ఎస్… సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి… కొన్ని సీన్లను ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యేలా చిత్రీకరించారు… ప్రత్యేకించి రజాకార్ల ఆగడాలను ఆ కాలంలోకి తీసుకెళ్లి, రక్తం సలసలమరిగేలా తెర మీద ఆవిష్కరించారు… భీమ్స్ సిసిరోలియో బీజీఎం సీన్లను ఎలివేట్ చేసింది… స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది… రజ్వీ పాత్ర చేసిన నటుడు రాజ్ అర్జున్ ఇరగదీశాడు… స్వతంత్రం రాకపూర్వం తెలంగాణలోని పరిస్థితులను కళ్లకు కట్టింది సినిమా… ఎఫెక్టివ్ ప్రజెంటేషన్… ప్రస్తుత తరానికి తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ కన్నీళ్లు, అనుభవించిన వేదన, వినిపించిన రోదన, అపరిమితమైన వివక్ష తెలియవు… ఎంతోకొంత ఈ సినిమా చెప్పింది… సరే…
రజాకార్ల ఆగడాలు నిజమే… నాటి తెలంగాణ (హైదరాబాద్ సంస్థానంలో ఓ భాగం) కడగండ్లూ నిజమే… నిర్మాత ఆశించిన పరిమిత ప్రయోజనం మేరకు దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమా తీయడంలో మంచి మెరిట్ చూపించాడు… చూపిన అకృత్యాలన్నీ నిజాలే… కానీ ఈ రజాకార్ సినిమా నిర్మాత బీజేపీ మనిషి… సరిగ్గా ఎన్నికల ముందే సినిమా రిలీజ్… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే రిలీజ్ కావల్సింది… సో, సహజంగానే సాయుధ పోరాట చరిత్రను తమ పార్టీ యాంగిల్‌లో చెప్పడానికే ప్రయత్నం బలంగా జరిగింది… కథలో ప్రధానంగా మతాన్ని, మతమార్పిళ్లను, మతోన్మాదాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించారు…
నెహ్రూను సైడ్ లైన్ చేసేసి, పటేల్‌ను ఎత్తుకున్నారు… కమ్యూనిస్టుల పాత్రను తేలికగా తీసిపడేశారు… బీజేపీ యాంగిల్‌లో మాత్రమే చరిత్రను చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ… అక్కడక్కడా సహజంగానే కొంత క్రియేటివ్ లిబర్టీ… హింస… నిజానికి సంక్షిప్తంగా, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాట అసలు స్పూర్తిని ప్రదర్శించలేకపోయిందని చెప్పొచ్చు…
Ads
సాయుధపోరాటం కేవలం మతహింసకు, రజాకార్ల మతోన్మాదానికి మాత్రమే వ్యతిరేకంగా సాగిన పోరాటం కాదు… నిజాం పోలీసులు, రజాకార్ల అండతో పల్లెల్లో భూస్వాములు, దొరలు సాగించిన అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం… బడుగు జీవులను బందూకులు పట్టించి రాజ్యంపై వీరోచితంగా తిరుగుబాటు చేయించిన చరిత్ర అది… కమ్యూనిస్టుల పాత్రను ఏమాత్రం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు… కమ్యూనిస్టుల చరిత్ర పుస్తకంలో తెలంగాణ పోరాటం ఓ స్వర్ణ అధ్యాయం… ఐతే దానికీ ట్విస్టులున్నయ్…
భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి ఎంటర్ కాగానే కమ్యూనిస్టులు సైలెంట్ కాలేదు సినిమాలో చూపించినట్టు..! దేశం నడిబొడ్డున ఓ మతరాజ్యం మంచిది కాదని అనుకున్నట్టే పటేల్ ఓ కమ్యూనిస్టు రాజ్యమూ వద్దనుకున్నాడు… అందుకే భారత సైన్యం హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాక కూడా కమ్యూనిస్టులు – ఇండియన్ ఆర్మీ పోరాటం సాగింది… నిజానికి రజాకార్లు, నిజాం పోలీసుల చేతుల్లో మరణించిన కమ్యూనిస్టులకన్నా యూనియన్ ఆర్మీ చేతుల్లో మరణించినవారే ఎక్కువ అంటారు… చాన్నాళ్లు నిర్బంధం కొనసాగింది… తరువాత కమ్యూనిస్టులు రిట్రీట్ ప్రకటించి, పార్లమెంటరీ పంథాలోకి వచ్చేశాక గానీ నాటి చారిత్రక పోరాటానికి ఫుల్ స్టాప్ పడలేదు… ఏ నిజాం అండతో అరాచకాలు సాగించారో ఆ భూస్వాములందరూ కాంగ్రెస్‌లోకి చేరిపొయి పవిత్రులైపోయారు… రాను రాను నాటి పోరాటానికి నాటి గడీలు, బురుజులు సాక్షీభూతంలా నిలిచిపోయాయి…
రజ్వీ తప్పించుకునే ప్రయత్నం, అరెస్టు వరకూ వోకే… కానీ తన విడుదల, పాకిస్థాన్ వెళ్లిపోవడం, పాకిస్థాన్ ఆశ్రయం, ఆ కుటుంబానికి చట్టసభల్లో చోటు, రీసెంటుగా రజ్వీ వారసులు తమ మూలాల్ని వెతుక్కుంటూ హైదరాబాద్ రావడం, మజ్లిస్ పార్టీ పుట్టుక, దాని వారసత్వ మూలాలు గట్రా ఇంకాస్త యాడ్ చేస్తే బాగుండేదేమో, పనిలోపనిగా కమ్యూనిస్టుల వెనుక ఉన్న దేశాల పాత్రనూ ప్రస్తావిస్తే బాగుండేదేమో అనిపించింది… పటేల్ ఎందుకు హైదరాబాద్ మీద బాగా కాన్సంట్రేట్ చేశాడనే సబ్జెక్టు చాలా విస్తృతమైంది… సినిమాలో ఎక్కువగా మతం పేరిట సాగిన హింసను ఫోకస్ చేశారే తప్ప నిజంగా సాయుధ పోరాటం ఎందుకు జరిగింది..? హైదరాబాద్ విమోచన తరువాత కూడా ఎందుకు సాగింది..? చివరకు ఎక్కడ ఆగింది అనే ట్రూస్టోరీని చెప్పలేకపోయినట్టు అనిపించింది… ఆ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం… దాన్ని ప్రధానంగా ఫోకస్ చేయలేకపోయింది సినిమా… అఫ్‌కోర్స్, నిర్మాతల లక్ష్యమూ అది కాదు…
సాయుధ పోరాట చరిత్రలో చెప్పదగిన పలు అంశాల్ని ప్రభావవంతంగా ఓ దండలా గుచ్చి ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేశారు గానీ… దారం వంటి స్పిరిట్ మాటేమిటి..? కమ్యూనిస్టులు సాగించిన పోరాటంలో ప్రతి పల్లె కదం తొక్కడానికి, ప్రతిఘటించడానికి ప్రధానంగా చాలా కారణాలున్నయ్, అందులో రజాకార్ల మతోన్మాదం కూడా ఒకటి… కానీ మతమొక్కటే ప్రధాన కారణం కాదు… అందుకే చరిత్ర తెలిసినవాళ్లకు ఈ సినిమా తీసుకున్న లైన్ అంతగా నచ్చకపోవచ్చు… సగటు ప్రేక్షకుడికి మాత్రం బాగానే ఎక్కుతుంది..!
Share this Article