రచయిత, దర్శకుడు, నిర్మాత, మిత్రుడు Prabhakar Jaini ఫేస్ బుక్ వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… అది… ‘‘పొరపాటున కూడా, మన వెంకటేశ్, మన రానా ఉన్నాడని ఈ వెబ్ సీరీస్ చూడకండి. అలగా జనం కూడా మాట్లాడలేని, అతి హేయమైన బూతులు, ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళ ముఖాలు జన్మలో చూడకూడదన్నంత ఛండాలంగా ఉంది. అందుకే, రానా, వెంకటేశ్ లు కూడా, ఇంటర్వ్యూలలో, మా అభిమానులు ఈ వెబ్ సీరీస్ చూడకండి అని చెబుతున్నారు… ఇక మీ ఇష్టం…’’
ఏమిటి అంత నీచంగా ఉందా..? అని కాస్త చూద్దాంలే అని ఓపెన్ చేస్తే… సగం సేపు కూడా చూడలేక కట్టేయాల్సి వచ్చింది… ఇది వెంకటేష్ నటించిన 500 నిమిషాల సీరీసా..? అంతటి కెరీర్ కలిగి, ఈ వయస్సుకు వచ్చి, మహిళల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న వెంకటేష్ ఇలాంటి వెబ్ సీరీస్‌లో నటించాడా..? ఎడాపెడా బూతులు, స్కిన్ షో, వల్గర్ కంటెంట్… మొన్నమొన్ననే నేనే ఎక్కడో రాసినట్టున్నా… ‘‘వయస్సుకు తగినట్టు, భిన్నమైన కథాంశాలతో వెంకటేశ్ పరిణతిని ప్రదర్శిస్తున్నాడు’’ అని… సారీ వెంకీ… నా ప్రశంసల్ని నిర్మొహమాటంగా లెంపలేసుకుని మరీ వెనక్కి తీసుకుంటున్నా…
Ads
సరే, రానాను వదిలేయండి… నువ్వు చేయాల్సిన పాత్రేనా ఇది..? ఇన్నాళ్లూ నిన్ను అభినందించిన వాళ్లు కూడా ఛీత్కరించే ఈ పాత్రను ఎందుకు చేసినట్టు..? ఓ పనిచేయాలి వెంకీ… ఈ డప్పు సైట్ల రివ్యూలను పట్టించుకోకు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లనూ వదిలెయ్… నిష్పక్షపాతంగా సర్వే చేసి, ఈ పాత్ర మీద తమ అభిప్రాయాల్ని చెప్పాల్సిందిగా తెలుగు ప్రేక్షకులను కోరాలి… అప్పుడు అర్థం కావచ్చు బహుశా, ఈ పాత్ర ఎంచుకుని ఎంత తప్పు చేశావో… అసలు ఫ్యామిలీతో కలిసి ఎవరైనా ఈ రత్నాన్ని చూడగలరా..?
మామూలుగా భారీ పాన్ ఇండియా సినిమాల్ని సైతం తెలుగులో తీసి, హిందీలోకి డబ్ చేస్తారు… కానీ ఇదేమిటో హిందీలో తీసి, తెలుగులోకి డబ్ చేసినట్టుగా కనిపిస్తోంది… రానాకు బాలీవుడ్ మార్కెట్ కావాలంటే థియేటర్ సినిమాలు తీయాలి తప్ప ఈ వెబ్ సీరీస్‌తో ఒరిగేదేముంది..? సరే, కొద్దిసేపు చూస్తే అర్థమైందేమిటంటే..? (కష్టమ్మీద) జైలుకు వెళ్లి వచ్చిన ఓ తండ్రి, ఆయన్ని ద్వేషించే కొడుకు… దానికి కారణాలు గట్రా చెప్పేదే ఈ సీరీస్…
స్టార్ మాటీవీ, జీతెలుగు సీరియల్స్ కొన్ని నయం… వెంకీ, రానా ఉన్నాడని అందరూ కాస్త పాలిష్ట్ రివ్యూలు రాస్తారు కావచ్చు… వేరే నటులైతే ఇప్పటికే ఏకిపారేసేవాళ్లు… ఏం మొహమాటం లేకుండా…!! ఇది రే డొనోవన్ అనే ఓ ఆంగ్ల సీరీస్‌కు అధికారిక రీమేక్ అట… ఏ టీవీ సీరియల్ కథారచయితను అడిగినా ఇంకాస్త మంచి కథను రాసి ఇచ్చేవాళ్లు… చవుక ఖర్చుతో… (ఓ ప్రమాద హెచ్చరిక రాశాడు ఓ సైటువాడు… దీనికి రెండో సీజన్ కూడా వచ్చే అవకాశముందట… హతవిధీ)
‘‘నీవు పుట్టిన తర్వాత నేను ఐదేండ్లు ముడ్డి కడిగాను. అక్కడ నీకు ఎంత మగతనం ఉంటుందో.. ఎంత చెడు ఉంటుందో నాకు తెలుసు’’ ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా… వెంకీకి రాసిన డైలాగ్స్ ఎలా ఉన్నాయో చెప్పడానికి… ఇలాంటి బోెలెడు… అదీ సగం ఎపిసోడ్లలోనే… ఇంకా నేను చూడని ఎపిసోడ్లలో ఏమున్నాయో… దేవుడా… వెంకటేష్‌ను ఈ వయస్సులో ఎందుకిలా తయారు చేశావు… 62 ఏళ్లు… ఫాఫం…!! చివరగా… రానా, నీ టేస్టుకు పెద్ద దండం బాబూ…!! చివరగా :: ఈ మొత్తం సీరీస్ చూడగలిగిన మీ సహనానికి జోహార్లు Prabhakar Jaini ….
Share this Article