రంగమార్తాండ గురించిన రివ్యూలు తగ్గిపోయాయి కదా… చాలామంది మేధావులు చాలా రాశారు కదా… కానీ ఇక ఇప్పుడు చెప్పుకుందాం, కృష్ణవంశీ ఈ సినిమాలో పాత్రల కేరక్టరైజేషన్ గురించి అసలు ఆలోచించాడా..? ఈ సినిమాను నిర్మించినవాళ్లకు తమ సినిమాల్లోని పాత్ర తత్వాలు, కథనాల్లో అవి ఒదిగిన తీరు ఏమైనా తెలుసా…? కేవలం డబ్బు పెట్టడం, అమ్ముకోవడం, లాభాలో- నష్టాలో లెక్కేసుకోవడం… అంతేనా..?
నిజానికి కృష్ణవంశీ తను చెప్పదలుచుకున్న అంశాన్నే సూటిగా, బలంగా చెప్పలేకపోయాడు… దానికి కారణం పాత్రల స్వభావంలోని అస్పష్టత, సందిగ్ధత… మీరు చూసిన సినిమా కథను మరోసారి గుర్తుచేసుకొండి… పెద్దలే ప్రతి చిన్న అంశానికి అతిగా రియాక్టయిన తీరు గమనించారా లేదా..?
అసలు ఒక రంగస్థల నటుడు తన నటనకు రిటైర్‌మెంట్ ప్రకటించడం ఏమిటి…? అది తప్పుడు నిర్ణయం… భార్యకి ఏమీ చెప్పకుండా తన ఆస్తిని పిల్లలకు రాసేయడం మరో తప్పుడు నిర్ణయం… సరే, రాసేశాడు, ఇక వదిలేయాలి, తరువాత వాళ్ల నిర్ణయాలకు వాళ్లను వదలేయకుండా…. ప్రతి ఇష్యూలోనూ, వాళ్ల ఇష్టానికి, ఆలోచనలకు వ్యతిరేకంగా, భిన్నంగా తన ఉద్వేగాల్ని రుద్దుతూ ఉంటాడు… మరొకటి గమనించండి… ఎక్కడా పిల్లల ప్రకాష్ రాజ్ దంపతుల పట్ల క్రూరంగా, దుర్మార్గంగా ఏమీ వ్యవహరించలేదు… వీళ్లే ‘ఎటమటం’ బ్యాచ్…
Ads
ఆరోగ్యం కోసం డైటీషియన్ సూచనలు పాటించండీ అంటున్నా సరే తప్పేనా..? ఎప్పుడూ తాగడమే పని… ఇల్లు ఉన్న స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇచ్చి, చెరో ఫ్లాటులో ఎదురెదురుగా ఉందామనేది కోడలి సూచన… మంచికైనా చెడుకైనా ఇద్దరికీ మంచిదే… కానీ అంగీకరించడు… పైగా కొడుకు కోడలు నిద్రపోతున్నారనే సోయి కూడా లేకుండా పొద్దున్నే డ్రామా పద్యాలెత్తుకుంటారు ఇద్దరు దోస్తులు…
ఇక్కడా మర్యాదగా, గౌరవంగానే తమ ఇబ్బందేమిటో చెబుతాడు ఆ పిల్లవాడు… పెద్ద పెద్ద నిర్మాతలు, కోటీశ్వరులు వచ్చి ఏదో చర్చిస్తుంటే, చొక్కా కూడా లేకుండా నడుమ దూరిపోయి ఏదో మాట్లాడబోతాడు… అవసరమా అది..? పార్టీల్లో ఫూటుగా తాగేసి, వయస్సు కూడా మరిచి డాన్సులు చేస్తుంటే, కిందపడిపోకుండా పిల్లలు, పెళ్లాం అపసోపాలు పడి తీసుకొస్తారు ఇంటికి… కూతురు ఏదో అంటుంది… దాంతో నీ బిడ్డ నిన్ను దొంగ అంటోందయ్యో అని రమ్యకృష్ణ గగ్గోలు… తన కూతురే కదా, దానికి బిడ్డ బతిమిలాడుతున్నా సరే మూటాముల్లే సర్దుకుని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటపడతారు… అమ్మను, నాన్నను బిడ్డ ఒక మాట అనకూడదా..? అంటే అమ్మా అయ్యా పడకూడదా..? వదిలేసి వెళ్లిపోవాలా..?
‘‘ఈ రాత్రి గడవడం కష్టమని డాక్టర్ చెప్పాడ్రా’’ అని ప్రకాష్ రాజ్ తన దోస్త్ బ్రహ్మానందానికి చెప్పడం కరెక్టు కాదు… డాక్టర్లు చెప్పినా సరే… తరువాత ‘‘నీ చేతిలో కన్ను మూయాలని ఉందిరా’’ అనడం మరింత అసహజంగా ఉంది… ప్రకాష్ రాజ్ తన స్వహస్తాలతో నిద్రగోళీలు కలిపి ఇవ్వడం మరీ అబ్సర్డ్… అది హత్య… మరి కృష్ణవంశీ ఆ సీనుకు ఏ ఔచిత్యాన్ని చెబుతాడో తెలియదు కానీ… ఉత్త బేకార్ సీన్ అది…
చివరకు భార్య చనిపోతే పిల్లలకు సమాచారం ఇవ్వకపోవడం ప్రకాష్ రాజ్ కేరక్టరైజేషన్‌లోని మరో ఘోరమైన లోపం… వేరే పిచ్చి సినిమాల గురించైతే ఆఫ్టరాల్ ఓ కేరక్టర్ గురించి ఇంత సీరియస్ చర్చ అనవసరం… కానీ చాలామందితో ఆహాలు, ఓహోలు కొట్టించబడుతున్న కేరక్టర్ గనుక చెప్పుకోవాల్సి వస్తోంది…!! (ఫేస్‌బుక్‌లో ఓ మిత్రుడి పోస్టులో కొంత భాగం తీసుకుని, కాస్త వాల్యూ యాడిషన్ చేయబడిన పోస్టు ఇది….)
Share this Article