బతుకమ్మ పండుగ పుట్టింది ఎమ్మెల్సీ, కేసీయార్ బిడ్డ కవిత ఆలోచనల్లో నుంచి కాదు… ఒకవేళ ఏ విద్యాధికారి వికృత అత్యుత్సాహమో, స్వామిభక్తో ఆమె ఫోటోల్ని బతుకమ్మ పాఠ్యాంశాల్లో చేర్చినా జనం నవ్వుకుంటారు… బతుకమ్మ పండుగ మాత్రమే కాదు, పాటల రూపంలో ఆటల రూపంలో తెలంగాణ మహిళ కష్టసుఖాల కలబోత… వెల్లబోత..! అది శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంత మహిళల విశిష్ట సాంస్కృతిక ఉత్సవం… అంగీకరిస్తారు కదా…! కేఆర్ నాగరాజన్ అనే ఓ తమిళ వస్త్ర వ్యాపారి ఉన్నాడు… చేనేత వస్త్రాలను పలు రాష్ట్రాల్లో విక్రయిస్తుంటాడు… ఆయన ఇప్పుడు ‘ధోతీ 100’ అని ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాడు… ఆ వంద అనే అంకెలో కళ్లద్దాలను కూడా చూపిస్తూ గాంధీని స్మరిస్తున్నాడు… పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు… సందర్భం ఏమిటయ్యా అంటే… గాంధీ తన విదేశీ తరహా వస్త్రధారణను విసర్జించి, ఇక శాశ్వతంగా భారతీయ వస్త్రధారణకు చిహ్నంగా ఉన్న ధోవతిని ధరిస్తానని ప్రకటించిన రోజు కాబట్టి…! అదీ తమిళనాడులోని మధురైలో ప్రకటించబడింది కాబట్టి..!
నిజమే… దీన్ని తన వ్యాపార ప్రచారానికి అనుకూలంగా మార్చుకోవడం మంచి ఆలోచనే… తెలివైనవాడు కదా… 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా అమృత్ మహోత్సవ్ పేరిట దేశమంతా అధికారిక వేడుకలు జరుపుతున్న ప్రభుత్వానికి ఈ ఆలోచన రాలేదు… చేనేత వస్త్రాల వ్యాపారం రామరాజ్ బ్రాండ్ పేరిట చేస్తాడు కాబట్టి, ఈ సందర్భాన్ని తన సొంత ఈవెంటుగా మార్చేసుకున్నాడు నాగరాజన్… సరే, ఎవరో ఒకరు చేస్తున్నారు కదా, సంతోషం… పైగా గాంధీ స్మరణమే కాబట్టి ఎవ్వడూ అభ్యంతరపెట్టడు, చేనేత పేరుతో చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకించరు… వస్త్రపరిశ్రమకు పేరొందిన తమిళనాడు, తిరుపూర్‌లో ‘‘ధోని శతాబ్ది వేడుక’’ అని నిర్వహించాడు… అక్కడికి ధోవతి అనే వస్త్రధారణ ప్రారంభమై కేవలం శతాబ్దమే అయినట్టు…! అదీ గాంధీయే మొదలుపెట్టినట్టు..!! అవీ రామరాజ్ బ్రాండ్లతోనే ప్రారంభమైనట్టు..!!! తనే చేనేతను ఉద్దరిస్తున్నట్టు…!!!
Ads
ధోతి, ధోవతి… తమిళనాడులోనే కాదు, దేశమంతా విస్తృతంగా ఉన్న వస్త్ర సంస్కృతి… నిజానికి తమిళనాడులో అలవాటు ధోతి కాదు, పంచె… లుంగీ… అసలు సిసలు ధోతికట్టు కనిపించేది ఆంధ్రా, కర్నాటక, మరికొన్ని రాష్ట్రాలలో… గాంధీ కట్టేది కాదు, ధోతి తరహా కాదు… కొల్లాయి, గోచీ… ధోతి, గోచీ, లుంగీ… వీటి తేడా ప్రతి ఒక్కరికీ తెలుసు… పైగా ఇదే రామరాజ్ బ్రాండ్ కేవలం చేనేతను ఏమీ ఉద్దరించడం లేదు… చేనేత పేరుతో వ్యాపారం చేస్తోంది… అచ్చమైన చేనేత ఏమీ కాదు, పవర్ లూమ్స్ ఉత్పత్తులు అవి… పైగా ఈ రామరాజ్ షోరూముల్లో కేవలం ‘‘హ్యాండ్లూం’’ మాత్రమే కాదు… దీనికి ఆరు ఉప-బ్రాండ్లున్నయ్… టీషర్టులు, ప్యాంట్లు, ఇన్నర్ వేర్, సిల్క్ ధోవతులు, అంగీలు, మహిళల బట్టలు, పిల్లల దుస్తులు ప్లస్ ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న లినెన్ బట్టలు కూడా అమ్ముతారు… చేనేత అనేది ఓ ప్రచారం కోసమే… మరి మధురైలో గాంధీ ధోతి ప్రకటన సందర్భాన్ని ఈ రామరాజ్ వాడు ఎలా ఓన్ చేసుకున్నాడు..? అదే మార్కెటింగ్ టెక్నిక్…
అంతేకాదు… ఓ వార్త కనిపించింది… తిరుపూర్‌లో ధోతి శతాబ్ది వేడుకల్ని రామరాజ్ కాటన్ ఎండీ నాగరాజన్ ప్రారంభించాడట… ‘గాంధియా వాజియిల్రామ్రాజ్’ పై సాంప్రదాయ నృత్య నాటక ప్రదర్శనతోపాటు ‘‘మహాత్మవైకొండదువొమ్” అనే పుస్తకావిష్కరణ చేశాడట… ఈసందర్భంగా 100 మంది అమరవీరులు, 100 మంది నేత కార్మికులను సత్కరించారట… అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలో భాగంగా 100 మొక్కలు నాటనున్నారుట… చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ నృత్యకారుల ప్రదర్శన ప్రారంభిస్తూ నాగరాజన్ “మహాత్ముని వస్త్రధారణ ‘జాతీయ వస్త్రధారణ మరియు గుర్తింపు’ చిహ్నంగా మారిందన్నాడు. 40 వేల మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత 40 ఏళ్లుగా వారి చేనేత చక్రానికి 40 ఏళ్లుగా అండగా నిలుస్తున్నామన్నాడు… ఏం మార్కెటింగ్ తెలివిరా బాబూ… గాంధీనే కాదు, ఆ గాంధీ తాతనూ బ్రాండ్ అంబాసిడర్‌ను చేసుకోగలరు…!!
Share this Article