చాలామంది ఇప్పటి ప్రముఖులు ఒకప్పుడు కెరీర్ మొదట్లో ఛీకొట్టబడినవాళ్లే అయి ఉంటారేమో… బొచ్చెడు ఉదాహరణలు చదివాం కదా… పర్సనాలిటీ డెవలప్మెంటలిస్టులు కూడా తాము చెప్పే సక్సెస్ స్టోరీల్లో ఇదే ఊదరగొడుతుంటారు కదా… డైరెక్టర్ వంశీ రాస్తున్న పాత జ్ఞాపకాల్లో నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ఓచోట చదివితే ఇదే గుర్తొచ్చింది… అప్పట్లో రాజేంద్రప్రసాద్‌తో వంశీ ఓ సినిమా తీశాడు… దాని పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అప్పట్లో కాస్త జోరుగానే సినిమా నిర్మాణం స్టార్ట్ చేసిన రోజులు…
సితార, అన్వేషణ తాలూకు హ్యాంగోవర్‌లో ఉన్న వంశీ మళ్లీ భానుప్రియనే ఈ సినిమాకు కూడా హీరోయిన్‌గా తీసుకున్నాడు… మరి హీరో ఎవరు..? వంశీ రాజేంద్రప్రసాద్ పేరును రామోజీరావుకు ప్రతిపాదించాడు… అబ్బే, అని వెంటనే పెదవి విరిచాడు రామోజీరావు… ఎహె, అక్కర్లేదు అనేశాడు… అప్పట్లో ఆయన ప్రతి సినిమా స్క్రిప్టు గట్రా జాగ్రత్తగా చూసుకునేవాడు… తరువాత ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో తను నమ్మినవాళ్లే తనను సినిమా నిర్మాణాలకు సంబంధించి అడ్డంగా ముంచేశారుట, దాంతో ఇక రామోజీరావు సినిమాల నిర్మాణమే ఆపేశాడు అని అంటారు మరి…
రాజేంద్రప్రసాద్‌ను నేను మంచిగా చూపిస్తాను, మీరే చూస్తారుగా అని వంశీ బలంగా చెప్పడంతో రామోజీరావు సరేనన్నాడు… అదీ అయిష్టంగానే… నిజానికి ఒకసారి రామోజీరావు వద్దని వీటో చేశాక ఇక నిర్ణయంలో పునరాలోచన ఉండదు… సినిమాలే కాదు, ఏ విషయమైనా సరే… ఐనా వంశీ ధైర్యం చేసి రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా నిలిచాడు… విశేషమే… రాజేంద్రప్రసాద్‌కు కూడా ఇది హీరోగా మొదటి సినిమా…
Ads
రామోజీరావు అప్పటికీ పెద్దగా కన్విన్స్ అయినట్టుగా అనిపించలేదు వంశీకి… అందుకే తను అనుకున్నట్టుగా కొన్ని ఫోటోలు తీయించి, రామోజీరావుకు పంపించాడు… సర్లే, కానివ్వండి అని ఆయన వోకే చెప్పాడు… ఇక ఆ తరువాత రాజేంద్రప్రసాద్ మెల్లిమెల్లిగా సినిమాల్లో ఎదిగిపోయాడు… తన కెరీర్ ఇంకా కొనసాగుతూనే ఉంది… విజయాలో, అపజయాలో… తను మాత్రం ఇంకా ఫీల్డులోనే ఉన్నాడు… అదీ కథ… ఇంతకీ వంశీ ఏమని రాసుకున్నాడంటే…. యథాతథంగా… (ఇవి కేవలం రాజేంద్రప్రసాద్ గురించిన ప్రస్తావన వచ్చిన పేరాలు మాత్రమే సుమా…)
ఈ ప్రేమించు పెళ్ళాడు సినిమా జ్ఞాపకాల్లో రాజేందప్రసాద్‍ని అయిష్టంగా ఒప్పుకున్న రామోజీరావుగారు గుర్తొచ్చారు. అతన్ని బాగా చూపిస్తానని నేను బలంగా అనడంవల్ల ఒప్పుకున్నారు గానీ ఆయనకెంత మాత్రం ఇష్టంలేదు.
సత్యాన్ని పిల్చిన నేను ‘‘ఈ ప్రసాద్ క్లోజప్స్ బాగా తీసి, లస్టర్ పేపర్‍మీద పెద్ద పెద్ద ప్రింట్లెయ్యి. రామోజీరావుగారికి పంపాలి’’ అంటా బయటికొచ్చేటప్పటికి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి.
ప్రింట్లని ప్యాక్ చేసిచ్చాడు. వాటిని ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని చెయ్యడం కొత్తగా మొదలెట్టిన బాపినీడు చౌదరిగారి కిచ్చి ‘‘ రామోజీరావుగారికి పంపండి’’ అన్నాను.‘‘షూటింగ్ మొదలైపోయిందిగదా ఇప్పుడెందుకూ?’’ అన్నారాయన.‘‘మొన్న రైల్లో వచ్చేటప్పుడనుకున్నాను. పంపండి చెప్తాను’’ అనేసి బయల్దేరేను.మూడో రోజు సాయంత్రం మహాలక్ష్మి హోటలు కొచ్చిన బాపినీడుగారు ‘‘విగ్గుపెట్టి తీసిన రాజేందప్రసాదు ఫోటోలు చాలా బాగున్నాయన్నారు మా ఛైర్మన్ రామోజీరావుగారు’’ అన్నారు.‘‘ధ్యాంక్సండీ. ఆయన్నించి అలాంటి హ్యాపీ రియాక్షన్ విందామనే తీయించేను వీటిని’’ అన్నాను.
Share this Article