మీకు గుర్తుందా… చాలా రోజులైంది… రాయల్ వశిష్ట అనే పేరున్న ఓ బోటు (పాపికొండల బోట్..?) గోదావరిలో మునిగిపోతే… స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం సంయుక్తంగా రోజుల తరబడి ఆ బోటును వెలికి తీయడానికి ప్రయత్నించాయి… అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నేవీ సాయం తీసుకున్నాయి… ఐనా సరే…
సక్సెస్ కాలేదు… అప్పుడు అందరికీ తట్టిన పేరు ధర్మాడి సత్యం… ఎవరు అతను..? ఏం చదివాడు..? ఎందులో పనిచేస్తాడు..? ఏం చదివాడో ఎవరికీ తెలియదు, అవసరం లేదు… ఎందులోనూ పనిచేయడు… ఎక్కడైనా ఇలా బోట్లు మునిగిపోతే తన సొంత తెలివితేటలు, టీంతో వెలికితీస్తాడు… అపారమైన అనుభవం ఉంది తనకు… బోటును బయటికి ఎలా లాగాలో తనకంటూ కొన్ని వ్యూహాలుంటయ్… అదే ప్రయోగించాడు…
బోటు బయటికి వచ్చింది… అందరూ ఆశ్చర్యపోయారు… అంత టెక్నికల్ టీమ్స్‌తో కానిది సత్యంతో పని త్వరగా పూర్తికావడం ఎలా సాధ్యమో ఎవరికీ అంతుపట్టలేదు… కొన్నాళ్లు సత్యం పేరు మీడియాలో మారుమోగింది… (ఇప్పుడు తను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు… మీడియా పట్టించుకోదు…)
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పది అందుబాటులోకి వస్తున్నా సరే, దాన్ని సమర్థంగా వినియోగించుకునే తెలివి, అనుభవం అవసరం… ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిపోయి చాలామంది కూలీలు అందులో చిక్కుకున్న సంగతి తెలుసు కదా… దీనిపైనా కమ్యూనిస్టులు మోడీని తిడుతున్నారు, సరే, వాళ్లను అలా పక్కన పెట్టేస్తే… ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ విశ్వప్రయత్నం చేస్తున్నాయి…
వాళ్లను కించపరచాల్సిన పనిలేదు… ఏవేవో అడ్డంకులు వస్తున్నాయి… రెండుమూడు ప్రత్యామ్నాయాల్లో పనిచేస్తున్నారు… వాళ్లంతా బతికే ఉన్నారు… ఎండోస్కోపీ పద్ధతిలో వాళ్లతో మాట్లాడుతున్నారు కూడా… నిన్న మొన్న వార్తలు వచ్చాయి, అనుకోని అడ్డంకులు ఏర్పడి మరికొన్ని వారాలు పట్టేట్టుంది, నిలువుగా గుట్ట పైనుంచి సొరంగం తవ్వబోతున్నారు అని…
ఈలోపు మరో వార్త కనిపించింది… రాత్రికల్లా కుటుంబసభ్యులను బట్టలతో అక్కడికి రమ్మన్నారని, రాత్రికల్లా బయటికి తీసుకొస్తారనీ, అంబులెన్సులు, దగ్గరలో 40 పడకల ఆసుపత్రి రెడీగా ఉంచారని ఆ వార్త… సరిగ్గా మరో వార్త ఆసక్తికరంగా అనిపించింది…
41 మంది కూలీలు చిక్కుకున్న ఆ సొరంగం నుంచి వాళ్లను బయటికి తీసుకురావడానికి నిపుణులు అక్కడి ర్యాట్ మైనర్స్ సాయం తీసుకుంటున్నారనీ, అందుకే త్వరగా ఆ కూలీలు బయటికి రాబోెతున్నారని…! వాళ్లతో ఒడుపుగా ఓ చిన్న సొరంగం తవ్వించి, అందులో నుంచి కూలీలను బయటికి తీసుకొస్తారట… ర్యాట్ మైనింగ్ హోల్స్… వావ్…
ర్యాట్ మైనింగ్ అంటే… ఎలుకల్లాగా బొరియెలు తవ్వడం… కోల్ మైన్స్‌లో ఇలా బొరియెలు తవ్వి బొగ్గును తీసేవారట… తరువాత ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు… ఇప్పుడు అదే దిక్కయింది… అన్నట్టు మరో వార్త… టన్నెల్ బయట అప్పటికప్పుడు ఓ గుడి వెలిసింది… అక్కడ రోజూ పూజలు చేస్తున్నారు… ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే కలిసిరాక అక్కడ మొక్కుతున్న ఫోటో ఇంట్రస్టింగ్ అనిపించింది… చాన్నాళ్లుగా తను అక్కడే ఉంటున్నాడు… ఇదీ ఆ ఫోటో… ఈ వార్తలో నీతి ఏమిటంటే… ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు…
Share this Article