Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊరూ పేరూ లేని ఓ అనాథ పాత్ర… బాలయ్యకు అప్పట్లో పెద్ద హిట్…

October 22, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ….. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, రాజు మనసు మిన్న రాణి మనసు వెన్న . ఈ సూపర్ హిట్ సాంగ్ వినని తెలుగు వారు ఉండరు . 1962 లో వచ్చిన ఆత్మబంధువు సినిమా లోనిది .

యన్టీఆర్ , సావిత్రి , కన్నాంబ , యస్వీఆర్లు నటించారు . 1987 జూలైలో వచ్చిన బాలకృష్ణ నటించిన ఈ రాము సినిమా చూస్తుంటే ఆ ఆత్మబంధువు సినిమాయే గుర్తుకొస్తుంది .

ఇక్కడ మరో విశేషం ఉంది . ఆ ఆత్మబంధువు సినిమా తమిళంలో 1960 లో వచ్చిన Pedikkadha Medhai సినిమాకు రీమేక్ . ఆ తమిళ సినిమాలో కూడా కన్నాంబ , యస్వీఆర్లు నటించారు . హీరోగా శివాజీ నటించారు . ఈ తమిళ సినిమాకు మాతృక బెంగాలీ సినిమా Jog Biyog . దానికి ఆధారం ఆషా పూర్ణాదేవి వ్రాసిన నవల .

Ads

ఈ వరుస చూడండి . మొదట ఒక బెంగాలీ నవల , దాని ఆధారంగా బెంగాలీ సినిమా , దాని ఆధారంగా తమిళ సినిమా , దాని ఆధారంగా తెలుగు సినిమా . ఇదంతా ఆత్మబంధువు సినిమా వ్యవహారం . వీటన్నింటి ఆధారంగా AVM వారు తమిళంలో మరలా 1987 లో కమల్ హాసన్ , రాధిక , కె ఆర్ విజయలతో Per Sollum Pillai అనే సినిమాను తీసారు . బాగా ఆడింది .

ఈ తమిళ సినిమాకు రీమేకే అదే సంవత్సరం జూలైలో వచ్చిన ఈ రాము . బాలకృష్ణ , రజని , శారద , జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించారు . ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది రామానాయుడు గారికి .

ఈ సినిమాను నిర్మించిన ఆయనకు ఈ రాము సినిమా సూపర్ హిట్టయింది . సుమారు 30 కేంద్రాలలో వంద రోజుల బొమ్మ పడింది . సిల్వర్ జూబిలీ ఆడింది . మద్రాసు తాజ్ కోరమాండల్ హోటల్లో శత దినోత్సవ సంబరాలను జరుపుకుంది . కమల్ హాసన్ , చిరంజీవి ముఖ్య అతిధులు .

ఓ ఊరూపేరు లేని అనాధ ఓ కుటుంబాన్ని రక్షించి ఆ కుటుంబంలో సభ్యుడు అవుతాడు . ఆ ఇంటి పెద్దలయిన భార్యాభర్తలు అతన్ని స్వంత కొడుకుగా పెంచుతారు . స్వంత బిడ్డలు నలుగురూ అతన్ని అన్నయ్యగానే గౌరవిస్తూ ఉంటారు .

ఈ కుటుంబంలోకి ఓ విలన్ ఎంటరవుతాడు . ఆ ఇంటి పెద్దల్లుడు ద్వారా కుటుంబంలో చిచ్చుబెట్టి కుటుంబాన్ని చిందరవందర చేస్తాడు .ఇంటి నుండి బయటకు పంపేయబడిన రాము మళ్ళా కుటుంబాన్ని అంతా ఒక చోటికి చేరుస్తాడు . ఆ క్రమంలో విలన్ని చంపిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు రావటంతో శుభం కార్డు పడుతుంది .

తల్లదండ్రులుగా జగ్గయ్య ,శారద బాగా నటించారు . శారద పాత్ర చాలా ఎలివేటెడ్ పాత్ర . రాముగా బాలకృష్ణ బాగా నటించారు . ఇలాంటి పాత్రలు అప్పటికే ఆయనకు కొట్టిన పిండి అయిపోయింది . హీరోయినుగా రజని చాలా హుషారుగా నటించింది . విలనుగా సత్యనారాయణ , అతని కొడుకుగా బాలాజీ , వాళ్ళతో కుమ్మక్కయ్యే పెద్ద అల్లుడుగా సుధాకర్ విలన్ పాత్రల్ని బాగా పండించారు .

