.
దిగువన ఓ ఫేస్‌బుక్ రీల్ ఉంది చూడండి వీలైతే… పది వేల మంది అయ్యప్ప భక్తులు ఓ గుట్ట చుట్టూ… స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు సామూహికంగా…
ఆ ప్రాంతం స్వామి నామస్మరణతో మారుమోగిపోతోంది… ఈ దృశ్యం నచ్చింది… ఎందుకు నచ్చిందో చెప్పాలంటే… సింపుల్…
Ads
చినజియ్యరుడు, కేసీయార్ అనే పెద్దజియ్యరుడు కలిసి ఈ ప్రాంత ఇష్టదేవుడు యాదగిరి నర్సన్నను పేద భక్తుడికి దూరం చేశారు కదా.,. ఇప్పుడిప్పుడే స్థానికులు, సగటు భక్తులు మళ్లీ గుడిని రీఓన్ చేసుకుంటున్నారు… తమ పాత నర్సన్నను దర్శనం చేసుకుంటున్నారు… ఆ మార్పు నచ్చింది… ఆ మార్పు అందుకే నచ్చింది…
https://www.facebook.com/reel/889808236304184
ఆలయ పునర్నిర్మాణం తప్పు కాదు… కానీ వేయిన్నర కోట్ల ఖర్చుతో ఓ భారీతనాన్ని ఆపాదించారు, కానీ పురాతనాన్ని చెల్లాచెదురు చేశారు… కొన్నిచోట్ల పాతదనంలోనే అనిర్వచనీయ పవిత్రతో, ప్రశాంతతో కనిపిస్తుంది… ఆ పాతదనాన్ని పోగొట్టుకోవద్దు, కాపాడుకోవాలి… అదీ లోపించింది… స్థంభాలపై పార్టీ పథకాలు, నాయకుడి బొమ్మల వివాదాలూ తెలిసినవే కదా…
ఏళ్లుగా అక్కడ కనిపించే పాజిటివ్ వైబ్స్ కనిపించకుండా చేశారు… అక్కడికి వెళ్తే ఓ భారీ కట్టడం (ఈరోజుకూ భారీవర్షం వస్తే లోపల కురుస్తుంది…) బాపతు ఆర్కిటెక్చర్ అబ్బురపరుస్తుందేమో గానీ.., ఓ ఆధ్యాత్మిక భావనతో భక్తిగా కళ్లుమూసుకుని పరవశించే వాతావరణం లేకుండా చేశారు…
రాత్రి నిద్ర లేదు, కల్యాణకట్ట లేదు, పుష్కరిణిలో స్నానాళ్లేవు… గుట్ట మీదకు కారు వెళ్లాలంటే 500… ఎండల్లో, వానల్లో అక్కడ కాసేపు కూర్చునే వెసులుబాటు లేదు… చివరకు కాశిదారాలు, దేవుడి బొమ్మలు అమ్మేవాళ్లనూ తరిమేశారు… గుడి లోపల హంగులు, అట్టహాసాలు తప్ప ఇంకేమీ లేకుండా చేశారు…
దాంతో అందరిలోనూ ఓ బాధ… తెలంగాణలోని ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని తమకు గాకుండా చేశారని..! ఇప్పుడు మార్పు కనిపిస్తోంది… పాత గుట్టను తీసుకురాలేరు గానీ… భక్తులు ఎక్కువగా రావడానికి, తమ నర్సన్నే అనే భావన పునరుద్దరణకు ప్రయత్నం జరుగుతోంది… ఇదీ నా అవగాహన…
స్థానికులకు వారంలో ఒకరోజు విశేష దర్శనాలు ఆ దిశలో తీసుకున్న నిర్ణయమే… గిరి ప్రదక్షిణను పాపులర్ చేశారు… అన్నవరంలో జరగనన్ని సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి… చిన్న చిన్న వెండర్స్ కనిపిస్తున్నారు పైన… ఒక సందడి కనిపిస్తోంది… సందడి లేని తీర్థం ఓ తీర్థమేనా..?
తాజాగా పది వేల మంది అయ్యప్ప భక్తులను ఆహ్వానించారు,.. అంతా ఆ చుట్టుపక్కల వాళ్లే వస్తారు కదా… వచ్చారు… గిరిప్రదక్షిణ చేసుకున్నారు… అందరికీ అంతరాలయ దర్శనం చేయించారు… పద్ధతిగా, సాఫీగా సాగిపోయింది… అందరికీ ప్రసాదంగా సిర, లడ్డూ ఇచ్చారు… ఇదే స్థానికులు రీఓన్ చేసుకోవడం అంటే… చేయించడం అంటే..!
నిజంగానే ఆగమం అనుమతిస్తుందో లేదో తెలియదు గానీ… ఆ గుట్ట పరిసరాల్లోనే అయ్యప్పను ప్రతిష్టిస్తే… శబరి దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన తీర్థంలో మన దీక్ష విరమణకు అవకాశం దొరికితే..? సాధ్యాసాధ్యాలు తెలియవు గానీ… రఫ్‌గా ఓ ఆలోచన..
తిరుమల స్వర్ణగోపురంకన్నా ఎత్తయిన స్వర్ణగోపురం తయారవుతోంది… అంటే బంగారు తాపడం పనులు సాగుతున్నాయి… అన్నీ బాగున్నాయి కానీ… సగటు భక్తుడు కోరుకునేది ఎలా ఉంటుందంటే..? అక్కడే కేశఖండనం చేసుకోవాలి, ఆ పుష్కరిణిలో మునగాలి, రాత్రి అక్కడే నిద్ర చేయాలి… ఇప్పుడున్న రద్దీకి గుట్టపైన అవన్నీ పునరుద్దరించడం సాధ్యం కాకపోవచ్చు…
కానీ బలంగా సంకల్పిస్తే రాత్రి నిద్రకు ఏర్పాట్లు పెద్ద కష్టం కాదు… గుడి అనేది దర్శనం కోసమే కాదు, గుడి ధర్మప్రచార వేదికగా కూడా ఉండాలి… ఆ దిశగా ఇంకేమైనా ఆలోచనలు చేస్తే… మన నర్సన్న శాంతరూపంలో ఆశీర్వదిస్తాడు…!!
రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సంకల్పిస్తే… ఇక్కడ పెట్టినట్టు వందల కోట్లు, భారీ పునర్నిర్మాణాలు అవసరం లేదు… కొండగట్టు, వేములవాడ, భద్రాచలం క్షేత్రాలను టెంపుల్ టూరిజానికి కేంద్రాలుగా మార్చవచ్చు..!!
Share this Article