.
Chakradhar Rao
…… కళ్ళముందు స్కూటర్లన్నీ కార్లు అయ్యాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీ అయ్యి ఆపై ఫ్లాట్ టీవీ.. హోమ్ థియేటర్స్ అయిపోయింది.
ఒక మూలకు ట్రింగ్ మనే ఫోను ప్రతి వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. క్యాలిక్యులేటర్లు… రేడియోలు, టేప్ రికార్డర్లు, వాక్మన్లు, కెమెరాలు, దుకాణాలు, హోటల్స్, గుళ్లలో ఆర్జిత సేవలు అన్నీ మొబైల్ ఫోన్లో ఇమిడిపోయాయి. వేళ్లతోనే ప్రపంచాన్ని చూడగలగటం …
Ads
వెళ్లాలనుకుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలగటం, ప్రపంచంలో ఏమూలలో ఉన్న మనిషినైనా చూడటం, మాట్లాడటం జరిగిపోతోంది. చూస్తుండగానే కొత్త దేవుళ్ళు వెలిశారు. సాయిబాబాలు అందరి దేవుడు అయిపోయాడు.
పల్లెల్లో వాళ్ళు టౌన్ లోకి … ఊళ్ళోవాళ్ళు పట్టణాల్లోకి … పట్టణాల్లో వాళ్ళు అమెరికా లాంటి దేశాలకి జంప్ అయిపోతున్నారు. పచ్చడి, పచ్చిపులుసు ఉంటే చాలు అనుకునే జీవితాలు స్విగ్గిలో ఇటాలియన్ మెక్సికన్ కాంటినెంటల్ అంటూ వేళ్ళ కదలికలతో వంటలు టేబుల్ మీద వాలుతున్నాయి. దేశ విదేశాలా రుచులన్నీ మన నాలికకి అంటుకుంటున్నాయి.
అరటిపండు చూస్తే ఆశ పుట్టే పిల్లలు ఇప్పుడు దాన్ని చూడగానే అసహ్యించుకుంటున్నారు. జంక్ ఫుడ్ కి బానిసలై పోయారు. మధ్యతరగతి లోనూ ‘మందు’ ఏరులైపారుతోంది. నెలకు ఓసారి చికెను మటన్ అనే వాళ్ళంతా వారంలో నాలుగు సార్లు తింటున్నారు… ముక్క లేనిది ముద్ద దిగదు అంటున్నారు.
10 పాస్ అవడం గగనం అనుకునే పరిస్థితి నుంచి డిగ్రీలు పీజీలు అవలీలగా పాసై సర్టిఫికెట్లు పక్కన పడేస్తున్నారు. వందల రూపాయల జీతం నుంచి లక్షల రూపాయల జీతం వరకు వచ్చేసారు. చెయ్యాలనుకునే వాళ్ళకి పనికి ప్రాబ్లం లేదు. పని చేసే వాడికి డబ్బు కొదవలేదు.
ఇదివరకు డబ్బు ఉంటే ఏం తోచక పేకాడేవాళ్ళు. అంతకంటే ఏం చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు డబ్బు ఉంటే విందులు వినోదాలకి … మందు విందు చిందు పొందు అనుభవించడానికి లెక్కలేనన్ని దారులు. కొందరు డబ్బు అడ్డదారుల్లో సంపాదించాలని బెట్టింగులు డ్రగ్స్ పెడలింగ్లు అంటూ చావు కొని తెచుకుంటున్నారు.
ఆస్తికుడైనా నాస్తికుడైనా ఆస్తి ఉంటేనే జీవితం అనే కాడికి వచ్చింది. డబ్బు లేనోడు మనిషిగా గుర్తింపు కోల్పోతున్నారు. డబ్బు లేకుండా ఏదైన విలువ, ఆనందం గురించి మాట్లాడినా ముందు డబ్బు సంపాదించి బాగా బతుకు తర్వాత మాట్లాడదాం అంటున్నారు.
అందుకే బాబాలు, స్వాములు ఎడా పెడా డబ్బు సంపాదిస్తున్నారు. అద్బుతంగా ఆశ్రమాలు కట్టుకు బతుకుతున్నారు.. నీతులు చెపుతూనే గోతులు తవ్వుతున్నారు. విరాళం పేరుతో బిచ్చం ఎత్తుకుంటున్నారు.
పిల్లల ఆటలన్నీ మొబైల్ లోకి,, కంపూటర్ లోకి వచ్చేశాయి.
అన్నప్రాసనకే ఆవకాయ తినిపించినట్టు.. టివిలు, మొబైల్స్ పిల్లలకి వద్దనుకున్నవి అన్నీ చూపించేస్తున్నాయి. పెద్దలన్నా, టీచర్లన్నా పిల్లలకి గౌరవం పోయింది. పిల్లలని కొడితే ఎక్కడ ఆత్మహత్య చేసుకు చస్తారో అని తలిదండ్రులు, టీచర్లు హడలి చస్తున్నారు.