రామాయణంలో పిడకల వేటలాగా మెయిన్ ట్రాక్కుకు సంబంధం లేకుండా ఓ కామెడీ ట్రాక్ నడుస్తుంది . అమరశిల్పి ‌సుత్తి వేలు పాత్ర . ఆయన భార్యగా శ్రీలక్ష్మి . వీళ్ళకో పేరడీ రీమిక్స్ పాట ఉంటుంది . సినిమాకు హైలైటే . ఆ పాటలో అయిదుగురు పాపులర్ నటీమణులు డాన్సిస్తారు . జయమాలిని , రమాప్రభ , అనూరాధ , కృష్ణవేణి , మమత . బాగానే పేలింది .

ఇతర పాత్రల్లో భీమేశ్వరరావు , దీప , అనిత ,హరిబాబు , మాలాశ్రీ , హరిప్రసాద్ , జయవిజయ , ప్రభృతులు నటించారు . ఆనవాయితీగా రామానాయుడు కూడా తళుక్కుమంటారు .

బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగాల రఘువంశంలో అందాల ఒక రాముడు అంటూ సాగే టైటిల్ సాంగ్ చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . చివర్లో రిపీట్ అవుతుంది . ఓ వాన పాట హాట్ హాటుగా ఉంటుంది . వానేమి చేస్తుందిరో ఓ పిల్లగాడా అంటూ సాగుతుంది ఆ డ్యూయెట్ బాలకృష్ణ , రజనిల మీద .

అలాగే మరో డ్యూయెట్ ఒంటి గంట కొట్టు , కానీ కానీ ముందు కానీ అంటూ సాగే మరో రెండు డ్యూయెట్లు వారిద్దరి మీదనే ఉంటాయి . ఇంతకుముందే నేను చెప్పినట్లు సుత్తి వేలు పేరడీ రీమిక్స్ పాట దండాలమ్మా కోటి దండాలమ్మా ఓటున్న తల్లులకు దండాలమ్మా అంటూ హడావుడి చేసే పాటను ప్రేక్షకులు మరచిపోరు .
పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . జంధ్యాల డైలాగులను ఘట్టిగానే వ్రాసారు . దర్శకుడు వై నాగేశ్వరరావుకు ఇదే మొదటి సినిమా .

ఇప్పుడు ఈ సినిమా చూస్తే మరో సినిమా కూడా గుర్తుకొస్తుంది . అది 2006లో వచ్చిన వెంకటేష్ సినిమా లక్ష్మి . చాలా పోలికలు ఉంటాయి . యన్టీఆర్ ఇదే టైటిలుతో 1968 లో AVM బేనర్లో జమున , పుష్పలతలతో నటించారు . నేను ఈ సినిమాను మా నాన్నగారితో కలిసి చీరాలలో చూసా . థియేటర్ పేరు నాజ్ అని గుర్తు . కధలు పూర్తిగా భిన్నం అనుకోండి .

1987 లో బాలకృష్ణకు కలిసొచ్చిన సినిమాలలో ఒకటి ఈ రాము . యూట్యూబులో ఉంది . బాలకృష్ణ , శారద అభిమానులు తప్పకుండా చూడవచ్చు . It’s a romantic entertainer with family sentiment . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెహమాన్ ఆస్కార్ దొంగ..! రియల్ విన్నర్ సుఖ్వీందర్ సింగ్..! ఎలాగంటే..?!
  • అసలైన విజేత శర్వానంద్… పరాజితుడు రవితేజ… ఎందుకనగా..?
  • చిరంజీవికి సీఎం అమిత ప్రాధాన్యం… ఎవరికీ అంతుపట్టని ఓ మిస్టరీ…
  • ‘‘ఒరేయ్.., మీరెందుకురా ఆ మొగుళ్ల హత్య కేసుల్లో ఇరుక్కుంటారు..?’’
  • SIB … అరాచకాల అడ్డాగా మారిన ఆ పాలన నుంచి… మళ్లీ గాడిన పడి…
  • చాగోస్ దీవులు..! హిందూ మహాసముద్రంలో అగ్రదేశాల ఆట..!!
  • చైన్లు కాదు గానీ… అప్పట్లో మా కొట్లాటల్లో సోడా బుడ్లు పగిలేవి బాగా…
  • సరిగ్గా 30 ఏళ్లు… తెలుగు శాటిలైట్ చానెళ్ల తొలి రోజుల బాలారిష్టాలు…
  • 25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..?
  • బయట హరీష్ ప్రచారం వేరు… సిట్ అసలు విచారణ నిజాలు వేరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions