మెగా కుటుంబ శిబిరం… అది హీరోల ఫ్యాక్టరీ… ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాపులు అనే లెక్కేమీ ఉండదు… సినిమాలు వస్తూనే ఉంటాయి… తెలుగు ఇండస్ట్రీని తరతరాలుగా శాసించిన ఓ సామాజికవర్గ పెత్తనాన్ని పెకిలించేస్తోంది ఈ మెగా శిబిరం… అందుకే ఆ క్యాంపులో ఏది జరిగినా అది వార్తే… కుటుంబ వ్యహారాలు గానీ, సినిమాలు గానీ… వ్యక్తిగతాలు గానీ…
ఆ శిబిరంలోనే వేర్వేరు కుంపట్లు… అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా హీరోగా బాగా ఎదిగిపోయాక అల్లు అరవింద్ కిచెన్ ఘుమఘుమలాడుతోంది… అఫ్‌కోర్స్, అల్లు శిరీష్ పంచాయితీ, ఫెయిల్యూర్లు అరవింద్ పంటికింద రాయి అంటుంటారు… ఇక రాంచరణ్ కిచెన్ వేరే… పవన్ కల్యాణ్ రూటే సపరేటు… మరోవైపు చిరంజీవి మేనల్లుళ్లది విడిగా సొంత పోరాటం…
పంజా వైష్ణవ్ తేజ్… ఆ శిబిరం ఉత్పత్తే కాబట్టి… ఓ బలమైన నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి… తన సినిమా జయాపజయాల మీద ఆసక్తి ఉంటుంది… తన పూర్వరంగ, పరిచయ ప్రస్తావన కూడా ఉంటుంది… ఇప్పుడు తనది ఓ కొత్త సినిమా విడుదలైంది… పేరు ‘రంగరంగవైభవంగా’… పేరు బాగుంది… ట్రెయిలర్లు బాగానే కట్ చేశారు…
Ads
రెండేళ్ల క్రితం ఉప్పెన అనే సినిమాలో హీరోగా రంగప్రవేశం చేశాడు… తొలి సినిమాలోనే అది ‘‘కోసేయించుకున్న’’ గట్స్‌కు ఇండస్ట్రీ వర్గాలు అబ్బురపడ్డాయి… ఏదో పనికిమాలిన మాస్ లక్షణాలతో లాంచ్ కావడానికి ప్రయత్నించకుండా ఓ ప్రయోగం ఎంచుకుని నిలబడ్డందుకు అభినందనలు కూడా దక్కాయి… కాస్త భిన్నమైన కథ, ప్రజెంటేషన్లతో సినిమా హిట్… అఫ్‌కోర్స్, కొత్త పిల్ల కృతిశెట్టి కూడా ఓ ప్లస్సే…
తరువాత రెండో సినిమా కొండపొలం… క్రిష్ దర్శకుడు కావడంతో అందరి దృష్టీ దాని మీద పడింది… కొత్త హీరోయిన్ గాకుండా రకుల్‌ప్రీత్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు… భిన్నమైన కథ… చాన్నాళ్ల తరువాత ఓ నవలాచిత్రం… కానీ సినిమా పెద్దగా ఆడలేదు, ప్రేక్షకుడికి బలంగా ఎక్కలేదు… వైష్ణవ్ తేజ్ ఈ దశలోనే జాగ్రత్తగా అడుగులు వేయాలి… కానీ వేయలేదు…
ఓ సాదాసీదా కథకు వోకే అన్నాడు… అర్జునరెడ్డి సినిమాకు పనిచేసిన గిరీశయ్య దర్శకుడు… మరో అందగత్తె కేతికశర్మ హీరోయిన్, దేవిశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు… స్థూలంగా చూస్తే వోకే… తీరా సినిమా చూస్తే ఢమాల్… ఫస్టాఫ్ ఏదో కాస్త అటూఇటూ దర్శకుడు తిప్పలుపడ్డాడు, కానీ సెకండాఫ్ తన్నేసింది… వెరసి మరో తెలుగు సినిమా కథ ఒడిశింది… చిన్నప్పటి స్నేహితులు, మెడికోలు, తరువాత ప్రేమికులు, చిన్న చిన్న ఇగోలు, సమస్యలు… ఏదో పాత పచ్చడి… కొత్త సీసా… పోనీ, కొత్తసీసాలో పాతసారా… ఏ ఒక్క సీనూ ఇంప్రెసివగా లేకపోవడమే ఈ సినిమా విశేషం…
నిజంగా డీఎస్పీలో సరుకు అయిపోయిందా.?. ప్చ్, ప్రతి సినిమాకు నిరాశపరుస్తున్నాడు… ఇక సినిమాలోనూ ఎక్కడా దర్శకత్వపు మెరుపులు, చమక్కులు లేవు… పెద్ద పెద్ద తోపులు అనుకున్న సినిమాలే థియేటర్ల వద్ద తోకపటాకుల్లాగా టప్‌మంటున్నయ్… అలాంటప్పుడు వర్ధమాన హీరోలు ఎంత జాగ్రత్తగా ఉండాలి..? ఆ సోయే లేనట్టు అనిపించింది వైష్ణవ్‌కు..!
ఏమాటకామాట… ఈ సినిమాలో సగటు తెలుగు హీరో మార్క్ ఢాంఢూండిస్కు అవలక్షణాలు ఏమీలేవు, అశ్లీలం వాసనలు కూడా లేవు… హీరోహీరోయిన్లు అందమైన జంటల… సినిమా ప్లెయిన్ అండ్ ఫెయిర్… అవునూ, దీని ప్రిరిలీజ్‌కు నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్, వైష్ణవ్ అన్నయ్య సాయిధరమ్‌తేజ్ వచ్చారు, కానీ అల్లు, చిరు కుటుంబాల నుంచి ఎవరూ కనిపించలేదు… కారణమేంటో.. !! ((యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా))
Share this Article