అదేదో సినిమాలో భీకర విలన్ గాడు పాముతో కాట్లు వేయించుకుంటూ వికటాట్టహాసం చేస్తుంటాడు… కళ్లు అరమోడ్పులు… ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఆ విషాన్ని, ఆ కాట్లను..! అదేమిటి, పాము విషం రక్తంలో కలిస్తే ప్రాణం పోదా అంటారా..? అప్పట్లో పున్నమినాగు సినిమా చూశారు కదా, చిరంజీవి కెరీర్ మొదట్లో వచ్చిన సినిమా…
కొద్దికొద్దిగా విషాన్ని తాపిస్తూ ఉంటాడు చిరంజీవిని పెంచినాయన… తరువాత తనే ఓ పాములా విషపూరితం అవుతాడు, అది వేరే కథ… క్రియేషన్… అంతెందుకు..? చాణుక్యుడు కూడా ఇదే పద్ధతిలో ఓ విషకన్యను పోషిస్తాడు తెలుసు కదా… సరే, ఆ కథలన్నీ తరువాత… ప్రస్తుతం రేవ్ పార్టీల్లో పాము విషాన్ని డ్రగ్స్‌లా తీసుకోవడం ట్రెండ్…
ఈ తొక్కలో విస్కీలు, టెకీలాలు ఎవరికీ ఆనడం లేదు… గంజాయి, ఇతర డ్రగ్స్ కూడా పెద్దగా ఎక్కడం లేదు… ఇంకేదో కావాలి..? కొత్తగా… ఇంకా మత్తుగా… దానికి దొరికిన మార్గమే పాము విషం… అబ్బే, మీరు పాతకాలంలో ఉన్నారు ఇంకా, అదెప్పుడో స్టార్టయింది అంటారా..? కావచ్చు… ఈ తరం చాలా ముందుకెళ్లిపోయింది… ‘ఒరేయ్, ఒరేయ్, ఎవుడ్రా మీరంతా’ అనుకుని నోరు, కళ్లప్పగించి విస్తుపోవడమే… కొద్దిగా పాము విషం ప్రమాదకరం ఏమీ కాదట, అదీ డ్రగ్‌లాగా బ్రెయిన్‌ను ఓ రకం మత్తులో ముంచెత్తుతుందట కాసేపు…
Ads
తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఓ రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేశారు… అక్కడికి పాము విషాన్ని సరఫరా చేశాడని ఒక యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ను అరెస్టు చేశారు… జుడిషియల్ కస్టడీకి పంపించారు… ఇతను గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ కూడా..! 26 ఏళ్ల ఈ యూట్యూబర్ పాము విషాన్ని సరఫరా చేసిన రేవ్ పార్టీలో పోలీసులు కొన్ని శాంపిళ్లు సేకరించారు… వాటిలో పాము విషం ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలు తేల్చేశాయి… దాంతో సదరు సరఫరాదారును జైలుకు పంపించారు… అరెస్టుకు ముందు తనను ప్రశ్నించారు గానీ అదుపులోకి తీసుకోలేదు…
తనే కాదు, మరో ఆరుగురిపైనా Wildlife (Protection) Act and IPC Section 120A (criminal conspiracy) కింద కేసులు పెట్టారు… మరి పాము విషాన్ని కూడా నార్కొటిక్ జాబితాలో చేర్చవచ్చుకదా, ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎందుకు పెట్టడం అనే ప్రశ్న తడుతోందా..? నిజమే… డ్రగ్స్ జాబితాలో పాము విషం లేదు కదా, సో, నార్కొటిక్స్ కేసు వర్తించదు…
రేవ్ పార్టీ జరుగుతున్నప్పుడే దాడి చేసిన పోలీసులు అక్కడ తొమ్మిది పాములను రక్షించారు… వాటిల్లో విషగ్రంథులు తొలగించబడ్డాయి… వాటిల్లో ఐదు నాగుపాములు… అక్కడ కొంత విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు… ఎహె, నాన్సెన్స్, పోలీసుల ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు, అంతా ఫేక్ అని ఎల్విష్ ఖండించాడు… బోలెడు రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వినోద ఔషధంగా వాడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు… పాము విషాన్ని నేరుగా డ్రింక్‌లో కలుపుకోవడం ఒక పద్ధతి కాగా, దాన్ని పౌడర్ చేసి డ్రింక్‌లో కలుపుకోవడం మరో పద్ధతి అట… ఎల్విష్ సరఫరా చేసిన పార్టీలో డైరెక్ట్ విషమే (రా వీనమ్), నో పౌడర్…
ఈ రేవ్ పార్టీలో పామువిషం సమాచారం ఇచ్చిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అధికారి ఒకరిని ఎల్విష్ నీ వెన్నుపూస విరిచేస్తానురోయ్ అని బెదిరించాడు… దీనిపై మరో కేసు నమోదైంది… అరుదైన జాతికి చెందిన పాముతో ఓ వీడియో చేశాడు, అది మరో కేసు… ఇప్పుడు అనాలనిపిస్తోందా..? ‘‘ఒరేయ్ ఒరేయ్… ఒవుర్రా మీరంతా..?’’ అవునూ, నాలుగు రోజులకు ఈ పాము విషాలు కూడా ఆనవు, అప్పుడు నెక్స్ట్ ఏమిటో మత్తు సాధనం..?!
Share this Article