ఒక ఫోటో అపురూపం అనిపించింది… ఈరోజుల్లో అది అరుదు… అసలు కాలేజీలు, స్కూళ్ల అల్యుమని, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగులు ఆర్గనైజ్ చేయడానికే నానా పాట్లు పడాలి… ముగ్గురో నలుగురో అందరి అడ్రస్సులు సేకరించి, మాట్లాడి, మీటింగుకు రమ్మని ఒప్పించి, భోజన ఏర్పాట్లు చేస్తే 50 నుంచి 60 శాతం మంది వస్తారు… సరే, అదొక సంబరం… మన యాంత్రిక జీవనాల్లో పెద్ద రిలాక్స్, ఆత్మానందం…
అలాంటిది ఒకే నెత్తురు… పది మంది తోబుట్టువుల కుటుంబాలు, వాళ్ల వారసులు మొత్తం 485 మంది ఒకేచోట కలిస్తే… ఓహ్, ఎంత అపూర్వం… అసలు ఎంత ప్లానింగ్ కావాలి..? ఎంత అంకితభావంతో ఆర్గనైజ్ చేయాలి… వచ్చేవాళ్లు వస్తారు, హాయిగా ఒక లైఫ్ టైమ్ మెమొరీని పదిలంగా దాచుకుని వెళ్లిపోతారు… కానీ వాళ్లందరినీ రప్పించడం అనేది చిన్న టాస్క్ కాదు… అది వరంగల్ జిల్లా, కాజీపేట దగ్గర రాంపూర్‌లో సాకారమైంది…
Ads
దీనికి ఎవరో ఒకరు పూనుకోవాలి… దీనికి తంగళ్లపల్లి హర్షవర్ధన్ ముందుకొచ్చాడు… ముందుగా పది వంశవృక్షాలు ప్రిపేర్ చేశాడు… ఒక్క పేరూ మిస్ గాకుండా రాశాడు… నంబర్లు కూడా… ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారనే వివరాలు… అది చిన్న టాస్కేమీ కాదు… ఎక్కడ పొరపాటు దొర్లినా తప్పులు తీస్తారు… బదనాం చేస్తారు… అందుకే ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ… ఒక గ్రూపు ఫామ్ చేశాడు… అందరినీ ‘కలుద్దామా’ అని అడిగాడు… అంతకుమించిన భాగ్యం ఏముంటుంది..? అందరూ సై అన్నారు…
అయిదో తరం వరకూ డిటెయిల్స్ తీసుకున్నారు… హర్షకు సొంతంగా రిసార్ట్స్ ఉంది…. డేట్ ఫిక్స్ చేశారు… ఎవరిని ఎవరు తీసుకురావాలో బాధ్యతలు పెట్టారు… హన్మకొండ, హుస్నాబాద్, కరీంనగర్, జమ్మికుంట, హైదరాబాద్ తదితర ప్రాంతాలు సహా అబ్రాడ్‌లో కొందరు… చాలామంది వ్యాపారాల్లో ఉన్నవాళ్లే… కొందరు టీచర్లు… రకరకాల వృత్తులు… కాజీపేట వరకూ రైళ్లు… బస్సులైతే హన్మకొండ… సంకల్పం ఉంటే అక్కడ చేరడం ఈజీయే… అలా వచ్చి చేరారు…
పది గ్రూపులకూ పది డ్రెస్ కోడ్స్… ముందే చెప్పారు… ఇందులో పంచాయితీలు రావద్దని ఎవరికి ఏ కలర్ డ్రెస్సో లాటరీ తీశారు… ఇలా ప్రతిదీ జాగ్రత్తగా ప్లాన్ చేశారు… బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్… అందరూ వేదిక ఎక్కాలి… తాము ఎవరిమో, ఎవరికి ఏం అవుతామో చెప్పుకోవాలి… మధ్యమధ్య గేమ్స్… లంచ్ కూడా ఏదో అల్లాటప్పా కాదు, పచ్చళ్లు, పచ్చిపులుసు దగ్గర నుంచి తెలిసిన సంప్రదాయ వంటకాలన్నీ…చెప్పనే లేదు కదూ… వీళ్లు చందా కిష్టయ్య, సుందరవ్వ దంపతుల వంశజులన్నమాట… ‘ఇంత మంది ఆత్మబంధువులను ఒకేచోట కలుసుకోవడం, ముచ్చట్లు కలబోసుకోవడం అపూర్వంగా ఉంది సార్, మాటల్లో చెప్పలేం’’ అని ఆనందపడిపోయాడు ఆ భేటీకి వెళ్లిన గందే నాగేశ్వరరావు ‘ముచ్చట’తో…
Share this Article