… ఈ చెల్లి పెత్తనం, ఈ బిడ్డ గావురం ఏం నడుస్తయ్..? మహా అయితే మంత్రి అవుతుందేమో… ముఖ్యమంత్రి అయితే కాలేదుగా… ఏమో, చెప్పలేం అంటారా..? అంతేలెండి… పాలిటిక్సులో ఏదైనా జరగొచ్చు… ఐనా మరీ ఇంత ముందుచూపు, ఇంత ముందస్తు గ్రీటింగ్స్ అవసరమా సార్..? గ్రీటింగ్స్ తప్పులేదు, కానీ ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందితే ఆశ్చర్యం వేస్తోంది అందరికీ..! అబ్బే, అదేమీ లేదు, ఇందులో ప్రత్యేకమేమీ లేదు అంటారా..? అబ్బ, ఊరుకొండి సార్, మీరు ఏ పనిచేసినా ఓ పరమార్థం ఉండకపోదు… కాకపోతే ఇప్పుడే ఎవరికీ అర్థం కాకపోవచ్చు… అంతే… కవితమ్మా, మీకు శుభాకాంక్షలు, ఎమ్మెల్సీ అయినందుకు కాదు, అది చాలా చిన్న విజయం… రామోజీ అభినందనలు, ఏవో భావి సంకేతాలు అందుతున్నందుకు…!!
Share this Article