ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన…
డైరెక్టర్ వంశీయే మరికొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు… ఆర్ఆర్ కన్నా ముందే రామోజీరావుకు ఓసారి ఔట్‌పుట్ చూపించాలని వంశీ అనుకున్నాడు… ప్రసాద్ లేబరేటరీస్ ప్రొజెక్షన్ థియేటర్‌లో డబుల్ పాజిటివ్ ప్రింట్ వేసి చూపించారు… మొత్తం చూసిన రామోజీరావు సాయంత్రం గెస్ట్ హౌజుకు రావాల్సిందిగా వంశీకి చెప్పించాడు బాపినీడుతో…
‘‘బాగుంది సినిమా… పాటలు బాగున్నాయి…. ముఖ్యంగా ‘నిరంతరమూ వసంతములే’ అన్న పాటలో కొన్ని షాట్సు…’’ అన్నాడు… వంశీ ఖుష్… కానీ వెంటనే రామోజీరావు ‘‘ఆ క్లైమాక్స్ మట్టుకు రీషూట్ చేయాలి… అది డిస్కస్ చేయడానికే ఇక్కడిదాకా రమ్మన్నాను’’ అన్నాడు… చాలాసేపు మాట్లాడినా ఓపట్టాన రామోజీరావు కన్విన్స్ కావడం లేదు… తనకు ఖాళీ దొరికినప్పుడల్లా వంశీతో మాట్లాడుతూనే ఉన్నాడాయన…
Ads
మరోరోజు సిట్టింగ్‌లో…. కామెడీ బాగుంది గానీ, ఇంకా ఏవన్నా ఎక్సట్రా పెంచితే బాగుంటుందన్నాడు… కామెడీ పెంచాలి, క్లైమాక్స్ మార్చాలి… అదే ఆలోచిస్తుంటే రాళ్లపల్లి తనికెళ్ల భరణిని తీసుకొచ్చి పరిచయం చేశాడు… డైలాగులు మాత్రమే రాయడం కాదు, సీన్లు కూడా రాయండి అనడిగాడు వంశీ… సరేనన్నాడు భరణి…
అనుకోగా అనుకోగా ఓ క్లైమాక్స్ ఫైనలైంది… హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ పూర్తిచేశారు… ఎడిటింగు, డబ్బింగు, ట్రిమ్మింగు గట్రా పూర్తిచేశాక మొత్తం సినిమాను మళ్లీ చూశాడు రామోజీరావు… ‘‘ఇప్పుడు బాగుంది, ఇక మిగతా పనులన్నీ కానివ్వండి’’ అన్నాడు సంతృప్తిగా… అప్పుడు ఈ సినిమా నిర్మాణవ్యయం రఫ్‌గా 22 లక్షల దాకా తేలింది… అన్నీ అయ్యాక ప్రివ్యూ కూడా చూశాడాయన… అంటే హీరో ఎంపిక దగ్గర నుంచి కామెడీ పార్ట్, క్లైమాక్స్ దాకా ఎక్కడా నో కాంప్రమైజ్…
అలా తను స్వయంగా శ్రద్ధ చూపించాడు కాబట్టే ఒక మయూరి, ఒక మౌనపోరాటం, ఒక ప్రతిఘటన వంటివి వచ్చాయి… అఫ్‌కోర్స్ 1990 తరువాత తీసిన వాటిల్లో అశ్వని, నువ్వే కావాలి సినిమాలు కాస్త నయం… మూడుముక్కలాట వంటి నాసిరకం సినిమాలు కూడా ఆ బ్యానర్ కింద వచ్చినయ్… తరువాత దాగుడుమూత దండాకోర్ తీసి, పూర్తిగా చిత్రనిర్మాణానికి దండం పెట్టేశాడు రామోజీరావు… నిజానికి 2008లో నచ్చావులే సినిమాతోనే ఉషాకిరణాలు అస్తమయం దాదాపు జరిగిపోయింది…!! దాని తరువాత ఏడేళ్లకు ఈ దాగుడుమూత తీశారు, ఎందుకు తీశారో, ఎవరికోసం తీయబడిందో తెలియదు… దాంతో షట్టర్ పూర్తిగా క్లోజ్ చేసి, తాళాలు బిగించేశారు…!!
Share this Article