సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదించే కొంత మంది లాయర్ల ఫీజులు చూస్తే కళ్లు తిరిగిపోవడం ఖాయం. గంటకు ఇంత అంటూ తీసుకొని వాదించే లాయర్లు కూడా ఉన్నారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ కోసం వాదించడానికి వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా అనే అడ్వొకేట్ గురించి అనేక కథనాలు మీడియాలో వచ్చేవి. రోజుకు కోటిన్నర తీసుకుంటాడని.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, 5 స్టార్ హోటల్ బస ఏర్పాటు చేశారని అనేక మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. నిజమే.. చాలా మంది లాయర్లు చార్టెడ్ ఫ్లైట్‌లలో వెళ్లి వాదనలు వినిపించి వస్తారు. ఇప్పుడు హై ఫ్రొఫైల్ కేసు ఒక్కటి దొరికితే చాలు.. డబ్బే డబ్బు.
కానీ ఒక అరవై, డైబ్బై ఏళ్ల క్రితం కూడా ఒక లాయర్ ఇలాగే విమానంలో వెళ్లి కేసులు వాదించి వచ్చేవాడని తెలుసా? అది కూడా తనకు ఉన్న సొంత టూ సీటర్ (ఎల్5 మోడల్) ప్లేన్‌లో పట్నా నుంచి ఢిల్లీ, రాంచి, లక్నో వంటి ప్రాంతాలకు వెళ్లి తన క్లయింట్స్ తరపున వాదించి వచ్చేవాడు. ఢిల్లీలో వాదించడానికి పాట్నా నుంచి బయలు దేరాడంటే.. లక్నో విమానాశ్రయంలో ఒక సారి ఆగి, ఇంధనం నింపుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టులో తన చిన్న విమానాన్ని పార్క్ చేసేవాడు. అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించి.. తిరిగి పాట్నాకు వెళ్లిపోయేవాడు. ఆయన పేరే అక్బర్ ఇమామ్.
పట్నాకు చెందిన జస్టిస్ జాఫర్ ఇమామ్ సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా పని చేశారు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా కూడా ప్రమోట్ అవ్వాల్సిన వ్యక్తి. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ఆ పదవిని చేపట్టలేదు. జస్టిస్ జాఫర్ ఇమామ్ స్థానంలో జస్టిస్ పీబీ. గజేంద్ర గడ్కర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆ జాఫర్ ఇమామ్ కుమారుడే అక్బర్ ఇమామ్. లండన్‌లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత.. పట్నాలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే మంచి బారిస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల వారు అతడిని తమ తరపున వాదించమని కోరేవారు.
Ads
అలా పట్నా నుంచి ఢిల్లీతో పాటు బీహార్‌లోని జిల్లా కోర్టులకు కూడా తన చిన్న విమానంలోనే వెళ్లి వాదించేవాడు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనపడితే అక్కడ ప్లేన్ ల్యాండ్ చేసేవాడని అతని గురించి తెలిసిన వారు చెప్తున్నారు. టూ సీటర్ విమానంలో తనతో పాటు తన సీనియర్ సెక్రటరీ, లేదంటే జూనియర్ సెక్రటరీని వెంటబెట్టుకొని వెళ్లేవాడు.
పెద్ద బారిస్టర్, ప్లేన్‌లో వెళ్లి మరీ వాదిస్తున్నాడంటే అతని క్లయింట్స్ అందరూ బడా బడా వ్యక్తులు అని మీరు అనుకుంటారేమో. కానే కాదు. అతను ప్లేన్‌లో ఎయిర్‌పోర్టులో దిగినా.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు, ఇతర కోర్టులకు వెళ్లడానికి కనీసం రిక్షా చార్జీలు కూడా ఇవ్వలేని పేదలే క్లయింట్లుగా ఉండేవారు. చాలా సార్లు ఎయిర్‌పోర్టు నుంచి సైకిల్ మీద అతడిని ఎక్కించుకొని కోర్టుకు తీసుకొని వెళ్లేవారంటా. సొంతగా విమానంలో ఇంధనం పోయించుకొని వెళ్లి మరీ వాదించేవాడంటా.
మరోవైపు గంగా నది ఒడ్డున ఈయనకు సొంతగా ఒక బోట్ కూడా ఉండేది. దానిలో కూడా తరచూ వారణాసి, అలహాబాద్ వంటి ప్రాంతాలకు బోట్‌లో వెళ్లేవాడు. బారిస్టర్ వృత్తిలో పెద్దగా సంపాదించకపోయినా.. చాలా డిసిప్లెయిన్డ్‌గా ఉండేవాడని.. తాతలు, తండ్రుల ఆస్తులను కాపాడుకొని.. వైభోగంగా బతికాడని చెబుతుంటారు. [Inputs : Desi Kanoon, Live Law] భాయ్‌జాన్…. John Kora
Share this Article