ఇక టాటా బ్యాంకు! బిర్లా బ్యాంకు!
———————-
అర్థశాస్త్రం అందరికీ అర్థం కాదు. అర్థం కానిదే అర్థశాస్త్రం అనబడునేమో. అర్ధ భాగం అర్థమైనా సరే అది చాలా గొప్పే… ధనమేరా అన్నిటికీ మూలం అన్నదే సామాన్యులకు అర్థమయిన అర్థశాస్త్రం. సామాన్యులు ధనం దాచుకోవడానికి తమ ఇళ్లు భద్రం కాదని- బ్యాంకుల్లో, బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటూ ఉంటారు. సులభంగా వైట్ కాలర్ ఎగరేసి దోచుకోవడానికి బ్యాంకులే అత్యంత అనువైనవని కొందరు నిరూపిస్తూ ఉంటారు.
Ads
మనం రుణం తీసుకుంటే పది లేదా పన్నెండు శాతం వడ్డీ వసూలు చేసే బ్యాంకులు- మన డిపాజిట్ల మీద మహా అయితే ఆరు శాతం వడ్డీ చెల్లిస్తే గొప్ప. అది బ్యాంకు దయ- మన ప్రాప్తం. బ్యాంకుల ధర్మం. సామాన్యుల డబ్బులు వేల కోట్లు పోగు కాగానే బ్యాంకులు ఒకరిద్దరికి వేల కోట్ల రుణం ఇస్తాయి. ఆ ఒకరిద్దరు లండన్లో ఎముకలు కొరికే చలికి సిగరెట్ తాగుతూ బకింగ్ హామ్ ప్యాలెస్ వీధి ఫుట్ పాత్ మీద ఎవరో గుర్తుపట్టి చెప్పేవరకు ప్రపంచానికి ఆ ఒకరిద్దరు విల్ఫుల్ డిఫాల్టర్లు విల్ఫుల్ గా పెట్టే బేడా సర్దుకుని, విల్ఫుల్ గా విమానమెక్కి, విల్ఫుల్ గా బ్యాంకుల గోచీగుడ్డ కూడా లాగేశారని తెలియదు.
జాతికి బాగా ఉపయోగపడాలని బ్యాంకులను జాతీయం చేస్తే- ఆ బ్యాంకులనే జాతీయం చేసే బడా బాబులు ఉంటారు. బ్యాంకులు మునిగి మునిగి సామాన్యుల దృష్టిలో పలుచనయ్యాయి. పేరు పోగొట్టుకున్నాయి. ఎస్ బ్యాంక్, నో బ్యాంక్ , హై బ్యాంక్, లో బ్యాంక్, డెఫ్ బ్యాంక్, డంబ్ బ్యాంక్, దీన బ్యాంక్ … అని పేరులోనే బ్యాంకు భవితవ్యం స్పష్టంగా దృగ్గోచరమయ్యేలా ఉంటాయి. అయినా మన చర్చ బ్యాంకులు ఎలా అదృశ్యమవుతాయి అని కాదు కాబట్టి ఆ విషయాలను ఇక్కడికి వదిలేద్దాం.
భారత దేశంలో యాభై వేల కోట్ల రూపాయలకు పైగా నగదు నిల్వలున్న టాటా, బిర్లా, రిలయన్స్, ఎల్ అండ్ టీ లాంటి బడా కంపెనీలు ప్రయివేటు బ్యాంకులు పెట్టుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్- ఆర్బిఐ అనుమతులు ఇవ్వడానికి విధానపరంగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక రుణాలు ఇవ్వాల్సిన ఒత్తిడి, ఇచ్చి తిరిగి రాబట్టుకోవడంలో ఇబ్బందుల నుండి బయటపడవచ్చని ఆర్ బిఐ భావిస్తోంది. కొంతవరకు అది నిజం కావచ్చు. ఇప్పటికే ఐసిఐసిఐ లాంటి ప్రయివేట్ బ్యాంకుల లీలావినోదాలు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బ్యాంకులను జాతీయం చేస్తే- ఇప్పుడు బ్యాంకులను ప్రయివేటు పారిశ్రామిక పెద్దల చేతిలో పెడుతున్నారు.
నెమ్మదిగా రైళ్లు, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి…లాంటి గొప్ప ప్రభుత్వ సంస్థల భవితవ్యం మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మంచి కుక్కను చంపడానికి ముందు కాల్ ఇట్ మ్యాడ్! అని ఇంగ్లీషులో ఒక సామెత. అలా వేల, లక్షల మందికి ఉపాధి కల్పించి, దశాబ్దాలుగా లాభాల్లో నడిచిన ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు దీనంగా దిక్కులు చూస్తున్నాయి. కాల్ ఇట్ మ్యాడ్- అండ్ గివ్ ఇట్ టు ప్రయివేట్! అన్నది ఇప్పటి సామెత.
ప్రయివేటు బ్యాంకులన్నీ చెడ్డవి కాకపోవచ్చు. సక్రమంగా పనిచేస్తున్న ప్రయివేటు బ్యాంకులు చాలా ఉండవచ్చు. కానీ- ఒక సర్వతంత్ర స్వతంత్ర సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ప్రయివేటు బ్యాంకులే మిగిలి- ప్రభుత్వ బ్యాంకులు కనుమరుగు అయితే ఏమి జరుగుతుందో ఎవరికివారు ఊహించుకోవాల్సిందే!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article