ఎవరి ధైర్యం కొద్దీ వాళ్ళు చాటింగులు.. డేటింగులు… మేటింగులు చేస్తున్నారు. ప్రేమికుల మధ్య కథలు .. కథలు కథలుగా నడుస్తున్నాయి… కొన్నాళ్లకే వ్యథలై పోతున్నాయి. ప్రేమ, బ్రేక్ అప్ వెబ్ సిరీస్ సీజన్స్ లాగా ఎడతెగకుండా నడుస్తోంది. ప్రేమ సినిమాలు, పార్కుల నించి హోటల్ రూముకి పాకింది.
పెళ్లికి ముందు, తరవాత పెళ్లికి బయట అఫైర్స్ కి అలవాటు అయ్యారు. కొందరు ఇంకొంచం ముందుకెళ్ళి తమ ఇంటిమేట్ సీన్స్ అన్ని వీడియో తీసుకొని చేజేతులా జీవితాన్ని పక్కోడికి అప్పగిస్తున్నారు. అవి ఎవడి చేతిలోనో పది ఇంటర్నెట్లో ఎక్కుతున్నాయి.
ఇహ పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళు… తర్వాత విడాకులకోసం లాయర్ల చుట్టూ చక్కర్లు. రెండేళ్ళు కలిసి బతికితే ప్రేమ సంగతి తరవాత ఒకరికి ఒకరు పరమ బోర్ కొట్టేస్తున్నారు. ఊరి నిండా పిజి హాస్టల్స్ వెలుస్తున్నాయి. ఒంటి కాపురం సమ్మగా ఉంటోంది అందరికి.. దాంట్లో కావలసినంత స్వేఛ్చ దొరికేస్తోంది. కొన్నేళ్ళు పోతే రోబోలు లైఫ్ పార్టనర్స్ అవుతాయి సిలికాన్ అంగాలేసుకొని !
క్రయిం తన పోకడ మార్చుకొని సైబర్ క్రయింగా అవతారం ఎత్తింది. ఇంత రక్షణ వ్యవస్థ ఉన్నా అంత క్రైమ్ ఎందుకు జరుగుతోందో అర్థం కావటం లేదు. చట్టాలన్నీ పురాణా జమానాలోనే నడుస్తున్నాయి.. మర్డర్లూ.. మానభంగాలు చేసినోడికి అత్తెసరు ఫైన్ వేస్తున్నారు. అది బాధిత కుటుంబాలకి టాయిలెట్ పేపర్ కి కూడా రాదని చట్టాలకు తెలియటం లేదు.
నాయకులు ఉచిత పథకాల సాక్షిగా డబ్బును దోచేస్తున్నారు. ప్రజాసేవ అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేయడం అన్నట్టు అయిపోయింది. కంపాశన్ లేని దద్దమ్మ గాళ్లు అందలం ఎక్కుతున్నారు .. అదేపనిగా దండుకుంటున్నారు.
తెలుగు సినిమాల్లో పక్క రాష్ట్రాల విద్వత్తే రాజ్యం ఏలుతోంది. తమ సినిమా మీద నమ్మకం లేని స్టార్ట్స్ ప్రభుత్వం అండగా తమ అభిమానుల్ని బెనిఫిట్ షోల పేరుతో దోచేస్తున్నారు. కళని.. విలువని కాలరాసి
వందలు వేల కోట్లే పరమావధిగా సినిమా దిశ మార్చుకుంది. కళామతల్లి విలువల వలువలుగా చింపుకొని అమ్ముకుంటున్నారు.
అవకాశం రాని తెలుగు సినీ టాలెంట్ రీల్స్ చేసుకు బతుకుతున్నారు. బిజినెస్ మాగ్నట్లు మినీ క్రికెట్ మ్యాచ్లు ఆడించి వేల కోట్లు గడిస్తున్నారు. జనం సొమ్ము కాజేసేందుకే IIT.. IIM .. బిజినెస్ స్కూల్స్ కృషి చేస్తున్నాయి.
Information explosion కి తోడు AI వచ్చింది.. ఇంక మంచి 2 రెట్లు .. దారుణాలు 20 రెట్లు అవుతాయి.. హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతాయి.
ఇదంతా సాంకేతిక ఇచ్చిన అభివృద్ధి. గ్లోబలైజేషన్ యొక్క ప్రవాహం.. అందులో పడి కొట్టుకుపోకుండా బతికి బట్టకట్టడం సగటుమనిషి బస్ కి బాత్ నహీ !!
Share this Article